భారత దేశం వేదాలకు పుట్టిల్లు. ఎంతో మంది ఋషులు పండితులు తమ తరువాతి తరం వారికి అవసరమయ్యే ఎన్నో విషయాలని సూచనల్ని తమ రచనల ద్వారా, బోధనల ద్వారా తెలియజేసారు. అటువంటి మాహానుభావులలో ఒకరైన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు కాల జ్ఞానాన్ని , జీవన తత్వాలను ప్రజలకి భోదించారు. , 17 వ శతాబ్దం లో ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నేడు నిజమయ్యాయి. ఆయన రచన శైలి పండిత పామరులందరికి అర్ధమయ్యే విధంగా చాలా సులభంగా ఉంటుంది. ఆయన రాసిన ప్రతి తత్త్వం లో ఒక మకుటం కచ్చితంగా ఉండటం వల్ల అప్పట్లో ఆ పాటలని ఎంతో మంది పాడుకునేవారు. ఆయన రాసిన తత్త్వాలలో చాల మటుకు కనుమరుగు అవుతున్నాయి. వాటిలో ఒక తత్త్వాన్ని ని మన "రాయలసీమ" వీడియోలో బామ్మా గారు పాడారు. ఆ పాటలో జీవితానికి కావాల్సిన పాఠం ఉంది. ఆచరించ వలసిన బాట ఉంది, ఆ పాటలోని మాటలు ఇవి.
జీవుడెనబది నాలుగ్లచ్చలు చావుపుట్టులిక్కడ ఎవరు చేసిన పాప ఖర్మము అనుభవించేదక్కడ పంచభూతము వల్లనే ప్రాపంచమైనాదిక్కడ అంచితంబుగా నామరూపం లేని స్వరముందక్కడ తల్లి తండ్రులు అన్నదమ్ములు సతియసుతులు ఇక్కడ ఎల్లిపోయేటప్పుడు ఎవ్వరూ రారు మనతోడక్కడ దొంగమాటలు చెప్పధరణిని భంగపుచ్చుదురిక్కడ సంగతెరిగిన యముని భటులు సాగతీతురక్కడ గురువని మెడనిండ గుర్తులు వేసి తిరుగుదురిక్కడ పరమ భక్త మునీంద్రు లెల్లరు పసంధ్జేయరక్కడ నిత్యానిత్య జ్ఞానమిక్కడ నెరిగి తిరుగుదురిక్కడ... సత్య లోకం చేరుటాకు సదుపాయమున్నదాక్కడ... రంకు బొంకులు వాడిదృష్టులు రాలిపోదురిక్కడ... కాకి కత్తుల చేత భటులను కోసి వేతురక్కడ... కామ క్రోధ మోహ లోభం కాల్చివేయండిక్కడ... ప్రేమతో ఐరావతంబును చేరుకుందరక్కడ... ఇడా పింగళం మధ్య మందున ఇవరం ఎరుగుదురిక్కడ... మూడు ఏరులు దాటేవారికి ముక్తిమార్గమక్కడ... ధనము ధాన్యం చేత గర్వము నొంది తిరుగుదురిక్కడ... హాననమందున్న వేసి దగ్ధం చేసి పోదురక్కడ...
భావం: ప్రతి మనిషి, ఎన్నో పనులు చేస్తారు, వాటినే ఖర్మములు అంటారు, కానీ ఆ ఖర్మముల వల్ల జరిగే పరిణామాలు ఏంటో అనేది ఎవరు ఆలోచించరు. నిజానికి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని వీర బ్రహ్మం గారు ఈ తత్త్వం లో చెప్పారు.
ఈ ప్రపంచం లో కొన్ని లక్షల మంది పుడుతున్నారు, చనిపోతున్నారు . కానీ వారు ఇక్కడ చేసిన అన్ని పనులకి ఫలితాన్ని, పై లోకం లో అనుభవిస్తారు. ఈ ప్రపంచం పంచభూతాల కలయిక, కానీ ఎటువంటి రూపం లేని ఓంకార స్వరముంది, అది ఎప్పుడు మనల్ని గమనిస్తుంది. ఈ ప్రపంచం లో తల్లి తండ్రి, భార్య పిల్లలు అని మనకు ఎన్నో బంధాలుంటాయి. కానీ మనం చనిపోయాక ఏ బంధం మన తోడు రాదు. దొంగ మాటలు ఎన్నో చెప్తూ భూమి లో ఎన్నో మోసాలుచేస్తారు. వాటన్నిటిని యమ భటులు గమనిస్తూనే ఉంటారు . గురువని స్వాములని ఎంతో మంది ఈ ప్రపంచం లో ఉన్నారు కానీ పైలోకం లో ఎంతటి ఘనులైన అందరు సమానమే. ఏది నిత్యం, ఏది కాదు, అన్న తేడాని తెలిసి బ్రతక గలిగితే.. సత్య లోకం (స్వర్గం) చేరాటానికి అదే మార్గాన్ని చూపిస్తుంది. ఒకరి తో ఒకరు గొడవ పడుతూ చాడీలు చెప్పుకుంటూ... చనిపోతారు కానీ, పై లోకం లో భటులు వారి వారి పాపాలకు శిక్షను వేస్తూనే ఉంటారు. కామము, క్రోధము లోభము మోహము లాంటి అరిషడ్వార్గాలను ఇక్కడే కాల్చేసి, ప్రేమ తో బతికితే,చనిపోయినా కానీ బతకగలం. నిజం అబద్దం మధ్య ఉన్న తేడాని తెలుసుకుంటూ బతికితే.... చనిపోయాక మోక్షాన్ని పొందుతారు. ధనం ధాన్యం ఉన్నాయి అని గర్వంతో ఉండకండి ఎందుకంటే చనిపోయాకే అందరు భస్మం గానే మిగిలిపోతారు.
మన అమ్మమ్మ తాతయ్యలు, బడి లో దొరకని జీవన పాఠాలకు సారథులు, వారి దగ్గర నేర్చుకునే కొన్ని అనుభవాలే మన జీవితాన్ని, ఎలా జీవించాలో నేర్పిస్తాయి. అలాంటి పాఠాన్ని ఎన్నో అనుభవాలని తమలో దాచుకున్న తాతయ్యలకు అమ్మమలకు ఇవే మా నమస్కృతులు.