Tollywood Is Finally Seeing A Significant Change & This Is Just The Beginning!

Updated on
Tollywood Is Finally Seeing A Significant Change & This Is Just The Beginning!

"అవును ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు తెలుగు సినిమా మారుతుంది".

ఏడాది పొడుగునా ప్రకృతే ఒక రకంగా ఉండదు. కొంతకాలం మంచు కురిపిస్తూ చలి పెడుతుంది, కొంతకాలం భూమిని శుభ్రపరిచి, మొక్కలకు స్నానం చేయించడానికి వర్షం కురిపిస్తుంది, మరికొంత కాలం ఎండ.. మీరొక్కసారి గమనిస్తే ప్రతి మార్పును Accpet చెయ్యడానికి మన శరీరం కొంత సమయం తీసుకుంటుంది. తర్వాత ఆ కాలాన్ని ఎంజాయ్ (ఆఖరికి ఎండకాలమైనా తన మీద కోప్పడకుండా ప్రకృతి ఇచ్చే మామిడి పళ్లతో) చేస్తుంటాం. ఆ తర్వాత బోర్, విసుగు పుట్టి మారే ఋతువుల కోసం ఎదురుచూస్తుంటాం. ఈ మార్పులు మనం బ్రతుకుతున్న భూమి మీదనే జరుగుతున్నాయి.. అలాగే మన జీవితంలోనూ, మన అభిరుచులలోనూ..

తెలుగు సినిమా ఇప్పుడేమీ కొత్తగా మారడంలేదు, సినిమా పుట్టిన దగ్గరి నుండి మారుతూ వస్తుంది. ప్రస్తుత మార్పులకు సంభందించిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇప్పుడు కథల ఎంపిక విషయంలో నిన్నటికి నేటికి ఎంతో మార్పును చూస్తున్నాం.. మీకో విషయం తెలుసా భారత దేశంలో రెండో అతిపెద్ద సినీ పరిశ్రమ ఐన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2015 సంవత్సరానికి ముందు మన సక్సెస్ రేట్ కేవలం 5% శాతం మాత్రమే ఉండేది. సినీ ప్రేక్షకుల ఇష్టాలలో వచ్చిన మార్పు కారణంగా మనవాళ్ళు కూడా అందుకు అనుగుణంగా మారడంతో తెలుగు సినిమా మారుతూ వస్తుంది. 2015 లో 5% ఉన్న మన సక్సెస్ రేట్ 2018 కి అక్షరాల దాదాపు 20% పైగానే పెరిగింది..

6 ఫిబ్రవరి, 2015 లో రిలీజ్ ఐన "మళ్ళి మళ్ళి ఇది రాని రోజు", ఎవడే సుబ్రహ్మణ్యం (21 మార్చి, 2015), కంచె(22 అక్టోబర్, 2015) ఆ తర్వాత రిలీజ్ ఐన భలే మంచిరోజు(డిసెంబర్ 24)నుండి కూడా ఓ నిర్దిష్టమైన మార్పులను ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తున్నాం. అంతకు ముందు కూడా దేవా కట్టా గారు, క్రిష్ గారు, శేఖర్ కమ్ముల గారి లాంటి దర్శకులు తమదైన శైలిలో సినిమాలు రూపొందిస్తుండడం వల్ల కూడా ఈ మార్పులకు కీలకమైన కారణమయ్యారు.

ఇంతకుముందు సమాజం ఉపయోగపడేలా, లేదంటే ప్రేక్షకుల మనస్తత్వానికి అతి దగ్గరిగా సినిమాలు తీయాలంటే పెట్టుబడిని విరాళం ఇస్తున్నట్టుగానే పరిస్థితులు ఉండేవి. ఎప్పుడో ఎందుకు ఏప్రిల్ 25, 2014 లో రిలీజ్ ఐన చందమామ కథలు సినిమానే తీసుకుంటే ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. కాని ఆశించినంతగా కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. కాని 2016, 2017లో వచ్చిన పెళ్ళిచూపులు, ఘాజి సినిమాలు జాతీయ పురస్కారాలను అందుకోవడంతో పాటు ఇటు కమర్షియల్ గా కూడా మాంచి సక్సెస్ సాధించాయి. ఒకప్పుడు అవ్వి కలెక్షన్లు రాబట్టలేవేమో ఇప్పుడు అదే సినిమాలు తీస్తే కనుక ప్రేక్షకులు తమ భుజాన ఎత్తుకుని బ్రహ్మరథం పడుతున్నారు. వారిలో వచ్చిన ఈ అనూహ్య మార్పులు పరిశ్రమకే కాదు వారి(ప్రేక్షకుల) జీవితాలను కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకురాగలవు.

