Contributed By Muni Hemanth
1.అంతర్మధనం(ప్రారంభం) Time: 8:30 PM Location: Office Parking "అబ్బా! ఏమి వర్క్ రా బాబు, టార్గెట్లు, డెడ్లైన్ లు నిద్రలో కూడా ఇవే కలవరిస్తున్నా నేను, రోజుకి 24 గెంటలు పని చేసినా పూర్తవదే, సర్లే అసలే లేట్ అయింది, ఇంటికి స్టార్ట్ అవుదాం" అని బైక్ కిక్ కొట్టాను…… బండి వేగం అందుకుంది, నా ఆలోచనలు కూడా "జీవితం యాంత్రికం అయిపోయింది, మాటలు కృత్రిమం అయిపోయాయి, కలలు కంటున్నాం, మనమే వాటి మీద నీళ్లు చల్లుకుంటున్నాం, అన్నింటి మీద ఆశ పెంచుకుంటాం, ఆ ఆశ తాత్కాలికం అని తెలిసినా బాధ పడుతుంటాం" బండి ఆగింది, రెడ్ సిగ్నల్ పడింది, "నా చుట్టూ ఇంచుమించు ఒక 100 మంది ఉంటారు, అందరూ కాలం తో పరిగెత్తె వారే, అందరికి కాలం తో పరిగెత్తాలి అని తెలుసు, ఎందుకు పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అనేదే తెలీదు" గ్రీన్ సిగ్నల్ పడింది……."ఎలా పరిగెత్తాలి, ఎందుకు పరిగెత్తాలి తెలియక వేరే వాళ్లని ఫాలో అవుతూ వేరే వాళ్ల జీవితాల్ని బ్రతుకుతారు, వేరే వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు, మన గమ్యాన్ని మర్చిపోతారు, చివరికి మారిపోతారు.. నా బైక్ సైడ్ మిర్రర్ అందులో నా ఫేస్ నాకే చూపించి నువ్వు అలాంటి వాడివే అని గుర్తుచేసింది. అవును! నేను అందరి లాంటి వాడినే, నేను సంతోషం గా ఉండాలి అంటే ఏం చేయాలో నాకు తెలుసు, కానీ చేయగలిగే టైం లేదు, పరిస్థితులు బాగా లేవు అని నాకు నేనే సర్దిచెపుకుంటాను, దీన్నె ఆత్మవంచన అంటారు, కొత్తగా చెప్పాలంటే అందంగా ఉన్న అమ్మాయికి మేకప్ వేసి అందవిహీనం గా మార్చి అదే గొప్ప అందం అనుకోవడం లా అన్నమాట, మన ఆలోచనలు ఎలా ఉన్నా కాలం మనతో ఆడించే బ్రేక్ డాన్స్ ఆగదు, గడియారం లో తిరిగే ముళ్ళు ఆగదు, కానీ ఆపితే నా బైక్ ఆగుతుంది" నా రూమ్ వచ్చింది, బైక్ ఆగింది. ఇంటి డోర్ తెరిచి లోపలికి వెళ్ళాను " అంతా చీకటి, మనం బాగా గెట్టిగా కోరుకుంది దోరక్కపోతే మన మనసులో ఏర్పడేంత చీకటి" లైట్ వేసాను, ఫ్రెష్ అయ్యి అలా కూర్చున్నాను, మిర్రర్ లో నా ఫేస్ నాకు కనిపిస్తుంది, "కళ్ళు, ముక్కు, నోరు అన్నీ వాటివాటి ప్లేస్ లో అవే ఉన్నాయి, ఒక కళ తప్ప. కమ్మటి వాసన పీల్చని ముక్కు, అద్భుతమైన రుచి తగలని నాలుక, అసలైన అందాన్ని చూడని కళ్ళు…..జీవం లేని జీవితం, డేటా లేని స్మార్ట్ ఫోన్ లాగా, ఫ్యూయల్ లేని ఇంజిన్ లాగా, గాలి లేని గాలిపటం లాగా ఉంది, ఉపయోగం లేకుండా" అలా ఆలోచనలతో కుర్చీలోనే కూర్చొని కళ్ళు మూసుకున్న, "ఒక స్వేచ్ఛగా ఎగిరే పావురం కనిపిస్తుంది, దాని స్వేచ్ఛ నాకు చాలా నచ్చింది, దాన్ని పట్టుకుందాం అని పరిగెడుతున్నా, నేను దగ్గరగా వెళ్తున్నా, ఆ పావురం దూరం గా వెళ్ళిపోతుంది, నా వేగం పెంచాను, పావురానికి నాకు మధ్య ఉన్న దూరం తగ్గుతోంది అనిపిస్తుంది, ఇంతలో ఒక అమ్మాయి నా చేయి పట్టుకుంది, అమ్మాయి చాలా అందం గా ఉంది, నా కళ్ళలో కళ్ళు పెట్టి కొంటె గా చూస్తుంది, కవ్విస్తుంది, చిలిపిగా నవ్వుతుంది, నా చేతులు గెట్టిగా పట్టుకుంది, నా ఆశలు కోరికలు మారిపోతున్నాయి, ఆ అమ్మాయి కళ్ళలోకే చూస్తున్నా, మెల్లగా ఆ కళ్ళలో జీవం పోయింది, దూది రేకులు లాంటి బుగ్గలు నల్లగా మాడిపోయాయి, కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి, నాకు భయం మొదలయ్యింది, ఎక్కడ మొదలెట్టానో గుర్తొచ్చింది, ఇక్కడ ఎందుకు ఆగిపోయానో అర్థంకాలేదు, నా మీద నాకు చాలా కోపం వచ్చింది, పక్కకు తిరిగి చూస్తే పావురం చాలా దూరం గా వెళ్ళిపోయింది….. అందుకోలేనంత దూరంగా…..!!! నా చేయి పట్టుకున్న అమ్మాయి మెల్లగా ఒక రాక్షసి లా మారి నన్ను మింగేసింది" నేను ఉలిక్కిపడి నిద్రనుండు లేచాను… వెళ్లి నీళ్లు తాగాను, ఇంతలో ఫోన్ రింగ్ అయింది….. మా ఫ్రెండ్ నుండి…… మాట్లాడాను…. ఒక ఫోన్ కాల్, వంద రకాల అనుమానాలు, వంద రకాల ఆనందాలు, వంద రకాల ఆలోచనలు… కానీ ఒకటే క్వశ్చన్… లీవ్ దొరుకుతుందా లేదా అని " వీడేమో ఫోన్ చేసి అందరం ట్రిప్ వెళ్తున్నాం, ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి, నువ్వు వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకో అని క్లుప్తంగా చెప్పి పెట్టేశాడు"..."ఇప్పుడు ఈ టైం లో మనకు లీవ్ ఇస్తారా, ఆఫీస్ లో వర్క్ చాలా ఉందే..." ధైర్యం చేసి మా మేనేజర్ కి కాల్ చేసాను… వెంటనే ఒప్పుకున్నారు, ఊహించలేదు, "అంతేలె ప్రపంచం లో కోన్ని వింతలకి explainations ఉండవు అంటారుగా ఇదీ అంతేనేమో" అనుకోని టికెట్స్ బుక్ చేసుకొని పడుకున్నాను. పడుకున్నా ఒకటే ఆలోచన, లైఫ్ లో ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్.. అలానే ఆలోచిస్తూ పడుకున్నా ఇంతలో మా మేనేజర్ కాల్ " ఏంటి బాబు ట్రిప్ అన్నావ్ ఎక్కడికో చెప్పలేదు" ……. కూర్గ్(coorg).............
********* 2. బెంగళూర్ డేస్ Day:1 Time:5:30AM Location:Bangalore railway station ట్రైన్ దిగాను, నా ఫ్రెండ్స్ వేరే ట్రైన్ లో వస్తున్నారు, కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, నేను వచ్చిన ట్రైన్ వెళ్లిపోయింది. అసలే చలికాలం, ఇంకా సూర్యుడు కూడా వచ్చినట్టు లేదు, వాతావరణం చాలా బాగుంది, ప్లాట్ఫారం అంతా కాలీగా ఉంది, బహుశా చలి వల్ల కాబోలు, అసలు గడియారం లో ఈ టైం కి మనం మేలుకోవడమే చాలా అరుదు, అంతా పొగమంచు, విపరీతమైన చలి, నా ఆలోచనలు గుర్రం ఎక్కాయి….. ఇంత పెద్ద రైల్వే స్టేషన్ అయినా నిశ్శబ్దంగా ఉంది, కాశ్మీర్ లో అలికిడైతే కన్యాకుమారి లో వినిపించేంత నిశ్శబ్దం, కానీ ఈ నిశ్శబ్దం చాలా బాగుంది, ఏకాంతం లో ప్రేమికుల మధ్య వచ్చే నిశ్శబ్దం లా, భార్య కాన్పు లో ఉంటే భర్త పడే ఆరాటం లోని నిశ్శబ్దంలా…...శంఖారావం లాంటి రైల్ కూత నా ఆలోచనలకి బ్రేక్ వేసింది, పొగమంచు చీల్చుకుంటూ ట్రైన్ వస్తోంది, అందులోనే నా ఫ్రెండ్స్ వున్నారు. ట్రైన్ వచ్చి ఆగింది, జనాలు అందరూ ఎక్కుతూ దిగుతూ సందడి గా ఉంది ప్లాట్ఫారం అంతా, "ఈ సందడి అంటే నాకు ఇష్టం, ఈ సందడి లో చాలా మంది మనుషులుంటారు, అందరూ ఏదొక ప్రయాణం చేసే వాళ్లే, మంచికి, చెడుకి, పెళ్లికి, చావుకి, ఇంటర్వ్యూలకి, ఇలా మాలా ట్రిప్పు లకి, ఇలా రకరకాల ప్రయాణాలు. జీవిత ప్రయాణం అనే