Article Source: Ganga Reddy A
భగవంతునికే అతీంద్రియ శక్తులు ఉండడం వల్ల తమ సమస్యలను దేవుడే తీర్చగలడు అని భక్తులు నమ్ముతారు, అందుకే భగవంతునికి మాత్రమే దేవాలయాలు ఉంటాయి.. స్వాతంత్ర సమరయోధులు, మిగిలిన నాయకులను గౌరవించడానికి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన సాధారణ విషయమే.. కాని ఇక్కడ విషయమేమిటంటే నెల్లూరు జిల్లా గొలగమూడిలో 1982 వరకు బ్రతికిన వెంకయ్య స్వామి అనే వ్యక్తికి ఏకంగా ప్రజలు ఒక గుడి కట్టేశారు. పూజలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రతిరోజూ నిత్య అన్నదానాలు ఇలా మామూలు దేవాలయం లానే అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. 99 మంచి పనులు చేసి తెలియక ఒక్క తప్పు చేసినా అపార్ధం చేసుకునే ఈ సమాజం ఏకంగా ఒక వ్యక్తికి గుడి కట్టేశారంటే ఆ వ్యక్తిలో ఎంత గొప్పతనం ఉంటే ఇది సాధ్యపడుతుంది.. సాధారణ దేవాలయానికి వెళ్ళినా కూడా సమస్య తీరుతుందో లేదో తెలియదు కాని ఈ గుడికి వెళితే సమస్య తీరుతుంది అని ఆ ప్రజలు ఎలా నమ్మగలుగుతున్నారు.. ఇంతకు ఎవరతను.? ఒక పిచ్చివాడు, ఒక బిక్షగాడు అనే అపార్ధాల నుండి మహర్షి గా ఎదిగిన ఒక అవధూత కథ ఇది.
మనిషి నుండి మహర్షిలా.. వెంకయ్య స్వామి గారు అంతగా చదువుకోలేదు కాని వ్యక్తిత్వంలో మాత్రం ఎంతో ఉన్నతులు. ఆ రోజుల్లో నెల్లూరు జిల్లా గ్రామాలలో కులం పిచ్చి ఎక్కువగానే ఉండేది. ముందు నేను సమానత్వం ఆచరిస్తే నా నుండి మిగిలిన వారు ఆచరిస్తారు అని చెప్పి చాకలి, మంగలి, మిగిలిన వెనుకబడిన కులాల వారు తినే భోజనాన్ని తిని సమానత్వపు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దానికి ఆ కులం పెద్దలు ఆగ్రహంతో విచక్షణ మరిచి "వీడు మన కులంలో చెడ బుట్టాడు, ఏ జన్మలో ఏ పాపం చేశామో కాని వీడు పుట్టాడు అని గుండు కొట్టించి తనకు తానే ఊరి నుండి వెళ్ళిపోయేంతటి పరిస్థితిని కల్పించారు". బహుశా ఇది అతను ఓ మహర్షి గా అవతరించడానికి పడ్డ పురిటి నొప్పులు కావచ్చు.. తనను తాను పూర్తిగా తెలుసుకునే క్రమంలో ఆ ఊరిని విడిచి పల్లెలు, కొండ కోనలు, అడవులలో సంవత్సరాల తరబడి గడిపి ఓ ముర్తిభవించిన మహర్షిగా కొన్నాళ్ళకు అవతరించారు.
వారు చేస్తున్న అబద్దపు పనులులా లేకపోవడంతో వెంకయ్య స్వామి గారు ఏది చేసినా గాని అక్కడి వారికి మొదట ఓ పిచ్చివాడి చేష్టలు లానే ఉండేవి. కాని సత్యంతో, ప్రేమతో, దైవత్వంతో నిండిన వ్యక్తి కదలికలు తన చుట్టు ఉన్నవారికి తప్పకుండా శక్తినిస్తాయి, ఓదార్పునిస్తాయి, కొండంత ధైర్యాన్నిస్తాయి, దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న వారికి సరైన దిశా నిర్ధేశం చేస్తాయి. అలా వెంకయ్య స్వామి మాటలు, చేతలు ఎందరినో నెమ్మదిగా మార్చడం మొదలుపెట్టాయి. 'పిచ్చివాడు' అని పిలిచిన వారే ఆ తరువాత 'స్వామి' అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఐతే ఈ టైం లోనే ఇక వ్యాపారం మొదలవుతుంది.. ఆశ్రమాలు కట్టి, దర్శనానికి టికెట్టు, ఆశీర్వాదానికి దక్షిణ, మెడిటేషన్ ఫీజు, యోగా ఫీజు అంటూ సవాలక్షా మార్గాలలో డబ్బులు దండుకోవడం మొదలుపెడతారు కాని వెంకయ్య స్వామి లక్ష్యం అది కాదు. తన దగ్గరికి ఎవ్వరూ వచ్చినా అనుగ్రహించేవారు.. కోపంతో వచ్చినా, ప్రేమతో వచ్చినా వెంకయ్య గారి ప్రవర్తన ఒకే విధంగా ఉండేది. అంతకుముందు తనను ఏ విధంగా ఐతే గుర్తించారో అదే పేరుతో "అమ్మా పిచ్చి వెంకయ్యను వచ్చాను ధర్మం చేయండి" అంటూ ఇంటింటికి ఓ సాయిబాబాలా భిక్షకై తిరిగేవారు. అందుకున్న భోజనాన్ని ముందు చీమలకు, పక్షులకు, మిగిలిన ప్రాణులకు వేసి మిగిలినది తను తినేవారు. ప్రతి ప్రాణిని ప్రేమించేవారు, గౌరవించేవారు, ఒక చీమను ఎలా చూసేవారో ఆ ఊరి పెద్దను అంతే చూసేవారు.. ఇదే దివ్యత్వం, ఇదే భగవంతుని సమానత్వం అంటూ అలాంటి చేతలతో అక్కడి వారికి కూలంకుషంగా అర్ధమయ్యేది.
