మన హిందూ పురాణముల ప్రకారం దాదాపు ప్రతి ఒక్క దేవునికి, దేవతకు, ఆఖరికి నరకంలోని యమ ధర్మరాజుకి కూడా ఒక ప్రత్యేక వాహనం ఉంది. ఇందులో పరమేశ్వరుని వాహనం నందికి మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భక్తులు శివునిపై ఎంతటి భక్తి పారవశ్యంలో ఉంటారో ఆయన వాహనం నందిపై కూడా దాదాపు అంతే గౌరవంతో ఉంటారు. ఆ నందిపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుసుకుందాం.
నంది జననం: పూర్వం పరమేశ్వరుని భక్తుడైన శిలాదుడు అనే మహర్షి సంతానం కోసం శివుడిని ప్రార్ధించాడు. తనకి శివుడి అంతా కొడుకు కావాలని తపస్సు చేశాడు. ఊహించినట్టుగానే శివుడు వరం ఇచ్చాడు. అలా కలిగిన సంతానానికి 'నంది' అని పేరు పెట్టారు. ఐతే నందికి తన ఆయుష్షు కొంతకాలమే ఉంటుందని తెలుసుకుంటాడు. అప్పుడు నంది శివునికై తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీవు శాశ్వతముగా నా చెంతనే ఉండే వరం నీకు ప్రసాదిస్తున్నాని అనుగ్రహించాడు.. అప్పటి నుండి నంది నందీశ్వరునిగా శివుని వాహనంగా ఉంటున్నారు.
నంది స్థానం: నందీశ్వరుడు కేవలం శివుని వాహనం మాత్రమే కాదు. శివునికి అత్యంత ఆత్మీయుడు కూడా, శివ గణాలకు నంది సారధ్యం వహిస్తారు, కైలాసంలోని పరమేశ్వరుడుని దర్శించాలంటే ముందు నంది అనుమతి తీసుకోవాలి.
నంది శక్తి: శివుని అనుగ్రహంతో జన్మించిన కారణంగా నందికి కొన్ని విశిష్ట శక్తులు సంక్రమించాయి. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మధనం చేస్తున్న సమయంలో అమృతానికి ముందు విషం వచ్చింది. ఆ విషం వల్ల ఎవ్వరికి ఇబ్బంది ఉండకూడదని పరమేశ్వరుడు ఆ విషాన్ని మింగుతాడు. ఆ సమయంలో కొన్ని విషపు చుక్కలు కిందపడ్డాయట ఆలస్యం చేయకుండా వెంటనే ఆ విషపు చుక్కలు నంది తాగాడు. ఆ చర్యకి నందికి మరణం తప్పదని అక్కడి దేవతలు, రాక్షసులు భావించారట కాని నంది నా శక్తితో జన్మించారు కాబట్టి నందికి ఏ విధమైన ఆపద ఉండదని శివుడు అభయమిచ్చారట.
నంది వ్యక్తిత్వం: నందీశ్వరుడిని నిజాయితీ, ధర్మానికి, విశ్వాసానికి, శక్తికి ప్రతీకగా గుర్తిస్తారు. శివుడు కొలువైన ప్రతిచోట, అది చిన్న దేవాలయమైనా, పెద్ద దేవాలయమైన శివుడు ఉన్న ప్రతి చోట నంది కొలువై ఉంటాడు. నిరంతరం శివుడినే చూస్తూ శివుని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తు ఉన్నట్టుగా ఆయన దర్శనమిస్తారు. శివుడికి ఎదురుగా కూర్చుని ప్రతిక్షణం చూసే అదృష్టం నందికి ఉంటుంది.
రావణాసురుడి పై ఆగ్రహం: పరమశివుని పరమ భక్తుడైన రావణాసురుడు ఒకసారి కైలాసంలోని ఈశ్వర దర్శనానికి వెళుతుండగా కొన్ని కారణాల చేత రావణుడిని నంది అడ్డగించారట. దానికి విచక్షణ మరిచి "కేవలం నువ్వొక ఎద్దువి, నా వంటి వీరుడిని ఆపే అర్హత నీకు లేదు, చూడటానికి అచ్చు కోతిలా ఉన్నావని కించపరిచారట". ఆ మాటలకు నంది ఆగ్రహంతో "నన్ను కోతిలా ఉన్నావని పోల్చావు కదా గుర్తుపెట్టుకో, ఆ కోతి చేతిలోనే నీ సామ్రాజ్యం దహనమవుతుంది, నీవు ఆ కోతి సమక్షంలోనే సర్వనాశనం అవుతావని శపించారట.
నంది చెవిలో చెబితే: సాధారణంగా దేవాలయాలలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు దీనికి ఒక కథ ఉంది. ఒకసారి శివుడు, పార్వతి, నంది ధ్యానంలో నిమగ్నమయ్యారట. అదే సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతి మాతను అపహరించాలని ప్రయత్నం చేశాడు. ఈ చర్య ముందుగానే తెలుసుకున్న వినాయకుడు ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకున్నాడు.. కాని వినాయకుడు, ఇతర దేవతలు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరికి వెళ్ళే సాహసం ఎవ్వరు చెయ్యలేదట. అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే ఖచ్చితంగా శివునికి చేరుతుందని నందికి ఆ విషయం చెప్పారట. ఆ విషయం తెలుసుకున్న వెంటనే శివుడు రాక్షసుడిని సంహారించారు. ఇక అప్పటి నుండి నంది చెవిలో చెబితే శివునికి చేరుతుందని ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.