బుక్ లో ప్రతి పేజీ లో ఏదో ఒక రకమైన ప్రయాణం ఉంటుంది, ప్రతి ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఆరంభం భయం గా ఉంటుంది, ముగమింపు బాధ గా ఉంటుంది, ఇది తెలిసి కూడా మనం కొన్ని ప్రయాణాల ముగింపు నచ్చక జీవిత ప్రయాణాన్ని ఆపేసుకుంటాం, జీవితాన్ని పారేసుకుంటాం"……. నా ఫ్రెండ్స్ ట్రైన్ దిగారు, అందరిని కలిసి చాలా కాలమే అయింది, అయినా అందరం కలవగానే ఎవరి కాళ్ళు నేల మీద నిలబడ్డం లేదు, తెలీకుండానే అందరం నవ్వుల గాల్లో తెలిపోతున్నాం. బెంగళూర్ మహా నగరం లో క్యాబ్లు పట్టుకొని మిగిలిన ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్లడానికి తల ప్రాణం తోక్కొచ్చింది, ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్లి అందరం ఫ్రెష్ అయ్యాం, టిఫిన్లు కూడా అయ్యాయి, ఇంకా బయలుదేరడానికి అందరం రెడీ గా ఉన్నాం, మా రథసారథి కోసం మా రథం కోసం వెయిటింగ్, ఎన్నో ప్రయాసలు పడి అడ్రస్ కనుక్కొని వచ్చాడు మా టెంపో డ్రైవర్, అందరం టెంపో ఎక్కాం….. ఒకప్పుడు ఏదన్నా పని మొదలెట్టె ముందు దేవుడి కి దణ్ణం పెట్టె వాళ్ళం ఇప్పుడు సెల్ఫీ దిగుతున్నాం, మేము కూడా సెల్ఫీ దిగి ప్రయాణం మొదలెట్టాం…..వెడల్పైన రహదారులు…..వేగం గా పరిగెత్తే వాహనాలు….మధ్యలో మా అల్లరి....మేము ఆకలిని మర్చిపోయాం, వయస్సును మర్చిపోయాం, లోకాన్ని మర్చిపోయాం, ఆడి ఆడి అలిసిపోయాం… వందల కిలోమీటర్ల దూరం మీటర్లకి తగ్గింది, ఘంటల ప్రయాణం నిమిషాలకి తగ్గింది…. కూర్గ్ వచ్చేసింది, టెంపో దిగేసరికి చీకటి పడింది, హోటల్ లో దిగి, తిని, అందరం నిద్రలోకి జారుకున్నాం…..
*********** 3. లాహిరి లాహిరి లాహిరిలో Day:2 Time:6:45AM Location:Madikeri Streets మరుసటి రోజు తెల్లవారుజామున మా ప్రయాణం మొదలెట్టాం….మండలపట్టికి, అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు, ఎవరా వీళ్ళు నాకన్నా ముందే ప్రపంచం మీద పడ్డారు అని మమ్మల్ని చూస్తున్నాడు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కదా ఎర్ర గా ఉన్నాడు, అమ్మ నుదుటి మీద బొట్టులా.. దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, ఎన్నో మలుపులు, దారికి ఒక పక్క ఆకాశానికి నిచ్చెన వేసినట్టున్న ఎత్తైన చెట్లు, ఇంకో పక్కన లోతైన లోయలు, మహా వృక్షాలు, వాటికి అల్లుకొని ఉన్న మొక్కలు, ఎగుడు దిగుడు దారులు, పెళ్లికూతురు తలలో పూలజడలా దట్టంగా పూలు పూసిన కొమ్మలు, క్రమశిక్షణ లేని మనుషులకి కర్మబద్దం అంటే ఇలా ఉండాలి అని చెప్పే కాఫీ ప్లాంటేషన్స్, అక్కడక్కడ కొండల మధ్యలొ జీవిస్తున్న స్థానికుల అందమైన ఇళ్లు, వీటన్నిటి మధ్య మా కేరింతలు…..మా అల్లరి చూసే దానికేనేమో సూర్యుడు మబ్బులు చాటు నుండి వచ్చిపోతున్నాడు, మా టెంపో సౌండ్ కి సమన్వయం గా పక్షులు కూస్తున్నాయి.. కంటికి కనిపిస్తున్న అందాలు, భయం కలిగించే దారులు, కడుపులో తిప్పే మలుపుల నడుమ మా రథం ఆగింది……. దిగక ముందు మేము కూడా ఊహించలేదు, ఈ ప్లేస్ ఇంత బాగుంటుంది అని, చుట్టూ ఉన్న పర్వతాలు, లోయలు అన్నీ అద్భుతం గా కనిపించే వాతావరణం, ఇక్కడ ప్రతి అణువు లో ఒక స్వచ్చత ఉంది, అమ్మ ప్రేమ లో స్వచ్చత లా, పదహారేళ్ల అమ్మాయి మనసు లో స్వచ్ఛత లా, వర్షం ముందు మట్టి వాసనలో స్వచ్చత లా, పసి బిడ్డ నవ్వు లో స్వచ్చత లా, అనుకున్నది సాదించినప్పుడు మన కళ్ళలో కనిపించే స్వచ్చత లా…..