అతీంద్రియ శక్తులు: భయపెట్టో, మోసం చేసో, లేదంటే తెలిసింది చెప్పటానికి కూడా ఎంతోమందిని మభ్యపెట్టి డబ్బుచేసుకునే జ్యోతిష్యులను మనం చూస్తున్నాం. కాని వెంకయ్య స్వామి గారు మాత్రం ప్రజల ఆనందం తప్ప మరేది ఆశించకుండా భవిషత్తు చెప్పేవారు. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద రాబోతుందో మాత్రమే కాదు, ఏ రోజులలో వర్షం పడబోతుంది, ఎంత సమయం వరకు వర్షం పడబోతుంది అని ఈ రైతులకు జాగ్రత్తలు చెప్పి నేను చెప్పేది సత్యం ఇది ముమ్మాటికి జరగబోతుంది అనుమానంతో అశ్రద్ధ చేయకండి అంటూ అవసరమైతే ఒక కాగితం మీద రాసి మరి వెలిముద్ర వేసి మరి ఇచ్చేవారు. వెంకయ్య స్వామి గారు చెప్పింది వాస్తవం ఇది అక్షర సాక్ష్యంగా జరిగింది అంటూ ఇప్పటికి ఆ కాగితాలను దాచుకున్న వారు నెల్లూరు చుట్టు పక్కల ప్రాంతంలో వేల సంఖ్యలో కనిపిస్తారు.
మనుషులు మాత్రమే కాదు ఎక్కడో మూగ జీవాలు ఆకలితో అలమటిస్తున్నా కాని జ్ఞాన నేత్రంతో వాటిని గ్రహించి ఫలానా చోట ఉన్న వాటికి గడ్డి అందించండి అని అనుచరులకు చెప్పేవారు.. వ్యాదులను తనే స్వయంగా నయం చేసేవారట. కేవలం అది మాత్రమే కాదు నయం కానీ జబ్బులతో బాధపడుతున్న వేలాది మందికి, హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేని , వైద్య సహాయంలేని వేలాది మందికి డెబ్భై ఏళ్ళు ఆపద్భాందవుడిగా నిలిచారు. జ్వరం, పాము కాటు, పుండ్లు, కాళ్ళ వాపులు, పక్షవాతం , అంధత్వం, మతి స్థిమితం లేకపోవడం, కీళ్ళ నొప్పులు, కలరా, చర్మ వ్యాధులు లాంటివే కాకుండా నెల్లూరు, మద్రాసు లాంటి నగరాల్లో నయం కాక ఇక ఇంటికి తీసుకపోండి చావు తథ్యం అన్నటువంటి భయంకరమైన కేన్సర్, క్షయ, అల్సర్, ఊపిరి తిత్తుల వ్యాధులు, థైరాయిడ్ లాంటి జబ్బులను కూడా కేవలం అనుగ్రహం, మానసిక పరివర్తన ద్వారానో, లేదా చిరు ధాన్యాల ద్వారానో, ఏదో ద్రావకం ద్వారానో నయం చేసినట్లు అక్కడి ప్రజలు ఆనందభాష్పాలతో నాటి అద్భుతానికి సజీవ సాక్ష్యంగా తెలుపుతారు.
ఆలయ గోడలపై వెంకయ్య స్వామి గారు చెప్పిన సూక్తులు కనిపిస్తాయి.. వాటిలో కొన్ని..
1. ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా. 2. అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా. 3. పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా. 4. లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా. 5. అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
"దేవుని కన్నా ధర్మం గొప్పది" ఆ ధర్మాన్ని ఆచరించాలని ఎందరో మహానుభావులు కనీసం ఇలా ఐనా నమ్ముతారని మానవాతీత శక్తులను సమాజ హితం కోసం ప్రదర్శిస్తూ తమ పుట్టుకకు అర్ధాన్ని ఇస్తూ వెళ్ళిపోయారు. ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం మూడ నమ్మకాలను ప్రోత్సహించడమో, లేదంటే ఆ గుడికి మరింతమంది భక్తులను పెంచడమో ఎంత మాత్రమూ కాదు. ఒక రమణ మహర్షి, ఒక సాయిబాబాలా వెంకయ్య స్వామి అనే అవధూత మన తెలుగునేలపై కూడా నడియాడారు అని తెలుపుటానికి మాత్రమే.