మాది కృష్ణా జిల్లాలోని చల్లపల్లి అనే ఒక అందమైన ఊరండి.. ఇప్పుడంటే సంతోషంగా అందమైన ఊరు అని సంభోదిస్తున్నాము కాని రెండు సంవత్సరాల క్రితం అలా లేదండి.. చెత్తా చెదారంతో నిండిన అపరి శుభ్ర పరిసరాలు, నిరక్ష్యరాస్యత ఇలా రకరకాల సమస్యలు మమ్మల్ని వెక్కిరించేవి.. ఆ సమస్యలు మమ్మల్ని చూసి వెక్కిరించడం లేదు అని అనుకునేదుంటే ఈ ఉద్యమం ఇలా కొనసాగేది కాదమే. మా అమ్మ నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య అని ఒక సరిహద్దును మేము నిర్మించుకునేదుంటే మా ప్రేమ మాత్రమే కాదు శక్తి కూడా పరిమితం అయ్యుండేదేమో.. ఒక కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో ప్రేమ, ఆత్మీయత వెల్లివిరుస్తుందని అర్ధం.. అలా ఒక కుటుంబంలో మాత్రమే కాకుండా ఊరంతా ఆనందంగా ఉండాలని ఆశించాం.
మన ప్రధానమంత్రి గారు 2014 అక్టోబర్ 2నాడు ఎంత గొప్ప సంకల్పంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారో అదే స్పూర్తితో 2014 నవంబర్ 12 నాడు మేము కొంతమంది టీంతో "స్వచ్ఛ చల్లపల్లి" ప్రారంభించాము.. ఒక్కరోజు పండుగగా కాదు, వారం రోజల వేడుకలా కాదు ఏకంగా 1,000 రోజుల యుద్ధంలా కొనసాగింది మా ఉద్యమం. మా స్వప్నం ఒక్కటే మమ్మల్ని పెంచి పెద్ద చేసి, సరైన వ్యక్తిత్వాన్ని అందించిన మా ఊరిని పవిత్రంగా చూడాలని.. అందుకు అనుగూణంగా మా ఊరిలో నివాసం ఉంటున్న ప్రజలతో పాటు, చల్లపల్లితో అనుబంధం ఉన్న ఎన్.ఆర్.ఐ, డాక్టర్లను, నాయకులను ఎంతోమందిని సంప్రదించి వారి అమూల్యమైన సహకారం సంప్రదింపులతో "మనకోసం మనం ట్రస్ట్" స్థాపించాము..
నట్టింట్లో రోజుల తరబడి చెత్తను శుభ్రం చేయకుండా ఉంచితే ఎంత నీచంగా ఉంటుందో అలాగే ఊరి మధ్యలో చెత్త పేరుకుపోయి ఉండడం కూడా అంతే నీచంగా ఉంటుంది. మా ఊరుని శుభ్ర పరచడానికి ఉదృతంగా మా ఊరి ప్రజలు ముందుకు వచ్చారు.. కొంతమంది మనకెందుకులే, ఏవో పనులున్నాయి అని సాకులు చెప్పినా కాని తర్వత తర్వత మా ఉద్యమంలోని లక్ష్యం అర్ధమవ్వడంతో మిగిలిన వారందరూ తమ బాధ్యతగా ముందుకు వచ్చారు.. మొదట్లో మా ఊరిలో ఉన్న 4,850 ఇళ్ళల్లో 520 ఇళ్ళకు టాయిలెట్స్ లేకుండేవి, సమిష్టి సహకారాలతో ఆ మిగిలిన 520 ఇళ్ళకు కూడా టాయిలెట్స్ నిర్మించాము.. పార్క్, స్కూల్, హాస్పిటల్ ఇలా ప్రతి ఒక్క వాటిని శుభ్రపరిచి అన్ని సదుపాయాలను అందించాము.. ఒకసారి చేయడం వేరు దానిని క్రమం తప్పకుండా ఆ స్వచ్ఛతను పోషించడం వేరు.. మా వాలంటీర్లు ఇప్పటికి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి ఏడు వరకు ఆనందంగా ఊరిని శుభ్రం చేస్తుంటారు.
మేము లక్షల చెట్లు నాటాము అని అంకెలలో గొప్పలు చెప్పుకోవడం కన్నా నాటిన ప్రతి చెట్టును సంరక్షిస్తున్నాము అని గర్వంగా చెప్పుకోడానికే ఇష్టపడుతాం. ఈ రెండు సంవత్సరాలలో సుమారు 5,000 చెట్లు నాటాము. ఒక ఇంటి ముందు పచ్చని చెట్లు ఉంటే ఎంత హాయిగా చల్లగా ఉంటుందో అలా మా ఊరిలో కూడా ఊరుకు వచ్చే దారి నుండే ఆ పచ్చదనం కనిపిస్తుంది.. ఇంకా పరిశుభ్రత విషయంలో మాత్రమే కాదు అక్షరాస్యత, పెద్దవారికి చదువుచెప్పడం, వ్యవసాయ సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా వ్యక్తిగత సమస్యలను కూడా మా ఇంటి సమస్యలు లానే భావించి వాటిని సమిష్టిగా పరిష్కరిస్తున్నామండి.. ఆ మధ్య కొంతమంది అధికారులు చెబుతుంటే తెలిసింది "యావత్ భారతదేశంలోనే త్వరితగతిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉన్నతంగా మారిన గ్రామాలలో మా చల్లపల్లి కూడా ఉందని". ఇంత సాధించాం అనే ఆనందంతో పాటు ఈ గుర్తింపు ద్వారా మా ఊరు మరో ఊరికి స్పూర్తినిస్తుందనే ఆలోచన మాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది..