కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంభూ గా వెలసిన క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే రెండవ అతిపెద్ద దేవాలయంగా తిరుమలకు గుర్తింపు ఉంది. తిరుమల మాత్రమే కాదు తిరుమల పరిసర ప్రాంతాలలో కూడా స్వామి వారు పర్యటించడంతో ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కూడా కొన్ని విశేష ప్రాముఖ్యత గల దేవాలయాలు వెలిశాయి.. అలాంటి దేవాలయాలలో ప్రముఖమైనది అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం. తిరుపతి నుండి సుమారు 20కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం వెలసింది.


ఈ ఆలయం చుట్టు చల్లని పచ్చని ప్రకృతి ఉండడంతో ఇక్కడికి వచ్చే భక్తులందరికి ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వచ్చామన్న భావన కలుగుతుంది. తిరుమలతో పాటు దాని చుట్టు ప్రక్కల దేవాలయాలను దర్శించుకోవాలని వచ్చే భక్తులు ఈ అప్పలాయగుంట వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారు. వేంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూమార్తే అయిన పద్మావతి అమ్మవారిని నారాయణ వనంలో పెళ్ళిచేసుకున్న తర్వాత ఆయన తన నివాస ప్రాంతమైన తిరుమలకు కాలినడకన బయలుదేరారు. ఆ మార్గం మధ్యలో అప్పలాయగుంటలో తపస్సు చేస్తున్న సిద్దేశ్వర స్వామి తపస్సుకు మెచ్చి శ్రీనివాసుడు సిద్దేశ్వరునికి దర్శనమిచ్చారు.


సిద్దేశ్వరుని కోరిక మేరకు అదే చోట తనకు దర్శనమిచ్చినట్టుగానే అభయముద్రలో ప్రతిమరూపంలో భక్తులందరికి దర్శనమివ్వాలని కోరారు. ఆ కోరికను మన్నించి శ్రీనివాసుడు ఇక్కడ వెలిశారని పురాణం ద్వారా తెలుస్తుంది. తిరుమల ఇంకా చాలా దేవాలయాలలో స్వామి దీవెనలు అందించే హస్తం కిందికి చూపిస్తూ ఉంటుంది కాని ఈ దేవాలయంలో మాత్రం హస్తం పైకి చూపిస్తు ఉండడం విశేషం. ఇక్కడ పూర్వం మహర్షులు మునులు యోగులు గుట్టలో తపస్సు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో ఉండే గుట్టను యోగుల గుట్టగా పిలుస్తారు. తిరుమలకు ఉండే పవిత్రత ఈ దేవాలయానికి ఉండడంతో తిరుమలలో జరిగే దాదాపు అన్ని పూజలు, ఉత్సవాలు ఇక్కడా జరుగుతాయి.

