తెలుగువారికి ఎస్.వి. రంగారావు గారే మొదటి రావణాసురుడు, ఆయనే మొదటి కీచకుడు, మొదటి హిరణ్యకశ్యపుడు, మొదటి ఘటోత్కచుడు, మొదటి కంసుడు, మొదటి నరకాసురుడు.. భగవంతునిగా ఎన్.టి. రామారావు గారు ఎలా మన హృదయాలలో నిలిచిపోయారో రాక్షసుని పాత్రలలో మన రంగారావు గారు అలా నిలిచిపోయారు. కేవలం రాక్షసుని పాత్రలలో మాత్రమే కాదు అన్నగా, తండ్రిగా, తాతయ్యగా, ఓ బందిపోటు దొంగగా, వెన్నంటి ఉండి నమ్మించి మోసం చేసే వ్యక్తిగా, మామయ్యగా ఇలా దాదాపు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు వారి మదిలో, తెలుగు సినీ చరిత్రలో ఉన్నతంగా నిలిచిపోయారు.
మిగిలిన వారికి ఉన్నట్టుగా రంగారావు గారికి ఆర్ధికపరమైన కష్టాలు లేవు, తండ్రి Excise Inspector గా ఉద్యోగం చేసేవారు.. అటు ఆర్ధికంగా, ఇటు మేధస్సు పరంగా గొప్పగా ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. రంగారావు గారికి చిన్నతనం నుండే నాటకాలు అన్నా, నటన అన్నా చాలా ఇష్టం అందుకు తగ్గట్టు గానే డిగ్రి వరకు చదువుతూనే ఎన్నో ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చినా గాని అది అంతగా రుచించలేదు.. ఒక్కసారి రక్తం రుచి మరిగిన పులి మరే ఇతర ఆహారం తీసుకోలేదు అన్నట్టు రంగారావు గారు ఆ తర్వాత మిత్రులు, బంధువుల ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు.
మొదటి సినిమా 'వరూధిని' అంత గొప్పగా హిట్ కాకపోవడంతో తర్వాత అవకాశాలు రాలేదు. కేవలం ఒక్క సినిమాతో నటుడి గొప్పతనం ఎలా తెలుస్తుంది.? అని నిరాశ చెంది ఒక ప్రైవేట్ కంపెనీలో మళ్ళి జాబ్ చేయడం మొదలుపెట్టారు. పైకి అలా ఉద్యోగం చేస్తున్నా కాని ఆయన మనసంతా సినిమా మీదనే ఉంది. కొన్నాళ్ళకు కే.వి.రెడ్డి గారి పాతాళ బైరవి సినిమాలో మాంత్రికుడి పాత్రకు అవకాశం వచ్చేసింది. కట్ చేస్తే ఒక గొప్ప నటుడి పుట్టుక తెలుగు తెరపై సంభవించింది అని ఆయనను కీర్తించారు.
ఇక ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాక్షసుని పాత్రలో, విలన్ పాత్రలలో ప్రేక్షకులు ఎలా శాపనార్ధాలు పెట్టారో తండ్రి, అన్నయ్య లాంటి పాత్రలకు అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. హీరో ఎవరైనా కాని రంగారావు గారు ఉంటే ఆ సినిమాకు ఒక నిండుతనం వస్తుందని నాడు భావించేవారు. అనాడు ఉన్న చాలా మంది నటులు కొన్ని రకాల పాత్రలకే పరిమతం అయ్యేవారు కాని ఎస్.వి. రంగారావు గారు మాత్రం అన్ని పాత్రలలో ఒదిగిపోయేవారు సింపుల్ గా చెప్పాలంటే కథను ఆత్మతో అనుభవించి పాత్రను శరీరంతో అనుభవించే వారు.
రంగారావు గారు అందరితో ఆత్మీయంగా చమత్కరిస్తూ ఉంటారు. ఆయనకు పుస్తకాలంటే చాలా ఇష్టం ప్రత్యేకంగా స్వామి వివేకనందునికి సంబంధించిన పుస్తకాలెన్నో చదివేవారు. ఇక ఆయన నటనను అభినందిస్తూ దేశ విదేశాల నుండి ఎందరో కీర్తించారు, ఆశ్చర్యచకితులయ్యారు. చదరంగం అనే సినిమాకు దర్శకత్వం వహించి ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ప్రజాహిత కార్యక్రమాలలో ఎన్నో రకాలుగా సేవలు అందించారు. ఆ రోజుల్లో చైనాతో భీకరమైన యుద్ధం వచ్చినపుడు ఆయుధ అవసరాల కోసం ఆ రోజుల్లో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. ఇది వారి మంచి మనసుకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.