1993 నవంబర్ 27, నేను 7వ తరగతి చదువుతున్న రోజులలో.. ఇప్పటికి ఆ సంఘటన ఆకు పచ్చని జ్ఞాపకంగా నాలో మెదులుతూ ఉంది, ఎందుకంటే అదేరోజు కదా నేను మళ్ళీ పుట్టింది.. హైదరాబాద్ లోని మా ఇంటి డాబా మీద నేను తమ్ముడు ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరేస్తూ ఉన్నాము.. ఓ అందమైన పతంగి ఎదురుగా ఉన్న కరెంటు తీగ మీద పావురంలా వాలింది. దాన్ని ఎలా ఐనా అందుకోవాలని చెప్పి ఓ రాడ్డు సహాయంతో ప్రయత్నించాను. రాడ్డు బరువుండడం వల్ల పట్టు తప్పి హైటెన్షన్ వైర్లకు తగిలింది.. అదిగో అంతే వరకే నాకు గుర్తుంది..
ఉదయం ఉస్మానియాలో స్ప్రూహలోకి వచ్చాక తెలిసింది.. భీకరమైన కరెంట్ షాక్ కు గురి అవ్వడం వల్ల తప్పని పరిస్థితిలో నాకు ఎంతో ఆసరానిచ్చే నా రెండు చేతులు తొలగించాల్సి వచ్చిందని.. ఆ సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పింది. నేను కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. కాని ఆ రోజులు నన్ను కృంగదీయలేదు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేశాయి..
నేనంటే నాకు చాలా ఇష్టం అందుకే నా పనుల మీద ఇతరుల మీద ఆధారపడడానికి నాకు ఇబ్బందిగా ఉండేది. అమ్మ కడుపులో నుండి ఏ అనుభవం లేకుండా ఎలా వచ్చానో, తప్పటడుగులు వేస్తూ నడక ఏవిధంగా నేర్చుకున్నానో, తడబడడం నుండి అనర్గలంగా ఎలా మాట్లాడగలుగుతున్నానో ఆ విధంగానే రాయడం నేర్చుకున్నాను.. ప్రైవేట్ లో 10క్లాస్ కంప్లీట్ చేసి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత ఛార్టెడ్ అకౌంటెన్సీ వరకు చదువు కొనసాగించాను. కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నాను.. చదువుతున్నప్పటి నుండే మా అమ్మ, సోదరితో పాటుగా ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను.. దాదాపు నా పనులన్నీ నేనే చేసుకోవడం మొదలుపెట్టాను. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం.. అప్పుడే పరిచయమైనది రమ..
ప్రేమ కృత్రిమంగా పుట్టదు. కృత్రిమ ప్రేమంటే నా దృష్టిలో అది కేవలం ఆకర్షనే.. మొదటిసారి నేను "రమను చూడగానే ఈమనేనా నా జీవిత భాగస్వామి" అనే ఆలోచనలు నాలో ఏ మాత్రమూ కలుగలేదు. ఒక కొలీగ్ గా మాత్రమే నాకు తను పరిచయం. వర్క్ విషయాలు మాట్లాడుకోవడం నుండి మా సాన్నిహిత్యం పెరిగింది. మొదట కంపెనీ వ్యవహారాలపై, ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలలో ఒకే అభిప్రాయాలు ఉండడంతో మంచి స్నేహితులమయ్యాము.. ఓరోజు రమ నా దగ్గరికి వచ్చి తన మనసులోని భావాలను కళ్ళ ద్వారా, మాటల ద్వారా బయటపెట్టింది. "నీతో జీవితాంతం బ్రతకాలని ఉంది.. ప్రేమ కులం, మతం, లోపం ఇవ్వేమి పట్టించుకోదు, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు ఆనందం, నీ అభిప్రాయం ఏమిటి..?
