Meet The Incredible Father & Daughter Who Are Growing Flowers & Vegetables On Their Terrace

Updated on
Meet The Incredible Father & Daughter Who Are Growing Flowers & Vegetables On Their Terrace

అవును... ఒక తండ్రి తన కూతురికి పుట్టినరోజు కానుకగా "టెర్రస్ ఫార్మ్" ఇచ్చారు.. ఆ కానుక ఇప్పటికి తన ఇంట్లోనే ఉంది.. ఆ కానుకను పదిలంగా ఆ కూతురు కాపాడుతుంది.. ఫలితంగా ఆ కానుక తిరిగి వారికి ప్రతిరోజు ఎన్నో బహుమతులను అందిస్తుంది..

తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్థి "చదువు నేర్పించడం". కరక్టే, కానీ చదువు నేర్చుకోవాలన్నా, ప్రయోజత్వం పొందాలన్నా, మిగిలిన ఆస్థులు సంపాదించుకోవాలన్నా ముందు కావాల్సింది ఏమిటి.? ఆరోగ్యం!! ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేసేది. ఆ ఆరోగ్యమే అసలైన కానుక అని హైదరాబాద్ ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన జీవన్ రెడ్డి గారి నమ్మకం. ఆ నమ్మకంతోనే తన 1000 చదరపు అడుగుల(SFT) ప్రదేశంలో టెర్రస్ ఫార్మ్ ను కూతురు 'ఆద్య' కు గిఫ్ట్ గా ఇచ్చారు..

రెండు సంవత్సరాల ఆలోచన: మారుతున్న వాతావరణ పరిస్థితులు, న్యాచురల్ రిసోర్స్ తగ్గుతుండడం, మనుషుల సంఖ్య పెరుగుతోంది కానీ భూమి పెరగదు, ఒకపక్క తినేవాళ్ళు ఎక్కువ తింటున్నారు పండించేవాళ్ళు రోజురోజుకు తగ్గిపోతున్నారు.. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నా కూతురి భవిషత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయి.? ఇలాంటి ఆలోచనలు నిత్యం జీవన్ రెడ్డి గారిలో కంగారు కలిగించేవి. ఇదే సమయంలో టెర్రస్ ఫార్మ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ పొలం అవసరం లేదు, రైతు కూలీలు, నాగళ్లు, ట్రాక్టర్లు మొదలైనవి అవసరం లేకుండానే అద్భుతంగా ఇంటి మీద వ్యవసాయం చేసుకోవచ్చని తెలుసుకుని రెండు సంవత్సరాలుగా పరిశోధనలు చేసి, వివిధ ఇళ్లకు వెళ్లి పరిశీలించి 23 జూలై 2019 కూతురు ఆద్య పుట్టినరోజు నాడు మిద్దెతోట ఏర్పాటుచేశారు.

గిఫ్ట్ ఖరీదు రూ.1,50,000: బయట కూరగాయల రంగు బాగానే కనిపిస్తుంది కానీ అవ్వి ఏ నీటితో పండిస్తారో తెలియదు, ఎలాంటి మందులు వేస్తాడో తెలియదు తింటే కడుపు నిండుతుంది కానీ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి.. ఆహారం బ్రతికించాలి కానీ ఇప్పుడు చంపే పరిస్థితి!! ఇన్ని తలనొప్పులు వద్దు! కాస్త ఓపికతో జీవన్ గారు ఫార్మ్ లో కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూరలు పండిస్తున్నారు. మట్టి, సిమెంట్ టబ్బులు కాకుండా తేలికైన ఫైబర్ టబ్బులు దీనికోసం వాడారు. బర్త్ డే కోసం మిత్రులను పిలిచి సెలెబ్రేషన్స్ చేసే కన్నా జీవితకాలాన్ని పొడిగించే ఈ తోట కోసం మొదట లక్షా యాభైవేల రూపాయలు ఖర్చు చేశారు.

రకరకాల మొక్కలు: టెర్రస్ లోని ప్రతి అంగుళాన్ని జీవన్ గారు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ ఫార్మ్ లో తీగజాతికి సంబంధించిన బీరకాయలు, ఆనపకాయ, గోకరకాయ, కాకరకాయ, నేతి బీరకాయలు.. అలాగే రోజువారి కూరగాయలలో టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికం, బెండకాయలు, వంకాయలు పెంచుతున్నారు. వీటి పాలినేషన్ కోసం పులమొక్కల్ని కూడా పెంచుతున్నారు.. ఇందుకోసం బంతి, చామంతి, గన్నేరు, మందారం, గులాబీ, మల్లెపూలు పెంచుతున్నారు. పాలినేషన్ తో పాటు ఈ పూలు ఇంట్లో పూజలకు కూడా వినియోగిస్తుంటారు. పండ్లల్లో రెండు రకాల తీపి పులుపు మామిడి చెట్లు, జామ, బత్తాయి, సపోట.. ఆకుకూరలలో గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా కరివేపాకులు మొదలైనవి పెంచుతున్నారు.

కూతురు ఆద్య జాగ్రత్తలు: మిగిలిన తోటి పిల్లలు సాయంత్రం కాగానే మొబైల్ ఫోన్ లు పట్టుకుంటుంటే ఆద్య మాత్రం మొక్కలతో గడుపుతుంది. వాటికి నీరు పొయ్యడం, కూరగాయలు పండ్లు పూలు రోజు రోజుకు ఎంత పెరుగుతుందని గమనించడం, "నేను నాటిన మొక్క ఎదుగుతుందని సంబరపడడం" ఇదే తన ఫ్రీ టైం కాలక్షేపం. వృధ్యాపంలో ఉన్న జీవన్ రెడ్డి గారి అమ్మ నాన్నలకు కూడా మంచి కాలక్షేపంగా ఇది ఉంది. "ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తే కోల్పోయేది ఏది లేదు, వెలుగు పెరుగుతుందన్నట్టుగా" ఈ సాంప్రదాయం ప్రతి కుటుంబం కొనసాగించాలి. ఆస్థుల కన్నా ఆరోగ్యాన్ని పంచె, పెంచే ఇలాంటి కార్యక్రమాలే అసలైన బహుమానాలు..