Here's Everything You Need To Know About Syrian Crisis & The Massacre Happening There!

Updated on
Here's Everything You Need To Know About Syrian Crisis & The Massacre Happening There!

ఈ శతాబ్దం ఎన్నడూ చూడని నరమేధం,ఈ తరం ఎప్పుడూ ఎరగని మారణ హోమం,దాదాపు నాలుగు లక్షల మంది సామాన్య ప్రజలు.ఎవరి చేతుల్లో చనిపోతున్నమో,ఎందుకు చనిపోతున్నమో తెలియక చనిపోయారు,సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రజలు శరణార్ధులుగా మారి పరాయి దేశాలకి వలస వెళ్ళారు,అభం శుభం తెలియని అమాయక పసి పిల్లలు 500 మంది కేవలం వారం రోజుల్లో మరణించారు.మానవాళికి ఇంతకంటే పెను విషాదం మరోటి ఉండదు. ఈ మాట జ్ఞప్తికి వస్తేనే మనసులో ఎదో వ్యాకులత,ఏమీ చేయలేమని తెలిసినా ఎదో చేయాలనే ఆరాటం, నిశ్శహాయతతో దేవుడిని ప్రార్దించడం తప్ప ఏమీ చేయలేని అశక్తత మనది. అసలు ఈ మారణ హోమానికి కారణం ఏమిటి???దీనికి ముగింపు ఎప్పుడు??దీని వెనకున్న శక్తులు ఎవరు .....తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గతం - ఎలా మొదలయ్యింది ?

2011 లో మద్య ప్రాచ్య (Middle East Asia) దేశాలలో అప్పటి నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు సామూహిక తిరుగుబాటు చేసి పాలకులను గద్దె దిగేలా చేసారు,టునీషియా నుండి మొదలైన ఈ తిరుగుబాటు ఈజిప్టు, యెమెన్, బహ్రెయిన్,లిబియా,సిరియా దేశాలకు వ్యాపించింది .కొన్ని దేశాలలో ఈ విప్లవం సత్ఫలితాలనిస్తూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడితే,మరికొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఈ తిరుగుబాటుని అణిచివేసేందుకు హింసాయుత మార్గాన్ని ఎంచుకున్నాయి. సిరియాలో నేటి అశాంతికి బీజం అక్కడ పడింది .

సిరియాలో షియా సున్నీ వర్గాలుగా ప్రజలు ఉండేవారు,సిరియా అద్యక్షుడు షియా వర్గం వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ మెజారిటీ ప్రజలైన సున్నీలను నిర్లక్షం చేస్తున్నారనే కారణంతో అధిక సంఖ్యాకులైన సున్నీ ప్రజలు శాంతీయుత తిరుగుబాటు మార్గాన్ని ఎన్నుకున్నారు.కానీ ఈ తిరుగుబాటు నెమ్మదిగా హింసా మార్గంలోకి మళ్ళింది, తిరుగుబాటు దారులకి టర్కీ,సౌదీ,ఖతార్,జోర్డాన్,యుకే,అమెరికా,ఫ్రాన్స్ మద్దతు ప్రకటించాయి, కావాల్సిన ఆయుధ, సైనిక సరఫరా చేసాయి. 2013 లో సిరియా ప్రభుత్వం అక్కడి తిరుగుబాటుదార్ల పై రసాయన దాడులు చేసిందనే అభియోగంతో అమెరికా ఐక్య రాజ్య సమితిని ఈ విషయం పై విచారణ చేయాల్సిందిగా కోరింది,మరో వైపు తిరుగుబాటుదార్లకి కావాల్సిన సైనిక సహకారాన్ని మరింత పెంచింది. చివరకి రష్యా జోక్యంతో సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలను నిర్వీర్యం చేసేసింది .

ఒక వైపు తిరుగుబాటుదారులకి అమెరికా సహకారాలు పూర్తి స్థాయిలో అందడం,ప్రభుత్వ వ్యకిరేకత తీవ్ర స్థాయికి చేరడం,ఈ పరిణామాల నేపధ్యంలో అతి దుర్మార్గమైన ముష్కర మూక ఐసిస్ (Islamic State Of Iraq and Syria) ఆవిర్భావం జరిగింది.ఈ ఐసిస్ చేసిన దుర్మాగాలకి మనమే సజీవ సాక్షులం.

వర్తమానం – జరుగుతున్నది ఏమిటి??

తిరుగుబాటుదారులకి బయట దేశాల నుండి లభిస్తున్న మద్దతుతో కొన్ని ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సైన్యం ఈ తిరుగుబాటుదారులని అణచివేసి,ఆ ప్రాంతాలని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో సైనిక చర్యకి దిగి బాంబులతో దాడులు చేస్తోంది,బహార్-అల్- అసద్ ప్రభుత్వానికి మద్దతుగా కొన్ని దేశాలు సైనిక సహకారాలు ఇస్తూ రెబెల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.ఈ వారం రోజులుగా రెబెల్స్ ఆదేనంలో ఉన్న రక్ఖా,తూర్పు ఘౌటా ప్రాంతంలో సైన్యం వైమానిక దాడులు చేయడం వల్ల ప్రజలు అధిక సంఖ్యలో దుర్మరణం పాలవుతున్నారు. సామాన్య ప్రజలు ఈ పోరులో బలవుతున్నారు.

