"నువ్వు నాకోసం పుట్టావు.. నేను నీకోసం పుట్టాను.. మనిద్దరిది వెయ్యి జన్మల అనుబంధం".. ఇలా ప్రేమికులు ఒకరికళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ వారి కళ్ల వెనుక ఉన్న అనుభూతులను పంచుకుంటారు. అది సహజమే.. "నీకోసం నేను, నాకోసం నువ్వు, మనిద్దరి కోసం ఇదిగో ఈ ప్రకృతి కూడా పుట్టింది అని జయతి, లోహితాక్షన్ వీరి ముగ్గురి ప్రణయ బంధాల గురించి అనుభూతి చెందుతూ ముగ్గురు కలిసి జీవిస్తున్నారు. ఒక మనిషి బ్రతకడానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది.? ఏ వస్తువులు అవసరమవుతాయి.? అని ఓరోజు చర్చించుకుని అనవసరమైన హంగూ, ఆర్బాటాలను వదిలేసి వారిద్దరి కోసం పుట్టిన ప్రకృతితో కలిసి ఆహ్లాదంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ప్రేమ చేసిన పెళ్ళి:
జయతి తెలంగాణ బోధన్ ఆజాంగంజ్ క్యాంపులో పుట్టింది, లోహితాక్షన్ కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లా ప్రాంతంలో పుట్టారు. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు ఈ జన్మలో ఇలా ప్రేమ వీరిద్దరిని కలిపింది. వీరిద్దరి కలయిక కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది వారి ఎదలో. ఎంఏ ఇంగ్లీష్ చేసిన లోహి చైనా భాషలో "నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను" అని రాసి పంపించారట. కాని జయతి అలా కాదు తన భావాలను ఐదు పేజీలలో అందమైన అక్షరాలలో పొందుపరిచి ఇచ్చిందట. మరోమాట లేదు భావాలన్ని అక్షరాల రూపంలో జన్మించిన తర్వాత ఇంకేముంటుంది మాట్లాడుకోవడానికి.. ప్రేమ వారిద్దరిని అలా కలిపింది. ఆ తరువాతనే వీరిద్దరు ప్రకృతిలో ఐక్యమయ్యారు..
ప్రకృతి ప్రేమలో..
విరబూసిన సన్నజాజులు, విరగ్గాసిన జమపండ్లు, అయ్యో నా ప్రేమను అందుకోలేరోమోనని సన్నని దారంలాంటి కొమ్మతో పండ్లను అందిస్తున్న మామిడి, శాంతిని చేకూర్చే మల్లెలు, స్వేదాన్ని తుడిచి స్వాంతన చేకుర్చే చల్లని గాలి.. ఈ ప్రకృతి మా ఇద్దరిని ఇంతలా ప్రేమిస్తుంటే మేమెందుకు ఇలా సిటీ ఎడారిలో బ్రతకడం అని అనుకున్నారు. కూ.. అని అడవిలో ఉన్న కోకిల రమ్మని పిలిచిందేమో జయతి, లోహితాక్షన్, ప్రకృతి ముగ్గురూ అలా ఏకమయ్యారు.
గమ్యం లేని ప్రయాణాలు..
"ఎక్కడికి వెళుతున్నామో, ఎంత దూరం ప్రయాణిస్తున్నామో తెలియకుంటే ఆ మార్గం అందంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రయాణంలో గమ్యం గురించి ఆలోచన ఉండదు కనుక మార్గాన్ని అనుభూతి చెందుతుంటాం". జయతి, లోహితాక్షన్ ల ప్రయాణాలు ప్రణాళికలు లేనివి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళతారు. ఆ మార్గం కూడా కిక్కిరిసిన రైలు కావచ్చు, సైకిల్ కావచ్చు, కాలి నడక కావచ్చు ఏ ప్రయాణం వారిని ఇబ్బంది పెట్టదు. భౌతికంగా మాత్రమే కాదు వారిలో వారు వేల కిలోమీటర్లు పయనిస్తారు. పేదవారిగా మారి పేదవారితో కలిసి బ్రతుకుతారు. రైతు కూలీలుగా మారి పొలం పనులు చేస్తారు. గిరిజనులుగా మారి అడవిలో దొరికే దుంపలనే పరమన్నాలుగా భుజిస్తారు. ప్రకృతి అంటే గాలి, నీరు, నింగి, నేల, ఆకాశం, చెట్లు, చేమలు, కొండలు, నదులు, సముద్రాలు మాత్రమే కాదు ప్రకృతి అంటే వీరి దృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి మనిషీ కూడా..
ఈ ప్రయాణంలోనే వీరు ఓ రికార్డును కూడా నెలకొల్పారు అదే "60 రోజులలో 2100కిలో మీటర్ల సైకిల్ ప్రయాణం".. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభింపక ముందు జయతికి సైకిల్ తొక్కడమే రాదు కాని నేర్చుకున్నారు. ఏ వాహనమో మనల్ని మోస్తూ వెళ్ళడం కన్నా మనల్ని మనమే తీసుకెళదమని సుందరమైన విశాఖ అడవి, అనంతగిరి, తూర్పు గోదావరి, ఏటూరు నాగారం, అదిలాబాద్ లోని కేవలం అడవి ప్రాంతాలు, కిక్కిరిసిన చెట్ల జనాబాతో వెలసిన నల్లమల్ల అటవీ ప్రాంతం, పులికాట్ సరస్సు మొదలైన ప్రాంతాలలో వీరు ప్రయాణం సాగించారు.
"ప్రకృతితో ఐక్యమయితే మనకే బాధలుండవు, ప్రకృతితో సంబంధాలు తెగిపోవడం వల్లనే ఇన్ని బాధలు" అని ఓషో అంటుంటారు. అవును ప్రకృతిలో ఐక్యమయ్యాకనే జయతి లోహితాక్షన్ తమ జీవితంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నారు. భయాన్ని పోగొట్టుకున్నారు, మనుషులను మరింత ప్రేమించగలుగుతున్నారు.. మనసులోని భావాలను ఏ దాపరికం లేకుండా ప్రదర్శించగలుగుతున్నారు.. మనస్పూర్తిగా నవ్వుతున్నారు, ఇతరుల కోసం కన్నీళ్లు పెట్టుకోగలుగుతున్నారు. ప్రేమకు అవధులు లేవు, అడ్డు గోడలు లేవు, ప్రణాళికలు లేవు, పేద ధనిక తేడాలు లేవు ఒక్కసారి ఈ ప్రకృతితో ఐక్యమవ్వండి.. ఆ ప్రకృతి ప్రేమ రుచి ఎంత మధురమో..