కరీంనగర్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వసీం అక్రంకు ఊహ తెలిసినప్పటి నుండి పోలీసులన్నా వారి జాబ్ అన్నా విపరీతమైన గౌరవం, ప్రేమ. దీనికి ప్రధాన కారణం వసీం గారి నాన్న కూడా పోలీస్ శాఖలో ఏఎస్ ఐ గా విధులు నిర్వహించేవారు. నాన్ననే హీరోగా భావించి తాను కూడా పెద్దయ్యాక పోలీస్ అవుతా అని కలలు కనేవారు. "ఒక పోలీస్ కొడుకు అంటే ఏముందిరా ఆడుతూ పాడుతూ జాబ్ సంపాదించొచ్చు ఎందుకంటే పరిచయాలుంటాయి, అవసరమైతే డబ్బు కూడా అందుతుంది" అని అనుకోవచ్చు.. కాని వసీం అక్రం అలా కాదు..
ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక పేపర్ బాయ్ గా చేశారు, రిలయన్స్ సంస్థలో సిమ్ కార్డ్ లను అమ్మారు, ప్రెట్రోల్ బాంక్ లో వాటర్ ప్లాంట్ లో జాబ్ చేశారు, సెక్యూరిటి జాబ్ కూడా చేశారు. ఇలా ఎన్నో రకాలుగా కష్టపడి కుటుంబానికి ఆసరగా ఉంటునే 2013 సంవత్సరంలో తన ఎన్నో ఏళ్ళ లక్ష్యాన్ని ఛేదించారు. కాని నాన్న అదే సంవత్సరం ఏఎస్ ఐ గా విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఉద్యోగం పొంది తన సర్వీస్ తో నాన్నను సంతోష పెట్టాలనుకున్నా కాని అది నెరవేరలేదు. తన తండ్రి జ్ఞాపకార్ధం, ఇంకా తను పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడకూడదు అని ఒక ఫౌండేషన్ ను స్థాపించాలనుకున్నారు. తన తండ్రి ఏఎస్ ఐ యూనిఫామ్ మీద ఒక స్టార్ ఉంటుంది. ఆ స్టార్ పేరుతో "స్టార్ ఫౌండేషన్" ను స్థాపించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
ఇందులో భాగంగా వసీం గారు ప్రతిరోజు విధులు నిర్వహించి నేరుగా తన ఇంటికి కాకుండా కోచింగ్ సెంటర్ కు వెళ్ళి అభ్యర్ధులకు సూచనలివ్వడం, పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గ్రౌండ్ లో ట్రైనింగ్ ఇవ్వడం చేస్తుంటారు. తన తండ్రి రిటైర్మెంట్ డబ్బు నుండి 1,50,000 ఖర్చుపెట్టి లైబ్రరి నిర్మించారు. ఇందులో సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, సివిల్స్, గ్రూప్4, వీఆర్ ఓ, వీఆర్ ఏ, ఆర్మీ, నేవి లాంటి పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉంటాయి. మనం నిజాయితితో ఒక మంచి సేవ చేస్తుంటే అందుకు తోడుగా మరికొంతమంది కూడా తప్పక వస్తారు. Star Foundation ద్వారా Competitive Exam రాసే స్టూడెంట్స్ కి కోచింగ్ ఇవ్వడానికి కొంతమంది ఉపాధ్యాయులు ముందుకొచ్చారు.. అర్జున్(తెలంగాణహిస్టరీ), శ్రీధర్(జాగ్రఫి), మహేందర్ రెడ్డి(మాథ్స్), ప్రదీప్(హిస్టరీ)రాజశేఖర్ (జనరల్ నాలెడ్జ్), ఈ ఐదుగురు ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
మొక్కను నాటడంతోనే అంతా అయిపోదు.. ఆ మొక్కను పెంచి చెట్టు అయ్యి.. పండ్లు అందిస్తున్నప్పుడే ఆ పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. "ఈ స్టార్ ఫౌండేషన్ లో శిక్షణ తీసుకున్న 120మంది విద్యార్ధులలో ఇప్పటికి దాదాపు 100కు పైగా జాబ్ కు ఎంపికైయ్యారు". ఇది వారి శ్రమకు నిలువెత్తు నిదర్శనం. ఒక నిజాయితి, బాధ్యతాయుతమైన కానిస్టేబుల్ ఇంతలా సేవ చేయగలుగుతున్నారంటే మిగిలిన ఉన్నత అధికారులు కూడా ముందుకొస్తే ఇంకెంతలా సేవ చేయగలరో..