ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు దర్శిస్తున్న దేవాలయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడే శ్రీనివాసుడు నివసించాడని, ఆ తర్వాత స్వయంభూ గా వెలిశారని భక్తుల నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు వారు కోరుకున్న కోరికలు దాదాపు నెరవేరడంతో ఇక్కడికి ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అన్న గారి దేవాలయం. ఈ గుడి తిరుపతి రైల్వేస్టేషన్ కు సమీపంలో ఉంటుంది.
శ్రీనివాసుని వివాహాన్ని పద్మావతి అమ్మవారితో జరిపించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పెళ్ళిని జరిపించడానికి కుబేరుడి నుండి అప్పు తీసుకుని గోవిందరాజస్వామి వారు దగ్గరుండి వివాహం జరిపించారట. విజయనగర రాజుల కాలంలో తిరుమల ఆలయంతో పాటు ఈ ఆలయం కూడా మరింత అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆలయ గోడల మీద చెక్కబడిన శిల్పాలు.. ఇక్కడ రామాయణ, భాగవతాల దృశ్యాలు గోపురం మీద అందంగా శిల్పాల రూపంలో దర్శనమిస్తాయి. ఈ గుడిలోనికి అడుగుపెట్టగానే అక్కడి దేవతా ప్రతిమలు, ఆలయ సంప్రదాయాలు, వాతావరణం చూస్తే ఒక అతిపురాతనమైన దేవాలయంలోకి అడుగుపెట్టామన్న అనుభూతికి భక్తులు లోనవుతారు. ఇక్కడున్న మరో ప్రత్యేకత ఇక్కడి గోవిందరాజుల స్వామి వారి ప్రతిమ మట్టితో తయారు చేసింది, దీనివల్ల ఇక్కడ అభిషేకాలు జరుగవు.
సాధారణంగా 'దేవాలయం' అంటే ప్రశాంతతకు చిహ్నంలా ఉంటుంది కాని గోవిందరాజులవారి దేవాలయం ఆ కాలంలో జరిగిన కొన్ని ఉద్యమాలకు చిహ్నంలా నిలిచింది. రామానుజుల వారి కాలంలో క్రిమికంఠుడు అనే శైవరాజు ఈ ఆలయంపై దాడిచేసి ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని సముద్రంలో పడేయించారట. ఆ తర్వాత రామానుజచార్యులు ఈ విషయం తెలుసుకుని చిదంబరం నుండి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించారట. ఆ తర్వాత రామానుజచార్యులు వైష్ణవోద్యమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించారట. భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో కూడా ఈ ఆలయం మీద జాతీయ పతాకం ఎగురవేసి ఉద్యమంలో పాల్గొన్నారట. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు అదే ప్రాంతంలో ఉన్న పురాతనమైన దర్శంచుకునే దేవాలయాలో ఈ గుడి కూడా ఒకటి.