"కమర్షియల్ ఫార్ములా" అంటూ నిన్నా మొన్నటి వరకు ఒక ఫార్ములా ఉండేది కాని ఇప్పుడు అది "అట్టర్ ఫ్లాప్ ఫార్ములా" అయిపోయింది. ఈ ఫార్ములతో ఇప్పుడు ఎవరైనా సినిమాలు తీస్తుంటే అసలు టీజర్ కూడా చూడడం లేదు. అలా కాక కేవలం కొత్త రకం కథతో తీస్తే సినిమా ఆడుతుంది అనుకుంటే కూడా పొరపాటే "ప్రేక్షకుల మనస్తత్వానికి అతి దగ్గరిగా వెళ్లి, కథ, సంభాషణలు, సినిమాలోని ప్రపంచం, పాత్రల భావోద్వేగాలు అతి సహజంగా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ సహజత్వం కారణంగానే "బయో పిక్" ల నిర్మాణం కూడా మొదలయ్యింది.

కథా బలం ఉన్న సినిమాలు నిన్న మొన్నటి వరకు తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తే, ప్రస్తుతం ప్రేక్షకుల మీద నమ్మకంతో భారీ స్థాయి బడ్జెట్ తో నిర్మాణాలు మొదలయ్యాయి, విజయం సాధించాయి కూడా. చిన్న హీరోలే కాదు ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా హీరోయిజం ఉన్న పాత్రల కన్నా కథ బలం ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ మధ్యనే రిలీజ్ ఐన రంగస్థలం సినిమా ఆ కోవకు చెందినవే. ఎప్పుడు లేనివి సహజత్వానికి సహజత్వానికి అతి దగ్గరిగా ఉన్న బయో పిక్ లు రావడానికి కూడా ప్రేక్షకులలో వచ్చిన ఈ మార్పే కారణం. రిలీజ్ ఐన మహానటి, కాబోతున్న సైరా, ఎన్.టి.ఆర్ బయోపిక్, వైస్ రాజశేఖర్ రెడ్డి గారి యాత్ర, కే.సి.ఆర్ గారి జీవిత చరిత్ర మొదలైన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే..

ప్రతికాలం బోర్ కొట్టినట్టుగానే ఈ తరహా సినిమాలు కూడా కొంతకాలం తర్వాత బోర్ కొట్టే అవకాశం లేదండి. కొన్ని నెలలే దొరుకుతున్నాయని ఆతృత తప్పితే సంవత్సరం పొడువునా మామిడి పళ్ళు ఈ ప్రకృతి అందిస్తే ఎవరికి చేదు చెప్పండి. తెలుగుసినిమా పుట్టిన దగ్గరినుండి సహజత్వం ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. కాకపొతే వాటికి ఇప్పుడు టెక్నాలజీ తోడవడంతో మరింత ఉన్నతముగా కనిపిస్తున్నాయి. సినిమాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆల్టిమేట్ గా కథా బలం ఉన్న సినిమాలే సమాజానికి ఆరోగ్యకరం.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత పరిశ్రమలోకి అడుగుపెట్టింది.. ఏ సినిమాలు ఐతే జీవితాలను మార్చుకున్నారో వారే ముళ్ళ దారిని దాటి దర్శకులుగా వస్తున్నారు. ఎప్పుడో నిర్మించి, అందరు నడుస్తున్న రహదారిలో కాకుండా కొత్త దారిలో మనల్ని నడిపిస్తూ అడవి లాంటి ఓ కొత్త ప్రదేశలోకి మనల్ని తీసుకువెళ్తున్నారు.

సాగర ఘోషను తెలియజేస్తున్నారు.. ఎడారి ఆక్రందనలను తెలియజేస్తున్నారు.. యాంత్రిక జీవనాలకు అలవాటు పడిన మనకు పువ్వులలోని పరిమళాన్ని మరోసారి పరిచయం చేస్తున్నారు..