Contributed By: Sri Harsha Pulipaka
నెత్తిమీద సూర్యుడు ఒత్తిడి చేస్తున్నాడు. కదిలే గాలికూడా రగిలే నిప్పై తగులుతుంది. అప్పటిదాక కణం లో కణం లా కలిసున్న ఆ ప్రేమికులిద్దరూ క్షణం లో కలిగిన మార్పులని ఓర్చుకోలేకున్నారు. ఒప్పుకోలేనన్నాడు తెలి మంచు శిఖరం. తప్పదని కరిగింది తనుంచి నీరం. బొట్టు బొట్టు పై ఒట్టు పెట్టి చెప్పింది తిరిగొస్తానని. వెళ్ళకుండా పట్టుకోలేక వెళ్ళిపోతే తట్టుకోలేక చెప్పాడు ఎదురుచూస్తానని. ఇద్దరూ ప్రకృతి ని ప్రార్థించారు. అతను వదిలాడు.. ఆమె కదిలింది.
చేసింది చాలా పెద్ద ప్రమాణం. చెయ్యాల్సింది చాలా పెద్ద ప్రయాణం. చుక్క చుక్క తో చేస్తున్న స్నేహం నేల చేరేసరికి అయింది ప్రవాహం. పల్లం సాయం చేస్తుంది.. గులక రాళ్ళు దారి చూపిస్తున్నాయి. లోయలోకి జారే నీరు వేగం పెరిగిందని పరవళ్ళు తొక్కింది. అంతలోనే జరిగింది ప్రమాదం. అంతరిక్షం నుంచా అన్నట్టుంది జలపాతం. జారిపడ్డ నీరులోని ప్రతీ చుక్క ముక్కలైంది. చెల్లాచెదురైన ఒక్కో చుక్కలోని ఒక్కో ముక్కనీ వెతుక్కునీ.. ఒకదానికొకటి అతుక్కుని... నీరులా మారింది.. పారింది.
దాటాలి దాటాలి... గుళ్ళు దాటాలి.. ఊళ్ళు దాటాలి. పైర్లు దాటాలి.. మైళ్ళకు మైళ్ళు దాటాలి. అడవులు దాటాలి.. మడుగులు దాటాలి.
తీరాన్ని తడిపితె నేల పీల్చుకుంటుంది అలల్లో కలవకూడదు. తినే ఆహారాన్ని తడిపితే వేర్లు పీల్చుకుంటాయి పొలాల్లో పారకూడదు.
మోస్తానన్న కడవలో చేరకూడదు.. మోయమని వచ్చినా పడవలని విడువకూడదు.
ఎండైన రవి తాపం.. ఎవడో చేసిన పాపం.. ఎన్నో గొంతుల దాహం.. అన్నింటినీ దాటేందుకు సాయం.. ప్రతీ చుక్క తో చేసిన స్నేహం.
అన్నీ ఛేధించి అనుకున్నది సాధించిన ఆ చక్కని చుక్కకి చివరి మజిలీలొ 'చుక్కెదురైంది'.
అనివార్యమంటూ తనలో కలుపుకుంది సంద్రం. అంతులేనీ ఆ సాగరం లో దిక్కు తోచక బిక్కు బిక్కుమంటుంటే.. తప్పదన్నట్టు ఉప్పు కలిసింది. ఉప్పు కలిసిన నీరు తీరు మారింది.. దారి మారింది... మతం మారింది.. గతం మరిచింది.
శిఖరం ఎదురు చూస్తున్నాడు.. మాసాలు మారిపోతున్నాయి.. కనపడ్డ ప్రతీ మనిషిని అడిగాడు. వారు తెచ్చుకున్న త్రాగు నీటిలో దాగి ఉందేమోనని.. లేదన్నారు. ఋతువులు జారిపోతున్నాయి.. తన దగ్గరకి తపస్సుకొచ్చిన ప్రతీ ఋషిని అడిగాడు.. భుమండలానికి జారిన తన ప్రేయసి తనని చెరటానికి తమ కమండలాలలో చేరిందేమోనని.. వారూ లేదన్నారు.
ఎదురు చూపులకు తుది లేకున్నది.. ఎవరి నడగాలో తెలియకున్నది. అతడి ఉక్రోషాన్ని కొలిచేందుకు ఉష్ణోగ్రతలు చాలకున్నవి. ప్రాణం పోయినా ప్రేమను చేరాలనుకున్నది. అంతే.
స్నేహితుడ్ని సాయం అడగ సంకల్పించాడు. కొండలు తిరిగిన దేహంతో చేతులు చాచిన నగం.. పృథ్విలో సగం.. అన్నంత ఉంది. నీహారం పూసుకున్న ఆ ఆహార్యం తల ఎత్తి ఆదిత్యుని ఆతిధ్యమడిగింది.. సరేనన్నాడు సూర్యుడు.
భానుడి నుండి కదిలిన క్రాంతి భూమిని చేరువరకు లేదు విశ్రాంతి.. ఎన్ని యోజనాలన్నది యెచించి ప్రయెజనం లేదు. ఇచ్చిన మాటకోసం వదిలిన తూటాలు అవి. ఎదురు చూస్తున్న హిమాద్రి ని ఎనిమిది నిముషాలలో చేరింది. దూది లాంటి మంచు తో సూది లాంటి కిరణం రణం మొదలైంది. నెత్తురు కాదు నిరు ఏరులై పారుతున్న ఈ నిశ్శబ్ధ యుద్ధంలో ఓటమే అతడి గెలుపు. కాంతి ఖడ్గం కూల్చిన ఆ కొండ చర్యలు మరిగి,విరిగి,కరిగి ఉరుకులెడుతున్నాయి. తన ప్రణయాన్ని చేరేందుకు పరవళ్ళు తొక్కుతున్న అతడి ప్రయాణం ప్రలయమేమో అన్నట్టు ఉంది. పాపం ఆ పిచ్చి పర్వతానికి తెలియని సత్యం..
భాస్కరుడు అద్రి పైనే కాదు సముద్రాని పై కూడా ప్రకాశిస్తాడు.. తుహినం కరిగి అతడు వస్తున్నాడు.. సంద్రం మరిగి ఆమె ఆవిరై వెళ్ళిపోయంది. గర్జించే గగనాల సాక్షిగా.. ఈ ప్రేమ ప్రయాణం నిరంతరం.
ప్రకృతి ధర్మాన్ని పాటించే ప్రయత్నం లో ఈ ప్రేమ జంటని విరిచీ, కలిపీ, మళ్ళీ విరిచి, మళ్ళీ కలిపి ఇలా కలుపుతూ చెరుపుతున్న పాప భారాన్ని మోస్తూ నిత్యం తనలో తను రగులతూనే ఉన్నాడు రవి.