రమ ఇలా తన భావాలను చెప్పగానే నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఎందుకో నా ప్రపంచంలోని ప్రణాళికలన్నీ ఆగిపోయాయి.. ఎప్పుడూ రమ గురించే నా ఆలోచనలన్నీ.. 15రోజులు గడిచాయి.. నా అంగీకారానికి తను థాంక్స్ చెప్పలేదు.. నాతో పాటు తను ఎంతో ఆనందపడింది.. ఆ క్షణమే ఇంతకాలం తర్వాత మేమిద్దరం మరోసారి మమ్మల్ని మేము కొత్తగా చూసుకున్నాము.. మా ఇద్దరి ప్రేమ కన్నా మా తల్లిదండ్రుల ప్రేమకు వయసెక్కువ.. అందుకే మా ప్రేమను జాగ్రత్తగా గమనించారు. మా అమ్మనాన్నలు ఒప్పుకున్నారు కాని ఎక్కడో తెలియని ఆందోళన వారి మదిలో ఉండేది.. రమ తల్లిదండ్రులు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. మా తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో "డిసెంబర్ 12 2007" శుభ ముహూర్తం మా ఇద్దరిని ఏకం చేసింది. తన తల్లిదండ్రులు రాలేదని రమ బాధగా ఉన్నా తనకు తెలుసు భవిషత్తులో ఏం జరుగబోతుందోనని..
కాలం అన్ని అనుమానాలను తీర్చింది. తన అల్లుడు ఎంతో యోగ్యుడు అని రమ తల్లిదండ్రులు, బహుశా మేము కూడా ఇంత మంచి కోడలను తీసుకురాలేమోనని మా అమ్మనాన్నలు తెలుసుకున్నారు. నాకు బ్రతకడం అంటే చాలా ఇష్టం అందులోనూ రమతో అంటే మరింత ఇష్టం పెరిగింది జీవితం మీద. కాలం మళ్ళి తన పని తాను చేసుకుంటూ పోయింది మేము ఇద్దరం కాస్త నలుగురమయ్యాం. "నువ్వు ఇప్పుడు చూసుకోవాల్సింది ఇద్దరిని కాదు ముగ్గురిని" అని నేను చెప్పగానే పెళ్ళినాటి సిగ్గు మరల తనలో సాక్షాత్కరించింది.
ప్రేమ బహుమతిచ్చిన ఇద్దరు పిల్లలు సహర్ష్, ప్రతీక్.. పెళ్ళి కానంత వరకు మాకు మేమే హీరోలం.. పిల్లలు కలిగాక వారే మాకు హీరోలు.. నిజంగా వివాహ బంధం ఎంత గొప్పదండి.. 12 సంవత్సరాలుగా డెలాయిట్ లో ఉద్యోగం మంచి జీతం, అంతకు మించిన జీవితం.. కాలం నాకు అన్ని ఇచ్చింది.. కొంతమంది నా అత్మీయులు నా గురుంచి బాధపడుతుంటారు.. నా పిల్లలకు నేను గోరు ముద్దలు తినిపించడం లేకపోతే ఏంటి నా అర్ధాంగి తినిపిస్తుంది కదా, పిల్లలకు చిన్నప్పుడు అక్షరాలు నేను దిద్దించకపోతే ఏంటి తను నా బాధ్యతను కూడా నెరవేరుస్తుంది కదా.. పెళ్ళి జరిగి ఈనాటికి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా మా మధ్యలో ఎలాంటి గొడవలు జరగలేదా అంటే నిజంగా జరుగలేదు. మా గురించి మేము పూర్తిగా తెలుసుకోవడంలో కొన్ని సార్లు తప్పుగా అంచనా వేసుకున్నాం కాని ఏనాడు గొడవలు జరుగలేదు. ప్రేమించినవారిని 100% అర్ధం చేసుకుంటే ఏ శక్తి విడదీయలేదు.. If you love someone nothing will stop.. అన్నట్టు నా కథ, మా ప్రేమ కథ చెప్పాను కాని నా పేరు చెప్పలేదు కదూ.. "నా పేరు రితేష్!! కాదు కాదు రమారితేష్..