ఇక్కడ గాలి లో ఏదో సంగీతం ఉంది, అది మనకి ఏదో చెప్పాలనుకుంటుంది, వినే హృదయమే ఉండాలి గాని ఈ ప్రపంచం లో అమ్మ, ప్రకృతి ఎన్నో మంచి విషయాలు చెబుతారు, ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందరం సరదా ఆటలు ఆడాం, సెల్ ఫోన్లో ఛార్జింగ్లు అయిపోయేదాక తమాషా ఫోటోలు చాలా దిగాం, తిరిగి అందరం మళ్ళీ టెంపో ఎక్కాం, టెంపో స్టార్ట్ అయింది , దూరంగా కనిపిస్తున్నా కొండలు వాటి మధ్యలో ప్రవహిస్తున్న పిల్ల కాలువలు, గుంపులుగా ఎగిరే పక్షులు, ఆకుల మీద ఉన్న మంచు పైన సూర్య రస్మి పడి అవి మెరుస్తుంటే గొప్ప గొప్ప కవులు వర్ణించిన భూతలస్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది…. టెంపో వేగం పెరిగింది...నెక్స్ట్ ఆగబోయేది దుబారా ఫారెస్ట్ లో…..
దుబారా ఫారెస్ట్, అందులో ప్రవహించే కావేరి నది….టెంపో ఆగింది, కావేరి నది లో లాహిరి లాహిరి లాహిరిలో చేద్దాం అని డిసైడ్ అయ్యాం, బోట్ బుక్ చేశాం, బోట్ వచ్చింది, లైఫ్ జాకెట్స్ వేసి అందరిని బోట్ ఎక్కించి తెడ్లు చేతికిచ్చారు. ఇదో కొత్త అనుభూతి, ప్రవహించే నది లో పడవ ప్రయాణం, అదీ మనమే నడపాలి, సహాయకుడు ఉంటాడు అనుకోండి కానీ బలే అనుభూతి……. నీరు పంచభూతలలో ఒకటి, నదీ స్నానం వల్ల పాపాలు పోతాయి అంటారు, ఈ పడవ ప్రయాణంలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే పాపాలు అంటే వేర్ ఏవేవో కాదు, మనలో ఉన్న నెగటివ్ థాట్స్ ఏ, కాబట్టి ఈ నదీ ప్రయాణం వల్ల ఆ నెగటివ్ ఆలోచనలు మాత్రం కచ్చితంగా పోతాయి అనిపిస్తుంది. నీటి వేగం మా సందడి ముందు చిన్నబోతోంది. నది మీదగా వచ్చే గాలి మన ఊపిరితిత్తులలో ఉన్న నరాలను గిటార్ తీగలా చేసి మీటుతుంటే శరీరం లో ఒక రకమైన సంగీతం పుడుతుంది, మన వంటి మీద పడే నీటి తుంపరలు మన శరీరాన్ని మాత్రమే కాదు మన మనసుని కూడా శుభ్రం చేస్తాయి అనిపిస్తుంది, అందరిలో ఇలానే రకరకాల ఆలోచనలు. అలా పాటలు పాడుకుంటూ, ఫోటోలు దిగుతూ, నీళ్లు చల్లుకుంటూ సరదాగా ఒడ్డు కి వచ్చేసాం. సేఫ్ గా ఒడ్డు కి వచ్చేసాం కదా ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఇంక మళ్ళీ ప్రయాణం మొదలెట్టాలి. టెంపో ఎక్కామ్, నిశ్శబ్దంగా వింటే నీటి ప్రవాహం అనేది ఒక అద్భుతమైన సంగీతంలా ఉంటుంది, కర్నాటిక్, హిందూస్థాని సంగీతం అంతా ఇక్కడే వినిపిస్తుంది, శ్రద్ధగా గమనిస్తే ప్రకృతికి మించిన సంగీత దర్శకుడు ఉండడు, దేవుడికి మించిన సినీ దర్శకుడు ఉండడు. అలా ఆ నిశ్శబ్ద సంగీతాన్ని ఆనందిస్తూ చిక్మాంగళూర్ బయలుదేరాం…..ఎక్కడో దారి మర్చిపోయినట్టున్నాడు మా రథసారథి, అదే మా టెంపో డ్రైవర్, సాయంత్రం కల్లా వెళ్లిపోతాం అనుకుంటే రాత్రికి ఎప్పుడో తీసుకొచ్చాడు… హోటల్ లో రూమ్స్ తీసుకొని, రోజంతా ప్రయానిస్తూనే ఉన్నాం గా ఒళ్ళుతెలీకుండా పడుకొని నిద్రపోయాం….
