Contributed By Raviteja Ayyagari 1994 సంవత్సరం... ఒక చల్లని వేసవి రాత్రి... ఒక మహానగరంలో చిన్న ఉపనివేశము...
సూర్యుడు మండిపడుతున్నా, తల్లులు జాగ్రత్త చెప్తున్నా, భూమి మీద ఈ రోజే ఆఖరి రోజు అనేలా విపరీతంగా ఆడుకుంటున్న పిల్లలు. అందులో 6 సంవత్సరాల ఒక అబ్బాయి చింటు. చింటు తన స్నేహితులు మట్టిలో, నీటి కొలనులో, గ్రౌండులో, అసలు భూమి మీద ఆదుకోవడానికి ఇన్ని ప్రదేశాలు ఉన్నాయా అనిపించే చోటులన్నిటిలోను ఆడుకుంటున్నారు. అలా ఆ వేసవి కాలం సరదాగా సాగిపోతోంది అనుకునే సమయంలో, ఒక రోజు చింటు వాళ్ళ నాన్న కంప్యూటర్ కొన్నారు. ఆ కాలములో కంప్యూటర్ అనే పదమే కొత్త. కాబట్టి చింటు వాళ్ళ స్నేహితులకి ఆ కంప్యూటర్ చూపించేసరికి అందరు ఆశ్చర్యపోయారు. నెమ్మది నెమ్మదిగా చింటు వాళ్ళ ఇల్లు తన స్నేహితులతో నిండిపోయింది.
నెమ్మదిగా వేసవి కాలాలు వచ్చాయి, వెళ్లాయి. ప్రతి వేసవి కాలంలో ఒకొక్కరి ఇంట్లో కంప్యూటర్ రావడం మొదలయ్యింది. నెమ్మది నెమ్మదిగా పిల్లలు బయట ఆదుకోవడం తగ్గించేశారు. 2019 సంవత్సరం... ఒక చల్లని వెన్నెల రాత్రి... అదే మహానగరం... ఇంకొక చిన్న నగరంలా మారిన అదే ఉపనివేశము...
సూర్యుడు మండిపడుతున్నా, తల్లులు వొద్దని చెప్తున్నా, భూమి మీద ఈ రోజే ఆఖరి రోజు అనేలా విపరీతంగా ఆడుకుంటున్న పిల్లలు. అందులో 31 సంవత్సరాల చింటుకి 6 సంవత్సరాల ఒకడు కిట్టు. కిట్టు తన స్నేహితులు వాళ్ళ వాళ ఇళ్లల్లో, LAN లో pubg, ఆడుకుంటున్నారు. చింటు పెద్దయ్యి, పెళ్లయి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. చింటు వాళ్ళ అబ్బాయికి స్నేహితులు ఉన్నప్పటికీ, ఇతను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. అమ్మ, నాన్నలు ఇంట్లోనే ఉన్నవే అని అడిగినప్పుడల్లా, మేము ఫోన్లో కనెక్ట్ అయ్యి ఆడుకుంటున్నాం అని అన్నాడు. చింటుకి ఆ మాట విన్నప్పుడల్లా ఇప్పటి పిల్లల గురించి తలుచుకుని జాలి వేసేది.
అలా వేసవి సెలవలు అయిపోతున్నాయి అనుకునే ఒక రోజు, నిరంతర విద్యుత్ సరఫరా అందే ఆ ఉపనివేశంలో అనుకోకుండా ఒక ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంటు పోయింది. పొద్దున్న నుంచి ఆపకుండా ఛార్జ్ చెయ్యకుండా ఫోన్ వాడడం వల్ల కిట్టు ఫోన్లో ఛార్జ్ అయిపొయింది. ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి బోర్ కొడుతోంది అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న వాడిని ఇంటి బయట వీధిలోకో తీస్కుని వెళ్లి, సరదాగా క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు.
ఇంటి బయట ఏవో అరుపులు విన్పిస్తున్నాయి అని, ఒకొక్క పిల్లాడు బయటకి చూసారు. అందరు ఒకేసారి బయటకి వచ్చి మేము కూడా ఆడతాం అని చేరారు. ఇదంతా చుసిన చింటు కి ఒక్కసారిగా తన చిన్నప్పటి వేసవి సెలవలు గుర్తొచ్చాయి. ఒక్కసారిగా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. కంప్యూటర్ వచ్చిన తర్వాత జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ఎలా మర్చిపోయామా అని ఆలోచిస్తూ రోడ్ మీద ఆడుకుంటూ అల్లరి చేస్తున్న పిల్లలని చూస్తూ నవ్వుతు నిలుచున్నాడు.
టెక్నాలజీకి నేను వ్యతిరేకం కాదు. కానీ టెక్నాలజీ జీవితం కాదు. మన జీవితంలో మన వీధి గుమ్మం బయట నిల్చుని మన అనుకునే వాళ్ళతో సంతోషంగా గడిపిన క్షణాలే మన ఆఖరి క్షణాలలో జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలని ఒక్కొక్కటి గా పేర్చుకుని జీవితం అనే అందమైన ఆల్బం ని నిర్మించుకుందాం. జై హింద్