శమంతకమణి - మన తెలుగులోని నలుగురు యువ కథానాయకులు కలిసి చేస్తున్న భారీ చిత్రం . ఈ చిత్రం పేరు చాలా ఆసక్తిని రేపుతోంది . చిత్రవిశేషాలు పక్కన పెడితే ,శమంతకమణి అనే ఒక ఆభరణానికి కూడా చాలా పెద్ద కథే ఉంది. ఆ కథేమిటో తెలుసుకుందాం ........
ద్వాపర యుగం లో సత్రాజిత్తు అని వ్యక్తి ఉండేవాడు. అతను సూర్యభగవానుని ఆరాదించేవాడు . ఓసారి సముద్రతీరాన సూర్యునికి ప్రార్ధన చేస్తున్నపుడు సూర్యుడు సత్రాజిత్తుకి ప్రత్యక్షం అవుతాడు . ధగధగాయామానంగా వెలిగిపోతున్నకారణంగా సూర్యభవానుని పూర్తి రూపం చూడలేకపోతాడు సత్రాజిత్తు . నీ కాంతి కొంత తగ్గించు అని ప్రార్థిస్తాడు . సత్రాజిత్తు కోరిక మన్నించి సూర్యభగవానుడు తన మెడలో ఉన్న శమంతకమణిని తీసేస్తాడు . అప్పటివరకు వెలిగిపోతున్న సూర్యుడు తన ఒంటిపై నుండి ఆ మణిని తీసేసాక వెలుగు తగ్గిపోతుంది. సత్రాజిత్తుకి సూర్యుని దర్శనం కలుగుతుంది. సత్రాజిత్తు భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఏ వరం కావాలో కోరుకొమ్మంటాడు. సత్రాజిత్తు తనకి ఆ శమంతకమణి కావాలి అని కోరుకుంటాడు , సూర్యభగవానుడు శమంతకమణి సత్రాజిత్తుకి ఇచ్చేస్తాడు .
శమంతకమణి ఉన్న వారికి సకల భోగభాగ్యాలు కలుగుతాయి . రోజుకి 12 బారువుల బంగారాన్ని ఇచ్చే మహిమ ఉంటుంది శమంతకమణికి .
ఆ శమంతకమణిని తీసుకొని తన ఇంటికివెళతాడు సత్రాజిత్తు . సత్రాజిత్తు దగ్గర శమంతకమణి ఉందని తెలుసుకున్న ద్వారకా రాజు శ్రీకృష్ణుడు ,ఆ మణి రాజుల వద్ద ఉంటే రాజ్యానికి ,ప్రజలకి శ్రేయస్కరం అని చెప్పి ఆ మణిని తనకివ్వాల్సిందిగా కోరతాడు. సత్రాజిత్తు శ్రీకృష్ణుని కోరికని తిరస్కరిస్తాడు .
సత్రాజిత్తు శమంతకమణిని మరో యాదవ రాజైన తన సోదరుడు ప్రసేనుడుకి కానుకగా ఇస్తాడు . అది ధరించిన ప్రసేనుడు ఓసారి అడవిలో వేటకి వెళతాడు అక్కడ ఒక సింహం దాడిలో ప్రసేనుడు మృతి చెందుతాడు . ఆ అడవిలోనే నివాసం ఉండే జాంబవంతునికి శమంతకమణి దొరుకుతుంది . తన కూతురు అయిన జాంబవతికి ఆడుకునేందుకు ఆ మణిని ఇస్తాడు జాంబవంతుడు . వేటకి వెళ్లిన తన సోదరుడు తిరిగిరాకపోవడం తో సత్రాజిత్తుకి శ్రీకృష్ణుడి పై అనుమానం కలుగుతుంది . శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుని హతమార్చి ఉంటాడని సత్రాజిత్తు నిందలు వేస్తాడు. నిజానిజాల్ని తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు స్వయంగా అడవికి వెళతాడు,అక్కడ సింహం దాడిలో ప్రసేనుడు మరణించాడని తెలుసుకుంటాడు . సింహం అడుగులు,రక్తపు మరకల ఆధారంగా ఒక గుహ లోకి ప్రవేశిస్తాడు .
అక్కడ అమూల్యమైన శమంతకమణితో జాంబవతి, చెలికత్తెలు ఆడుకోవడం చూస్తాడు శ్రీకృష్ణుడు. 28 రోజులపాటు భీకరమైన పోరు సాగుతుంది జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి . మహా బలవంతుడైన జాంబవంతుడు క్రమంగా బలహీనుడవుతాడు. తాను పోరాడుతున్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడితో అని తెలుసుకొని తన కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు . శమంతకమణిని శ్రీకృష్ణుడికి అప్పచెబుతాడు జాంబవంతుడు .
సతి సమేతంగా ద్వారక చేరిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని పిలిచి నిజానిజాలను వెల్లడించి తన నిజాయితీని రూపించుకుంటారు. శమంతకమణిని తీసుకొని తన ఇంటికి చేరతాడు సత్రాజిత్తు. తన తప్పుని తెలుసుకొని సత్రాజిత్తు పశ్చాత్తాప పడతాడు .శమంతకమణిని తిరిగి శ్రీకృష్ణుడికి ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాడు అలాగే తన కుమార్తె అయిన సత్య భామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు .
శ్రీకృష్ణుడు శమంతకమణిని స్వీకరించలేదు సత్రాజిత్తుకే ఇచ్చేసాడు అని ఒక వాదన ఉంది. సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామకు శమంతకమణిని ఇచ్చాడు అని మరో వాదన ఉంది . శ్రీకృష్ణుడు మరణం , ద్వారకా రాజ్య పతనం తరువాత శమంతక మణి ఎక్కడ ఉన్నది, ఏమి అయ్యింది అనేది మహాభారతం లో కానీ మరే ఇతర పురాణాలలో కానీ ప్రస్తావింపబడలేదు .