Contributed by Sowmy Uriti
చిన్నప్పుడు మన అమ్మమ్మ, నానమ్మ , తాతయ్యల దగ్గర విన్న, మన మెదడుకి మేత పెట్టిన పొడుపు కథలు గుర్తున్నాయా? చమత్కారంగా, నిగూఢ అర్ధంతో ఉండే ఈ పొడుపు కథల చిక్కు ముడిని విప్పడంలో ఒక మజా ఉండేది. అలాంటి వాటిలో మన నోళ్ళలో బాగా నానిన కొన్ని ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎన్నిటిని విప్పగలరో చూడండి.. 1. అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను.. వంటినిండా గాయాలు కడుపు నిండా రాగాలు.. 2. ముక్కుమీదకెక్కు ముందర చెవులు నొక్కు టక్కునొక్కుల సొక్కు చేజారిందంటే పుటుక్కు.. 3. చిటారు కొమ్మన మిఠాయి పొట్లామ్.. 4. అంగట్లో కొంటారు ముందుంచుకొని ఏడుస్తారు.. 5. తడిస్తే గుప్పెడు.. ఎండితే బుట్టెడు.. 6. తెలిసేలా పూస్తుంది.. తెలియకుండా కాస్తుంది.. 7. కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది.. కాళ్ళు లేకపోయినా నడుస్తుంది.. 8. మూడు కన్నులుండు ముక్కంటిని కాను.. నిండా నీరు ఉండు కుండను కాను.. 9. పొంచిన దెయ్యం.. పోయిన చోట ప్రత్యక్షం.. 10. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు.. చేతితో చల్లుతాము నోటితో ఏరుతాము.. 11. కిట కిట తలుపులు కిటారి తలుపులు.. ఎప్పుడు తెరచిన చప్పుడు కావు.. 12. చిటపట చినుకులు చిటారు చినుకులు.. ఎంత రాలినా చప్పుడు కావు.. 13. పొట్టలో వేలు.. నెత్తి మీద రాయి.. 14. తోక లేని పిట్ట అరవై ఆమడలు తిరిగింది.. 15. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి , ఊళ్ళోకొచ్చి అరిచేది.. అన్నీ చూసారా? ఎన్ని చెప్పగలిగారు? 10 కి పైగా కనిపెట్టారంటే మీకు పొడుపు కథల మీద మంచి అవగాహన ఉన్నట్టే. ఏంటి సమాధానాలు కోసం చూస్తున్నారా? ముందే చెప్పా కదా బాగా నోళ్ళలో నానినవి అని.. కాబట్టి నేను చెప్పను. మీరు ఎన్ని చెప్పగలిగారో చెప్తూ, చెప్పలేకపోయిన పొడుపు కథల్ని విప్పమని మీ friends ని mention చేయండి..