మనదేశం ఎదుర్కుంటున్న పెద్ద సమస్య ఉగ్రవాదం. పాకిస్తాన్ కేంద్రంగా దేశాన్ని నాశనం చెయ్యడానికి అక్కడి విషపాములు చొరబడుతున్నాయి. ఇదే క్రమంలో జనవరి 23న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆలమ్ జాబ్ అఫ్రిదీ ని ప్రాణాలకు తెగించి పట్టుకున్నందుకు భారత ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి గారి చేతులమీదుగా కే. శ్రీనివాస్ గారికి ప్రతిష్టాత్మక శౌర్యచక్ర అవార్డునందించింది. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా మొత్తం 12మందికి శౌర్యచక్ర అందించింది, మనదేశంలోనే ఒక పోలీస్ కానిస్టేబుల్ కి శౌర్యచక్ర అవార్డ్ రావడం ఇదే తొలిసారి.
1998లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన శ్రీనివాస్ గారు గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ లో నిజాయితీతో కూడిన సర్వీస్ చేశారు. ఆలమ్ అఫ్రీది గురించి చెప్పాలంటే ఒక పెద్ద కథే ఉంది. వీడి జీవిత లక్ష్యం మన దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేయ్యడం. ఈ లక్ష్యంతోనే దేశంలో చాలా రకాల దాడులు చేశాడు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పేళుళ్ళలో దాదాపు 30పేళుళ్ళలో వీడి హస్తం ఉందని కేసులు నమోదు అయ్యాయి. ఐతే వీడు సాధారణ సామాన్యుడులానే జనాలలో కలిసిపోయి నేరాలు చేస్తుండేవాడు. ప్రస్తుతం కర్ణాటక పరప్పణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవ్వరికి అనుమానం రాకుండా ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు. వీడి గురించి ఇంటెలిజెన్స్ వారికి పక్కా సమాచారం రావడంతో కే. శ్రీనివాసులతో సహా ముగ్గురు పోలీసులు అక్కడికి వెళ్ళారు. పోలీసులు నన్ను పట్టుకోడానికే వచ్చాడని తెలుసుకున్న అఫ్రీది బైక్ మీద పారిపోవడానికి ప్రయత్నించాడు..
శ్రీనివాసులు అఫ్రీదిని అడ్డగించడంతో కత్తి తీసుకుని కడుపులో బలంగా పొడిచాడు. ఈ సమయంలో సాధారణంగా ఏ అధికారి ఐనా నిందితుడిని పట్టుకోవడం కన్నా తన ప్రాణాలనే కాపాడుకోడానికి ప్రయత్నిస్తాడు కాని శ్రీనివాసులు మాత్రం ఒక పక్క కత్తితో పొడిచినందుకు పేగులు బయటకు వచ్చి రక్తం కారుతున్నా కాని ఆగకుండా అక్కడే ఉన్న ఒక చిన్న క్లాత్ ముక్కతో గాయమైన చోట కట్టు కట్టుకుని వేగంగా పరిగెత్తి ఉగ్రవాది అఫ్రీదిని పట్టుకున్నాడు. అఫ్రీదిని అదుపులో తీసుకున్న తర్వాతనే శ్రీనివాసులు హాస్పిటల్ కు వెళ్ళారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా బయటకు వచ్చి తిరిగి తన ఉద్యోగాన్ని అంతే ధైర్యంగా నిర్వహిస్తున్నాడు.