Contributed By Gopinath Vaddepally
అలా మేఘాలు కమ్ముకోగానే, తన జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. వర్షం మొదలవ్వగానే, కొన్ని చినుకులు కిటికీ నుండి లోపలికి పడుతూ, చేతుల్ని బయటకి పెట్టి, మేము ఆడిన ఆటల్ని గుర్తుచేస్తుంటాయి..
ఇప్పుడు నన్ను ఒంటరిగా చూసి, నా నుండి ఆ చినుకులు దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఆ చినుకుల్లో తడవడానికి నేను బయటకి బయలుదేరాను..
బైక్ స్టార్ట్ చేస్తుండగానే అర్థమైపోతుంది వెనకాల సీట్ ఖాళీగా ఉందని. ఇంతకుముందు అక్కడ తను ఉండేది, ఇప్పుడు వర్షం చినుకులు మాత్రమే ఉన్నాయి. నేను అలాగే ముందుకు వెళ్తుంటాను, తడిసిన రోడ్లని,చెట్లని చూస్తూ.. తను కనపడిన ప్రతి చోటులో తనని తలుచుకుంటాను. ప్రతి ఆర్డర్ రెండు చెప్పి, ఒక్కటి అక్కడే వదిలేస్తాను, తడిసిపోయి ఇంటికి తిరిగొస్తాను..
తల తుడుచుకోకుండా అలాగే కూర్చుంటాను, కళ్ళ నుండి కారే కన్నీళ్ళకి, తల నుండి కారే వర్షపు చినుకుల తోడు దొరకగానే, నేను టిపికల్ అబ్బాయిని అయిపోతాను, పాత పాటలని వింటాను.. నా మనసు వేదనంత, మనసులోనే తనకి చెప్పుకుంటాను.
కాఫీ తీసుకుని కూర్చుంటాను.. పకోడీలు చేద్దామని ,తను రాసిచ్చిన రెసిపీ కాగితాన్ని తడిసిన వాళ్ళేట్ నుండి బయటకు తీస్తాను. తను రాసిన అక్షరాలని చూడగానే ఆ కాగితాన్ని హృదయానికి హత్తుకుంటాను. కాఫీ తాగుతాను, పకోడీ తింటాను. ఇలానే జ్ఞాపకలతో కళ్ళు తడిసిపోతుంటాయి, అయిన,నా పరిస్థితి తనకి అర్థం అవ్వట్లేదనే ఆలోచన ఎక్కువ బాధపెడుతుంటుంది. నేను ఇలానే జ్ఞాపకల్లో నన్ను నేను కోల్పోతుంటాను.. వర్షం నెమ్మదిగా తగ్గుతుంటుంది..