ఆరోజు రామస్వామి గారి 90వ జన్మదినం.. ఆశీస్సుల కోసం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. దైవ దర్శనం అయ్యాక బయటకు వచ్చారు, గుడి ముందు శారీరకంగా, మానసికంగా వికలాంగుడైన చిన్న బాబు. బాబు ఆచూకి కనుక్కునే సమయంలో తెలిసిన నిజమేమిటంటే కావాలనే వారి తల్లిదండ్రులు అలా వదిలేశారని అర్ధమయ్యింది. రామస్వామి గారు మాత్రం వారిని నిందించలేదు.. "90వ సంవత్సరంలో భగవంతుడు నాకు ఇచ్చిన అపురూప కానుక అని సంతోషపడి తన అక్షయ ఆశ్రమానికి తీసుకెళ్ళారు".
చాలామంది వాళ్ళని వారు తెలివైన వారమని విర్రవీగుతుంటారు.. కాని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తారు. సాటిమనిషికి ఉపయోగపడని అలాంటి వారి మేధస్సు అసలు మేధస్సే కాదు. ఒక తెలివి తక్కువ వారితో కాసేపు మాట్లాడితేనే చిరాకు వేసి ఇక జీవితంలో అతనిని కలవకూడదు అని నిర్ణయించుకుంటాం కాని మానసికంగా పూర్తిగా ఎదగలేని వారితో జీవితాంతం బ్రతకాలంటే అది ఎంత ఇబ్బందికరమో అర్ధం చేసుకోవచ్చు. కాని రామస్వామి వరలక్ష్మి దంపతులు అలా అనుకోలేదు, 1996 అక్టోబర్ 2న ప్రత్యేకంగా మానసిక వికాలాంగుల కోసం "అక్షయ క్షేత్రాన్ని" ప్రారంభించి ఇప్పటికి నిర్విఘ్నంగా 20సంవత్సరాలకు పైగా సేవ చేస్తున్నారు.
కేవలం వారికి భోజనం పెట్టి, వారి బాగోగులు మాత్రమే చూసుకోకుండా వారికి చదువు నేర్పించి, వారికి సరైన పద్దతిలో శిక్షణ ఇచ్చి ఎవ్వరి మీద ఆధారపడకుండా మంచి భవిషత్తును అందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడి చాలామంది పిల్లలు కొన్ని వస్తువులను తయారుచేయగలుగుతున్నారు. అన్ని ఉన్నా మామూలు మనుషులే సరిగ్గా చేయలేరు మరి మానసిక వికలాంగులు ఎలా చేస్తారు అనే అనుమానం అవసరం లేదు వీరు చేసిన ప్లాస్టిక్ రహిత కవర్లను సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేస్తున్నారు అంతటి నైపుణ్యం వారిలో ఉంది.
వయసు పెరుగుతున్న కొద్ది పెద్దవాళ్ళు వారి పిల్లలపై ఆసరా కోసం ఆధారపడతారు కాని రామస్వామి దంపతులు మాత్రం 90సంవత్సరాలు దాటినా కూడా ఎవ్వరికోసం ఎదురుచూడకుండా ఇప్పటికి ఈ ఆశ్రమంలోని పిల్లలను జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు. తమకు లోపం ఉంది ఆనందానికి పనికిరాము అన్న భావన వారిలో కలగకుండా పండుగనాడు కొత్త బట్టలు, పుట్టిన రోజు నాడు వేడుకలు, ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఆశ్రమంలో ఉన్న చాలామంది పిల్లలను వారి తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వదిలేసినవారే, వారి పుట్టినరోజు వివరాలు తెలియవు అందువల్ల వారికి జనవరి 1వ తేదిన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. కేవలం పుట్టినరోజు వేడుకలు మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక సంధర్భాలలో పిల్లలను టూర్ కి కూడా తీసుకు వెళ్తుంటారు. ఇంతటి గొప్ప సేవ చేస్తున్నారంటే వారికి డబ్బు చాలా ఉందని అనుకుంటారు కాని నిజానికి ఈ సేవలన్నీ చేస్తున్నది రామస్వామి గారి పెన్షన్ డబ్బులతోనే.