************* 4.జలకాలాటలలో Day:3 Time:12:45 PM Location:kemmangundi ghat roads ఈరోజు సూర్యుడే మాకన్నా ముందు బయలుదేరాడు, మేము కూడా ఆయన వెనకాలే స్టార్ అయ్యాం, ఈసారి మా ప్రయాణం హెబ్బా ఫాల్స్ కి, నిన్నటి లాగానే మళ్ళీ మలుపులు, లోయలు, కొండలు…. దారిలో రోడ్డు పక్కన కొద్దిసేపు ఆగాము, పెద్ద చింత చెట్టు ఉంటే అందరం దాని కిందకి చేరాం, చింతకాయలని కొడుతున్నాం, ఎప్పుడో నాకు ఏడు ఏళ్ల వయసు ఉన్నపుడు కొట్టడమే చింతకాయలని, మళ్ళీ పాతికేళ్ళ వచ్చాక కుదిరింది, దారిలో వెళ్లే వాళ్ళు ఎవరీ వానరసమూహం అంతా చింతచెట్టు కింద చేరారు అని మమ్మల్ని చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు, మేము కొద్దిసేపు అలానే అక్కడ ఆడుకోని మళ్ళీ టెంపో ఎక్కి ప్రయాణం మొదలెట్టాం……. హెబ్బా ఫాల్స్ చేరుకునేదానికి ఎన్నో ప్రయాసలు పడ్డాం, కొండలు, గుట్టలు, పచ్చని పచ్చిక మైదానాలు, అడవులు అన్నీ దాటుకుంటూ, వెహికల్స్ వెళ్లగలిగే వరకు వెళ్ళాం, అక్కడనుండి కాళ్లకి పని చెప్పాం. దట్టమైన అడవి, మధ్యలో నడక, చల్లటి గాలి, కమ్మటి వాసన, దగ్గరలోనే ఉన్న జలపాతం నుండి వస్తున్న నీటి శబ్దం, ఇన్ని అద్భుతాలని ఒదిలేసి అద్దాల మేడలో ఆర్టిఫిషల్ గాలి మధ్య ఆనందాన్ని వెతుక్కుంటాడు ఏంటీ మనిషి, అయినా మనిషి మనస్తత్వమే అంత, నిండుగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ లో సీట్ కోసం వెతుకుతాడు, కాలీగా ఉన్న ట్రైన్ లో వచ్చి డోర్ దగ్గర నిలబడుతాడు, మనం ప్రేమించేది మనకు దొరకదు అని తెలిసినా ఆరాటపడతాడు, తరువాత బాధపడుతాడు, కదలలేని దేవుడి హుండీలో వేల రూపాయలు వేస్తాడు, మన ముందు కదిలే మనిషి బోచ్చలో ఒక రూపాయి వేయడానికి వంద సార్లు ఆలోచిస్తాడు, ఎన్నో ఆలోచించి సాయం చేస్తాడు, అసలు ఏమి ఆలోచించకుండా సాయం అడుగుతాడు, అమ్మ చేతి ముద్దని కూడా రుచితో తూకం వేసే ఈ మనిషి తర్కం గురించి ఏమి చెప్పగలం….. సుగ్రీవుడు కి వాలీ కి యుద్ధం జరుగుతుంటే చెట్టు చాటు నుండి రాముడు బాణం వేసినట్టు, ఇక్కడ చెట్ల చాటు నుండి వస్తున్న గాలి బాణాలు నాకు మనిషి తర్కం గురించి గుర్తు చేస్తున్నాయి…... అలా అడవి లో నడుచుకుంటూ పోతుంటే జలపాతం దగ్గరకు వచ్చేసాం అని గుర్తుచేస్తూ నీటి ప్రవాహం కనిపించింది, మమ్మల్ని పలకరించింది…...ఇటు పక్క అటు పక్క కొండలు, మధ్యలో వయ్యారంగా, వేగంగా దూకే జలధారా, కళ్ళకి ఆనందంగా ఉంటుంది ఇలాంటివి చూస్తుంటే. అలా కొద్దిసేపు చూసి దూరం నుండే ఫోటోలు తీసుకున్నాం…... సాహసం చేయరా డింబకా, ధైర్యం చేసి దగ్గరకు వెళదాం అని డిసైడ్ అయ్యాం, అందరం ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకొని నునుపు రాళ్ల మీద మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం, అందరం