Contributed By Phaneendra Varma
నిరుద్యోగి అయిన ప్రతి వాడు వాడికి వాడు వేసుకునే మొదటి ప్రశ్న. నాకు ఏమైనా పని వచ్చా? నాకు ఏ పని చేయడం వచ్చు?? తినడం, తిరగడం, పండటం తప్ప.. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నేను చేసింది ఏమిటి? చేయాల్సింది ఏమిటి? వాళ్ళు నలుగురి మధ్యకు వెళ్లాలి అంటే నాలుగు సార్లు ఆలోచించుకుని, అవమానం జరిగితే భరించుకొని వాళ్లలో వాళ్లు కుమిలిపోయేలా చేసింది నేనేనా? నాలుగు వందల మైళ్ళ దూరంలో ఉన్న నాలుగు నిమిషాలే అయినా వాళ్లతో మాట్లాడడానికి నా మాటలు మూగబోయినాయి, నాలో మాటలు కరువు కోరలు చాచింది.
ఇంటి మీదో లేదా అమ్మ మీదో బెంగా దేహాన్ని దయించి వేస్తుంది, దీపావళి రోజు కూడా ఒంటరితనం వీడనంటుంది. నాలో ఆ తప్పు ఎక్కడ ఉందో కనిపెట్టి దాని పని పట్టేది ఎలా??
నా తోడుగా ఉండు అని ఆరోజు ఆమెను బతిమాలినా నా ప్రేమ నన్ను దోషిగా నిలబెట్టే రోజు వచ్చేసిందా?? పనికోసం ఎక్కిన ప్రతి మెట్టు తిరిగి పొమ్మంది అన్న నిజాన్ని ఆమెకు చెప్పాలి అనుకున్న నాలోని ఈ నిజాన్ని ఎన్నాళ్ళని దాచాలి, నా అబద్ధాలే మా బంధానికి బరువై మా నమ్మకానికి శాపం అవుతుందా?? ఆమెతో చివరిగా హాయిగా నవ్వుతూ ఎప్పుడు మాట్లాడానో నాకు గుర్తులేదు. నా ఈ అసమర్ధతకు ఆమెను బలిపశువును చేయటం ఎంతవరకు సబబో నాకు తెలీదు. ఆమె నా పైన చూపించిన దయకు పంచిన ప్రేమకు కృతజ్ఞతగా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది??
పనికిరానివాడిగా, పనిలేనివాడిగా, పనికిమాలినవాడిగా ఈ సమాజం ఒక ముద్ర వేసి వదిలేసింది. ఇక మెట్లెక్కే ఓపిక లేదని చివరకు ఎక్కిన ఆ భగవంతుని సన్నిధి మెట్లు.. ఆయన దర్శనం అయితే కలిగింది కానీ ఆయన కరుణ కానరాలేదు జీవితంలో ఏ మలుపు చోటు చేసుకోలేదు. నాకు నా మీద ఉన్న నమ్మకం ధైర్యం రెండు నీరుగారి పోతున్న నా గెలుపు జాడ లేదు! నా గమ్యం అగమ్యగోచరంగా దర్శనమివ్వడం మొదలైంది!! చివరకు ఒంటరితనం నాకు అలవాటు అయింది అదే నాతో మిగిలిపోయింది.. కానీ ఒక రోజు నా జీవితం ఒక మలుపు తీసుకుంటుంది అప్పటివరకు నా ప్రయాణం ఇలా సాగుతుంది.