అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఉభయకుశలోపరి.
ప్రణవ్ చాగంటి అనే కుర్రాడు మస్తిష్కాన్ని మధనం చేసి, సంఘర్షణలతో సమరం చేసి, అత్యంత కష్టమైనా...ఆలోచనలను ఒకే దారిలో నడిపిస్తూ జన్మనిచ్చిన ఐదు నిమిషాల ఇరవై రెండు క్షణాల “తెలుగు వీర” అనే పాట గురించి ఈ ఆర్టికల్.
“తెలుగు వీర లేవరా, తెలుగు భాష ఖ్యాతినే లోకమంత చాటరా తరుగుతున్న మాతృభాష విలువ తెలియజేయమంటూ కదులుతున్న వారినే నువ్వు ప్రోత్సహించరా!”
ముందుగా, నేను తెలుగు వీరుడ్ని కాదు కదా, కనీసం తెలుగు సేవకుడ్ని కూడా కాదు. కొన్ని కోట్ల మందిలానే నేను ఒక మామూలు తెలుగు భాషా ప్రేమికుడిని. బహుశా అందుకేనేమో, ఈ పాట వినగానే హృదయం పొంగిపోయింది, మనసు మురిసిపోయింది, తలపు అందరికీ తెలియజేయమని తొందరపెట్టింది. అంతలా ఏముంది ఇందులో అంటే...
1. అచ్చ తెలుగు పదాల మాధుర్యం 2. స్వచ్చమైన ఉచ్చరణా సౌందర్యం 3. కొంతమందికే సాధ్యమైన సాహిత్య సాహసం 4. వీనులకు ఇంపైన సంగీత సౌరభం 5. తెలుగు వాడి నిర్వచనం, తెలుగు జాతి గౌరవం అన్నిటికన్నా ముఖ్యంగా మాతృభాషపై మమకారం.
వాస్తవంగా, ప్రణవ్ చాగంటి స్వహస్తాలతో రాసి, స్వరపరిచిన తెలుగు వీర, ఒక పూర్తి స్థాయి తెలుగు rap పాట అనడం ఏమాత్రం సమంజసం కాదేమో!. మరేంటి అంటే...
“అంతకంతకూ దిగజారిపోతున్న ప్రస్తుత సమాజంపై తనకున్న బాధ, ఘనమైన చరిత్రున్న తెలుగు ఖ్యాతి కనుమరుగవుతుందన్న ఆవేదన, అచ్చమైన స్వచ్చమైన తెలుగు వాడి ఆలోచనల అంతరంగాన్ని చీల్చుకుంటూ పెళ్ళుబికిన అద్భుతమైన ఆణిముత్యం” అని నిర్ద్వందంగా ఒప్పుకోవాల్సిన సత్యం.
ఒక్కసారి వినండి, మీ సమయం ఏ మాత్రం వృధా కాదని ఆశిస్తూ...
తెలుగు వాడినని గర్వించకు, ఎందుకంటే ప్రతీ జాతికి ఓ భాషుంటుంది, ప్రతీ భాషకు ఓ చరిత్రుంటుంది. అందుకే... తెలుగు వాడివని ఆనందించు - తెలుగు వాడిలా జీవించు - తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు.
ఈ వీడియో నచ్చితే షేర్ చేయటం మర్చిపోకండి. యే? అంటారా... ప్రోత్సహిద్దాం గురు, పోయేదేముంది. మహా ఐతే మంచి స్థాయికి వెళ్తాడు.