నీళ్లలో పూర్తిగా తడిచిపోయాం, అందరం ఒకరి సహాయం తో ఒకళ్ళం అక్కడే నీళ్లలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ల మీద కూర్చున్నాము, అందరం ఒకే శృతిలో అరుస్తున్నాం, మా కేకలు ఎలా ఉన్నాయి అంటే మేము జలపాతానికే సవాలు చేస్తున్నాము, నీ కన్నా మేము ఎక్కువ శబ్దం చేయగలమ్ అని, మా కేకలు, జలపాతం సవ్వడి కలిసి ఆ కొండల్లో ప్రతిధ్వని గా మారి ఒక చక్కటి స్వరంగా వినిపిస్తోంది, మేము అందరం గుండెలోతులొంచి అరుస్తున్నాం, బాగా అరిచి అలిసిపోయాం. నీళ్లలోకి అయితే ధైర్యం గా వచ్చేసాం కానీ ఇపుడు జాగ్రత్త గా బయట పడాలి, మళ్ళీ ఒకొక్కోరం సాయం చేసుకుంటూ మెల్లగా అందరం బయటకి వచ్చేసాం, ఇక్కడ ఇంత నున్నటి రాళ్లు, లోతైన నీళ్లు ఉన్న ధైర్యం గా మేము లోపలకి వెళ్లి బయటకి వచ్చాము అంటే దానికి కారణం మా స్నేహితుల మీద మాకున్న నమ్మకం, వాళ్ళ చేయి పట్టుకొని ఎక్కడ అడుగేస్తున్నామో కూడా పట్ట్టించుకోకుండా నీటి మీద నడిచాం అంటే అదే స్నేహం మనిషి లో పుట్టించే ధైర్యం, వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను, ఇక్కడ ఎవరూ స్వయంసౌకర్యం చూసుకోవడం లేదు, ఎప్పుడూ మిగిలిన వాళ్ళ సౌకర్యం గురించే ఆలోచన, అందుకే a good book is like a good friend అన్నారు కానీ good mother, good brother అనలేదు కదా, ఏ మనిషి జీవితం లోనైనా అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు తో పాటు ఒక మంచి మిత్రుడు ఉండాలి, అందరూ ఉంది స్నేహితడు లేని జీవితం ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది, దేవుడైన శ్రీకృష్ణుడుకే కుచేలుడు అనే స్నేహితుడు ఉన్నాడు, మనకి ఉండకపోతే ఎలా!! జీవితం లో నిజం గా మనమేంటో మన ఇంట్లో వాళ్ళకన్నా మన నిజమైన స్నేహితుడికి తెలుస్తుంది, నిజమైన స్నేహితుడు మన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న అద్దం లాంటివాడు, మనలోని అసలైన, నిజమైన రంగులు అన్నీ చూస్తాడు కదా.. రక్తంతో, వర్ణంతో సంబంధం లేని బంధం ఏదైనా ఉంది అంటే అందులో స్నేహబంధం ముందు ఉంటుంది, అందుకే మనతో రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా మనతో కొన్ని సందర్భాల్లో " నన్ను ఒక మంచి ఫ్రెండ్ అనుకో" అనే ఊత్తపదం వాడుతారు, ఇలా ఆలోచనతో అలసట తో అలానే కెమెమనగుంది కొండ పైకి వెళ్లి మళ్ళీ అక్కడ రకరకాల ఫొటోలు దిగి మళ్ళీ టెంపో ఎక్కాం, అందరం బాగా అలిసిపోయాం, ఈ అలుపు కేవలం తిరగడం వల్ల వచ్చింది మాత్రమే కాదు, రేపే ట్రిప్ ఆఖరి రోజు అనే ఆలోచన వల్ల కూడా. సూర్యుడు అస్తమిస్తున్నాడు, బాగా ఎర్రగా ఉన్నాడు, మనం ప్రేమించిన వాళ్లు మనల్ని వొదిలేల్లీపోతే మన కళ్ళలో వచ్చే ఎరుపులా…….తిరిగి మళ్ళీ హోటల్ కి ప్రయాణం అయ్యాం…..
