ఏ దేశమైన అభివృద్ధిపదంలో ప్రయాణించాలంటే అందుకు అన్నిసదుపాయాలు, సౌకర్యాలతో పాటు 'కమ్యూనికేషన్ వ్యవస్థ' కూడా అత్యంత కీలకమైనది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుంటే అన్ని పనులు వేగంగా జరుగుతాయి. అలాంటి అతి ముఖ్యమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో ముందు వరుసలో ఉండే టెలికాం సర్వీసులను మన భారతదేశంలో మహా నగరాలలో మాత్రమే కాకుండా గ్రామాలలోకి సైతం విస్తరించేలా కృషి చేసి భారతదేశంలో టెలికాం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు.

ఇంతకు ముందు ఒకరి సమచారాన్ని మరొకరికి పంపడానికి రెండు మూడు రోజుల సమయం పట్టేది కాని హనుమాన్ గారు ఆరోజులలో చేసిన విశేష కృషి ఫలితంగా అంచెలంచలుగా విస్తరించి ఈరోజు టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ మన దేశంలో ఇంత పటిష్టంగా ఎదిగింది. కేవలం టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలో పురోగతి మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న ప్రైవేట్ కంపెనీల నుండి వినియోగదారులకు ఏ ఇబ్బంది కలుగకుండా అందుకు తగ్గట్టు తగిన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆవిర్భావానికి బిల్ డ్రాఫ్టింగ్ లో సహకరించి ప్రైవేటు టెలికాం రంగంలో కొత్త శకం ప్రారంభించారు హనుమాన్ గారు.


హనుమాన్ గారు కేవలం మన దేశ టెలికాం వ్యవస్థను అభివృద్ధిపదంలో నడిపించడానికి కీలక పాత్ర పోషించడమే కాక సౌత్ ఆఫ్రికా ప్రభుత్వానికి(1995), నేపాల్ ప్రభుత్వానికి(2000) టెలికాం రంగంలో వారికి సలహాదారునిగా వ్యవహరించి అక్కడ కూడా సరైన మార్గదర్శకాలను సూచించారు. "దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది.. ఇక నా మిగిలిన శేష జీవితమంతా విద్య, వైద్య రంగంలో సమూల మార్పులకు కృషి చేస్తాను" అని ఒక వీర సైనికునిలా వాగ్ధానం చేస్తున్న త్రిపురనేని హనుమాన్ గారికి కేంద్ర ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" రావడం సాటి తెలుగువారందరికి గౌరనీయం.

