"విప్లవ కవి" అంటే మనకు టక్కున గుర్తొచ్చేది శ్రీ శ్రీ గారు. తెలుగు సాహితీ ప్రయాణంలో శ్రీ శ్రీ గారికి ముందు తర్వాత అన్న ఒక బలమైన గుర్తింపు ఆయనకు దక్కింది. శ్రీ శ్రీ గారి రచనలను ఇప్పటికి దైవంగా భావించేవారు ఎందరో.. అంతటి మహా శ్రీ శ్రీ గారు అభిమానించే అతితక్కువ రచయితలలో ఒకరు "చెరబండరాజు". చెరబండరాజు గారి అసలైన పేరు బద్ధం భాస్కర్ రెడ్డి. కవి కులం పేర్లు తగిలించుకోకూడదు అని తన సాహిత్యానికి సరితూగే పేరు చెరబండరాజుగా కలం పేరు మలుచుకున్నారు. నల్గొండ జిల్లా అంకుశాపురంలో చెరబండరాజు గారు ఉదయించారు. వారిది ఓ పేద రైతుకుంటుంబం. పల్లెలో కష్టజీవులు పాడుకునే కూని రాగాలే ఆయనకు పాటశాల అయ్యింది. ఇంకా శరత్ చంద్ర, రవీంద్రనాథ్ సాహిత్యంతో మరింత రాటుదేలారు. ఒక పక్క ఉపాధ్యాయుడిగా శక్తివంతులైన విద్యార్ధులను తయారుచేస్తూ, మరో పక్క ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ, ఇంకోపక్క తన భావాలను విప్లవ సాహిత్యంతో విశ్వవ్యాప్తం చేశారు. కొన్ని సందర్భాలలో తనపై భౌతికదాడులు ఎదురైనా కూడా ఏ ఒక్కరికి బెదరక అడుగును ముందుకే సాగించారు. చెరబండరాజు అంటే కేవలం మాటలకే పరిమితమైన కవి కాదు, ఆయన జీవితం కూడా ఆయన కవిత్వం లానే ఉదృతంగా సాగింది. "దిక్సూచి, ముట్టడి, గమ్యం, కాంతియుద్ధం, గౌరమ్మ కలలు, జన్మహక్కు, పల్లవి, కత్తిపాట, మా పల్లె, ప్రస్థానం, నిప్పులరాళ్లు, గంజీనీళ్లు అనే రచనలను సమాజంపై సంధించారు.
చెరబండరాజు గారి కొంత అక్షర విప్లవం..
ముంజేతిని ఖండించినా నా పిడికిటి కత్తి వదల.! దేశమేదైతేనేం మట్టంతా ఒక్కటే.. తల్లి ఎవరైతేనేం చనుబాల తీపంతా ఒక్కటే.
వీళ్ల నరనరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు.. చూస్తారు.. నాకుతున్నట్టు, నవ్వుతారు.. ఉమ్మినట్టు, కనిపిస్తారు.. మనుషుల్లానే, అబద్దాలాడక పూటగడవదు, ఆత్మీయుల్ని లాభనష్టాల త్రాచులో తూచందే నిద్రపోరు.!
కొండలు పగలేసినం.. కొండలు పగిలేసినం బండలనూ పిండినం.. మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో! బంజర్లను నరికినం.. పొలాలనూ దున్నినం మా చెమటలు ఏరులుగా పంటలు పండించినం గింజెవడిదిరో.. గంజెవడిదిరో..!
మగ్గాలను పెట్టినం.. పోగు పోగు వడికినం మా నరాలె దారాలుగ గుడ్డలెన్నొ నేసినం ఉడుకెవడిదిరో.. వణుకెవడిదిరో..!
యంత్రాలను తిప్పినం.. ఉత్పత్తులు పెంచినం మా శక్తే విద్యుత్తుగ ఫ్యాక్టరీలు నడిపినం మేడెవడిదిరో.. గుడిసెవడిదిరో..!
కారణాలు తెలిసినం.. ఆయుధాలు పట్టినం మా యుద్ధం ఆపకుండ విప్లవాలు నడిపెదం చావు మీదిరో.. గెలుపు మాదిరో.!
అవకాశవాద పెత్తందారుల బూట్లు నాకుతూ వాళ్ళ నీడల్లోనే నువ్వు భవంతులు కట్టుకున్నావు ఆ పునాదులు కదిలేలోపు నిన్ను పంపిస్తాను, లేదు, జైలుకి మాత్రం కాదు కసాయి కొట్టుకి.!
కౌలికిచ్చినోడు కన్నెర్ర సేసేడు అప్పులిచ్చినోడు ఆలినే సూసేడు దయజెప్పు సర్కారు దాదాలె అయ్యేరు నీ దారి గోదారి-రామన్నా..
ఈ సువిశాల ప్రపంచ జీవశాలలో సిసలైన న్యాయస్థానం యెక్కడైనా వుంటే నన్నెక్కనివ్వండి బోను..
ఏ సరిహద్దుల శాసనసర్పాలు నీ పాదాల్ని బంధిస్తున్నాయ్ ఏ శిఖండి ప్రభుత్వాలు నీ చేతుల్ని వంచిస్తున్నాయ్ ఏ భయసముద్ర తిమింగలాలు నీ శాంతి నౌకల్ని మింగేస్తున్నాయ్ ధన లోభానికి పురుగులు మేసే ఏ వార్తాపత్రికలు నీ రక్తాక్షరాల్ని విరిచేస్తున్నాయ్.. కన్నీళ్ళేనా పెట్టుకునేది నీలో నీ తరంలో ఇంకేమీ లేదా.!?
ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి, తండ్రివి, దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతీ”వమ్మా నోటికందని సస్యశ్యామల సీమవమ్మా..
ఒంటి మీద గుడ్డలతో జండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధిన బడ్డ సింగారం నీది అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ..!?
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.