*************** 5.మేఘాలే తాకింది Last Day…. Time:9:03AM. location: mulyangiri ghat roads హోటల్లో ఉన్న లగ్గేజ్ మొత్తం సర్దుకొని టెంపోలో బయలుదేరి ఇప్పటికే గంట పైనే అయింది, ఇప్పటికి సీతాలయణగిరి చేరుకున్నాము, ఇక్కడ నుండి మా టెంపో లో వెళ్లలేం, ఇక్కడే వేరే చిన్న జీపులు ఉంటే అవి బుక్ చేసుకొని బయలుదేరాం…... అర కిలోమీటర్ ప్రయాణం తరువాత అంతా పొగమంచు, దారే కనబడ్డం లేదు, ఈ దృశ్యం ఒక పక్క ఆహ్లాదం, మరో పక్క భయం కలిగిస్తుంది, పక్కన లోయ ఉందో, కొండ ఉందో కూడా తెలియడం లేదు, అంతా పొగమంచు మాత్రమే, తీక్షణం గా గమినిస్తే అర్థం అవుతుంది ఇది పొగమంచు కాదు అని, ఆకాశంలో మేఘాలు అని, అంత ఎత్తుకు వచ్చేసాం అన్నమాట. ఏదో సినిమా లో హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నట్టు, విష్ణుమూర్తి ఉండే పాలసముద్రంలోకి వెళ్తున్నట్టు ఉంది, భయంగానే వెళ్తున్నాం, జీప్ ఆగింది, ఎం కనపడంలేదు, అంత పొగమంచులో ఆకాశానికి నిచ్చెన వేసినట్టు, స్వర్గాన్ని స్టైరకేస్ వేసినట్టు, మెట్లు ఉన్నాయి, ఎక్కుతున్నాం, హటాత్తుగా వేగమైన గాలి, కళ్ళకి అడ్డుగా ఉన్న మేఘాలు ఒకసారి పక్కకి జరిగి ముల్లుయాంగిరి పర్వతం కనిపించింది, మబ్బుల చాటున దాగివున్న శివలింగం లా. నా పొలికకి తగ్గట్టే కొండ పైన శివాలియం ఉంది, జీవితంలో మౌంట్ కైలాష్ చూస్తామో లేదో తెలీదు కానీ ఇది చూస్తే అది చూసిన ఫీలింగ్ వచ్చింది, మెల్లగా ఒక్కొమెట్టు ఎక్కుతూ, వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పైకి వెళ్తున్నాం, ఏదో తెలియని మనఃశాంతి, అందుకేనేమో మునులు, ఋషులు, దేవుడులు ఎప్పుడు ఎతైనా కొండల మీదే ఉంటారు. ఈ కొండలలో ఒక గొప్ప విషయం ఉంటుంది, కొండపైన ఉంటే మనఃశాంతి, కాలుజారి పడ్డాం అంటే జీవితాంతం శాంతి. ఎట్టకేలకు ముళ్లయాంగిరి ఎక్కేసామ్, కొండ పైన గుడి లో శివుడి ని చూస్తే ప్రశాంతం గా అనిపించింది. కొండపై నుండి చూస్తే, పైన నిర్మలమైన అంబరం, చుట్టూ దట్టమైన మేఘాలు, మన కాళ్ల కింద ఈ ప్రపంచం, వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు, అనుభవిస్తున్న అనుభూతి తప్ప. మేఘాల్లో తెలిపోతున్నాం అని అందరూ అంటుంటారే, అంటే ఇదేనేమో, అందరికీ మనసులో ఏదో ఒక పాట వినిపిస్తుంది "మేఘాలలో తెలిపోమన్నది","మేఘాలే తాకింది హై హైలెస", నాకు మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు వినని పాట వినిపిస్తోంది, ఏం పాటో తెలియదు కాని ఆ ఫీలింగ్ బాగుంది. అందరం మళ్ళీ ఫోన్లు బయటకి తీసాం, ఈ అందాన్ని ఫోన్లో బంద్దిదాం అని. మెల్లగా కొండదిగి టెంపో ఎక్కాం, బెంగళూర్ కి తిరుగు ప్రయాణం మొదలపెట్టాం…...టెంపో ఘాట్ రోడ్ దిగేసరికి అందరూ కునుకు తీసారు ఒక నేను తప్ప, ఘాట్ రోడ్ దిగేసామ్, హైవే ఎక్కాం కదా టెంపో చాలా వేగం గా వెళ్తోంది, రోడ్డు పక్కన ఒక పిల్లాడు పక్కన ఉన్న చెరువు లో రాళ్లు విసురుతున్నాడు, రాళ్లు పడి నీటి లో అలతరంగాలు మొదలయ్యాయి, నాలో ఆలోచనల తొంతరలు మొదలయ్యాయి. ఈసారి ఇవి బాధపెట్టేవి కావు, బాధపెట్టే జ్ఞాపకాలు ఐతే వాటంతట అవే గుర్తుకువస్థాయి, కానీ మనకి ఆనందాన్ని ఇచ్చే జ్ఞాపకాలను మాత్రం మననే గుర్తుచేసుకోవాలి. అందుకే ట్రిప్ మొదలైన దగ్గర నుండి అన్ని గుర్తు చేసుకుంటున్నాను, టెంపోలో మేము ఆడిన అంత్యాక్షరిలు, కలిసి తిన్న భోజనాలు, కలిసి చేసిన పడవ ప్రయాణం, కలిసి చెప్పుకున్న కబుర్లు, దిగిన సెల్ఫీలు, హోటల్ రూమ్ లో గుర్తుగా చేసుకున్న కేక్ కట్టింగ్లు, అందరినీ ఆటపట్టిస్తు చేసిన అల్లరి, మలుపుల వల్ల ఎవరైనా కడుపులో తిప్పుతుంది అంటే మిగిలిన వారు పడిన కంగారు, ముల్లుయాంగిరి పర్వతం పైన పలకరించిన మేఘాలు, పడవ ప్రయాణంలో పరిచయమైన కావేరి నది, ఈ పచ్చని పల్లకిలో ప్రయాణం నాకు గుర్తుచేసిన పాఠాలు అన్నీ కళ్ళ ముందు కదిలాయి ఒకసారి, టెంపో వేగంగా వెళుతుంది, వెనక్కి తిరిగి చూస్తే అందరూ మంచి నిద్రలో ఉన్నారు, నేను అలా రహదారుల సూన్యాని చూస్తూ ఉండిపోయాను.