ప్రభుత్వం మీద అసంతృప్తితో మొదలై శాంతియుత పోరాటంగా మొదలైన ఉద్యమం నేడు తిరుగుబాటుగా మారి అంతర్గత యుద్దమై దానిని అణిచివేసేందుకు సైనికులకీ – తీవ్రవాదులకీ మద్య ప్రచన్న పోరుగా మారి సామాన్యులని బలి తీసుకుంటున్నది.

అహంకారానికీ – అధికారానికి – ఆధిపత్యానికి – ఆరాచక శక్తులకీ,ఉగ్రవాదానికీ – అగ్రవాదానికి, మూర్ఖత్వనికీ-మూడత్వానికీ,మద్య జరుగుతున్న యుద్ధంలో రక్తమోడుతున్నది ఏ పాపం తెలియని పసివాళ్ళు, ఏ తప్పూ చేయని అమాయకులు.

గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో నెత్తురోడని రోడ్డు లేదు,రక్త పాతం జరగని రోజు లేదు,ఎప్పుడు ఎవరు ఏ వైపు నుండి ఎలా దాడి చేస్తారో తెలియక బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు ఎందరో,అక్కడ బతుకు లేదు,బతక లేము అని తెలిసి,శరణార్ధులుగా మారి,ఓడలెక్కి సముద్రాలు దాటి పరాయి దేశాలకి వలస వెళుతున్నది ఎందరో,అలా వెళుతూ ప్రమాదాలకి గురై విగత జీవులుగా మారిన పసి బాలలెందరో.

2015లో అయిలాన్ కుర్దీ,2016లో అలెప్పో నగరం మీద భీకర దాడి,నేడు తూర్పు ఘౌటా ప్రాంతంలో మారణహోమం, ప్రపంచాన్ని కుదిపేసిన ఈ దారుణాలన్నీ జరిగింది సిరియలోనే,ఒకప్పుడు ప్రాచీన నాగరికతో ప్రపంచానికి వెలుగులు పంచిన సిరియా నేడు మరు భూమిగా మారి రక్త కన్నీరు కారుస్తుంది.భూలోక నరకంలా మారింది.నిత్యం రగిలే రావణ కాష్టం అయ్యింది .సొంత ఇల్లే సమాదిగా మారి,ఉన్న ఊరు స్మశానమై సాయం కోసం గుండె పగిలేలా అరిచే అరుపులు ఓ వైపు,వికృత క్రీడ వల్ల విగత జీవులుగా మారిన తల్లిదండ్రులను,అన్న చెల్లెలను చూస్తూ గుండె పగిలేలా రోదిస్తున్న పసి పిల్లలు ఓ వైపు,తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోడానికి ఎవరు వస్తారా అని ఎదురుచూసే పసివాళ్ళ అమాయక చూపులు మరో వైపు,మృత్యువు ఏ వైపు నుండి వస్తుందో ఎవరిని కబలిస్తుందో తెలియక బతికించు దేవుడా,అని వేడుకునే చేతులు ఇంకోవైపు.శవాల గుట్టలు,రక్తపుటేర్లు,ఆర్తనాదాలు,ఆకలి కేకలు ఇవి తప్ప మరేవీ లేవు ప్రస్తుతం.

భవిష్యత్తు – ఏం జరగబోతుంది

ఈ సమస్యకి పరిష్కారం చిన్న దేశాలు చెప్పలేవు,వాటికి అంత బలం లేదు కనుక.పెద్ద దేశాలు పట్టించుకోవు,వాటికి అవసరం లేదు కనుక,ఒక వేళ ఉన్నా అది అక్కడి సంపద మీద తప్ప ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేలా ఏ చర్యలూ తీసుకోవు. ఎవరు ఎవరికి అనుకూలంగా మాట్లాడితే అది ఎటు దారి తీస్తుందో అని మౌనమే మేలని అందరూ రగులుతున్న ఆ చితి మంటలపైన చలి కాచుకుంటున్న వారే.

మరి కొన్ని రోజుల్లోనే సిరియాలో ప్రశాంతత రావొచ్చు,మనుషుల్ని చంపేసాక,స్మశానంలో మిగిలేది నిశభ్దమే కదా.

ఎవరి ఆర్త నాదాలు వినపడక పోవొచ్చు,రక్తపుటేర్లు కనపడకపోవొచ్చు,అందరూ శవాలుగా మారాక ఆత్మల ఘోష తప్ప మరేమీ ఉండదు కదా.

ఈ నరమేధం ముగిసాక,ఈ ప్రభుత్వాలు ఎవరిని పాలిస్తారో?

ఇంతటి నిప్పు రగిల్చి,ఆ చితి మంటల వెలుతురులో ఏ రేపటి వైపు అడుగేస్తారో ఈ పెద్ద మనుషులు ?

ఇంతటి దారుణాలు చేసాక ఆ మతోన్మాదులకి దేవుడు ఏ స్వర్గాలిస్తాడో?

ఈ తుపాకుల మోతలు ఆగాక,అవి ఏ సామాన్యులకి భద్రతనిస్తాయో??

ఈ రక్తచరిత్రని ప్రపంచం ఏ సిరాతో రాస్తుందో???

మనుషులు బాగుండాలి అని అనుకుంటాం....

కాని ఇప్పుడు మాత్రం అక్కడ మనుషులు బతికుండాలని కోరుకుందాం.....

అక్కడి పిల్లలకి భవిత ఉండాలని ప్రార్దిద్దాం ....