మిగిలిన గేమ్స్ లో ప్లాన్స్ వేయడానికి కొంత టైం ఉంటుంది.. కాని కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో అలా కాదు కాస్త ఏమరపాటుగా ఉంటే ఓటమి కాదు ప్రాణాలే పోయే అవకాశం ఉంది. అంజనా ఎరవల్లి గారికి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఏ హృదయ విధారకమైన గతం లేదు. నాన్నకు ఎంతో ఇష్టమైన ఈ కరాటేను తనకు చిన్నతనం నుండే నేర్పించారు. మిగిలిన పిల్లలు ఆ వయసులో భరతనాట్యం, సంగీతం క్లాసులకు వెళ్తే తను మాత్రం ఊహ తెలిసినప్పటి నుండే కరాటే క్లాసులకు వెళ్ళారు. తను ఏ వయసు నుండి శిక్షణ ప్రారంభించిందో ఇప్పుడు ఆ వయసున్న పిల్లలకు కరాటే నేర్పిస్తున్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా, ఉన్నతంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది అలాంటి తెలంగాణ రాష్ట్రానికి కరాటే చీఫ్ గా ఒక మహిళ(అంజన)ను మొదటిసారిగా నియమించారంటే ఆ వ్యక్తిలో టాలెంట్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎరవల్లి అంజన గారిది రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్ అనే చిన్న పల్లెటూరు(తర్వాత కరీంనగర్ కి వచ్చారు). "నేను సాధించలేకపోయాను.. నా గెలుపును నీలో చూసుకుంటాను తల్లి" అనే నాన్న మాటలే తనకు స్పూర్తి. నిజంగా ఆడపిల్లలను చదివించడమే ఎక్కువ అని మన పల్లెలో ఇప్పటికి అనుకుంటారు. ఇంకా కరాటే అంటే వారి మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఉహించుకోవచ్చు.. పట్టుదల, అంకిత భావం ఉన్నవాళ్ళు వారు సాధించబోయే విజయాన్ని ముందుగానే చూస్తారు.. అలా తల్లి రాణి, తండ్రి భీమ్ రావు వారి కూతురి విజయాన్ని ముందుగానే చూసి దానికి ముందు వచ్చే కష్టాలను చాలా తెలికగా తీసుకున్నారు. తన వయసులానే తన టాలెంట్ స్థాయి కూడా పెరుగుతూ వచ్చింది. మొదట గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, దేశ, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలా పాల్గొన్న అన్ని టోర్నమెంట్స్ లో కలిపి 220పైగా మెడల్స్ అందుకున్నారు. వంద కించ పరిచే మాటలకు ఒక్క గెలుపు సమాధానం చెబుతుంది.. అంజన గారు మాత్రం 100 మాటలకు 220 గెలుపులతో సమాధానం చెప్పారు.
అంజనకు వచ్చిన అవార్ఢులు: 2016 ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ లో భయంకరమైన కాంపిటీషన్ ఉన్నకాని బంగారు పతకం గెలుచుకున్నారు. 2015 శ్రీలంకలోని కరాటే ఛాంపియన్ షిప్ లో రెండు బంగారు పతకాలు. 2013 నేపాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ తో పాటు, బెస్ట్ ఫీమేల్ ప్లేయర్ అవార్ఢ్. 2012 శ్రీలంకలోని ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్స్. బూడో ఖాన్ మార్షల్ అకాడమి వారు 100 బంగారు పతకాలు గెలుచుకున్న వారికి 'ది లైఫ్ టైం అచీవ్ మెంట్' అవార్ఢ్ ఇచ్చి గౌరవిస్తారు. 2010లో అంజన గారు 130పైగా బంగారు పతకాలు గెలుచుకుని ఆ అచీవ్ మెంట్ ను అతి చిన్న వయసులో అందుకున్నారు. అంజన గారు చిన్నతనం నుండి ఇప్పటి వరకు పాల్గొన్న కాంపిటిషన్స్ లో 220 పతకాలు సాధిస్తే అందులో ఏకంగా 209 బంగారు పతకాలే ఉన్నాయి.
అంజన గారు ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్ ని మరింత అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం అందుకోసం ఇందులో బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్న అంజనాను ఎంపిక చేశారు. ఇక నుండి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) నుండి రాష్ట్రంలో కరాటే శిక్షణ కేంద్రాలను పెంచి, మహిళలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ గా ఉండడమే కాకుండా వివిధ కాంపిటీషన్స్ లో రాష్ట్రం తరుపున మెడల్స్ ను రాబట్టే పోరాటంలో అంజన గారు పాల్గొనబోతున్నారు.
Her Practice Video