**************** 6. టాటా-బైబై(ముగింపు) Time: చూడాలని లేదు Location:Bangalore railway station వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది, బెంగళూర్ రైల్వేస్టేషన్ దగ్గరకు వచ్చి ఆగింది టెంపో, టెంపో దిగాం. లగ్గేజ్ దించుకున్నాం, కానీ ట్రిప్ తాలూకు అనుభూతి, మైకం ఇంకా దిగలేదు, అందరి గుండెలు బరువెక్కి ఉన్నాయి, ట్రిప్ తాలూకు మర్చిపోలేని జ్ఞాపకాలతో, ట్రిప్ అయిపోయింది అనే బాధతో. అందరి మొఖాలో తృప్తితో కూడిన నీరసం ఉంది, అది ఏదో గొప్పది సాదించినప్పుడు లేదా గొప్పది కోల్పోయినవుడు వచ్చే నీరసం, అందుకే నీరసంగా ఉన్నా అందరి మొఖాలో వెలుగు అలానే ఉంది, అది గుండెలోతుల్లోంచి వస్తుంది. మంచి అనుభూతులు కలయికే ఆ వెలుగు, గొప్ప జ్ఞాపకాల కూడికే ఆ వెలుగు. ఆ వెలుగు రేపటి యంత్రిక జీవితానికి చాలా శక్తినిస్తుంది. ఇంక అందరం జై హింద్ చెప్పేసి ఎవరి ట్రైన్ వాళ్ళు పట్టుకోవాలి…...అందరికి బై చెప్పి నా ట్రైన్ కోసం బయలుదేరాను. వీడ్కోలు, జీవితంలో చాలా సందర్భాల్లో మనుషులతో వారి భావోద్వేగాలతో ఆడుకుంటుంది. మా అమ్మ చిన్నపుడు చెప్పింది, డబ్బు శాశ్వతం కాదు రా మనుషులే శాశ్వతం అని, అది గుర్తుపెట్టుకొని నేను నా 10th, ఇంటర్, బి.టెక్ ఏ ఫేరెవల్ అప్పుడు బాధపడలేదు, చాలా ఇష్టమైన మనుషుల్ని వదిలి దూరంగా వెళ్లేటప్పుడు కూడా భాదపడలేదు, మనుషులు శాశ్వతం కదా ఎక్కడికి పోతారు అందరూ అని, కానీ కాలం గడిచే కొద్దీ నాకు అర్థం అయింది, మనుషులు కూడా శాశ్వతం కాదు, కేవలం వాళ్ళు మనకి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం, అవి మంచివైనా చెడ్డవైనా అవే శాశ్వతం...మధురం…... ఇలా ఆలోచిస్తుండగా నా ట్రైన్ వచ్చింది ఎక్కి బెర్త్లో పడుకున్నాను, ఈ ట్రిప్ కి రాకముందు నా జీవితంలో ఒక వెలితి ఉండేది, అది ఇప్పుడు పోయింది అని అనను, కానీ ఈ ట్రిప్ నాకు ఒక పోసిటివ్ ఎనర్జీ ఇచ్చింది, ఈ పోసిటివ్ ఎనర్జీ తో ఏదో సాధించేస్తా, పొడిచేస్తా అని అనను కానీ, బ్రతుకుతాను, జీవితం మీద ఆశ పోగొట్టుకోకుండా, కోరుకున్నవనన్నీ ఏదో ఒక రోజు నా దగ్గరకి వస్తాయి అనే నమ్మకం తో బ్రతుకుతాను, జీవితం అనే బండి ముందుకు నడవాలంటే కావలసిన ఇంధనం మంచి జ్ఞాపకాలు, అవి ఈ ట్రిప్ నాకు చాలానే ఇచ్చింది, జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే గొప్ప మోరల్స్ అవసరం లేదు చిన్న మోటివేషన్ చాలు, ఈ జ్ఞాపకాలు ఆ మోటివేషన్ తప్పకుండా నాకు ఇస్తాయి అని నమ్ముతున్నాను, అలా ఆలోచిస్తూ నిద్రపోయాను, "మళ్ళీ అదే స్వేచ్చగా ఎగిరే పావురం, ఆ పావురం వెనక పరిగెడుతున్న నేను, ఈసారి కూడా దారిలో ఒక అందమైన అమ్మాయి నా చేయి పట్టుకుని ఆపింది, అయితే ఈసారి నేను ఆగలేదు, ఆ అమ్మాయిని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను, ఆ అమ్మాయి కూడా నాతో పరిగెత్తుతుంది, పావురానికి నాకు మధ్య దూరం తగ్గిపోతోంది, నా వేగాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి నా చేయి వదిలేసింది, నాకు పావురం దొరికింది, ఆ పావురం తన రేకలతో నా చెయ్యి పట్టుకొని అలా చందమామ మీదకు తీసుకుపోయింది".................