Contributed by Sarveswar Reddy Bandi
డియర్ గురుజీ..!
పూజలు చేస్తే భక్తుడు కావొచ్చు, మరి ఏం చేస్తే దేవుడవుతారనే పెద్ద ప్రశ్నకి 'సాయం' చేస్తే చాలనే సమాధానం చెప్తున్నాడు మీ టాక్సీ డ్రైవర్ సీతారామరాజు, ఇంత చెప్తున్నాడు కదా చిన్నప్పుడు బాగా చదివాడేమో అనుకుంటే అన్ని సబ్జెక్టుల్లో కలిపితే కూడా 90 మార్కులు రాలేదని వాళ్ళ తాతయ్య అంటుంటే విన్నా..
సారీ… తిడుతుంటే విన్నా..
హైదరాబాద్ లో హత్యలు చేసుకునే మీ నందగోపాల్ పల్లెటూరికొచ్చి పార్థు అని పేరు మార్చుకుని, ఎవరో తాతయ్య పొలంలో కంచె వేస్తే తీసేసి.. చెల్లి పెళ్లికి చెక్కు రాసిచ్చి..ఆఖరికి పూరికి సారీ కూడా చెప్పాడంటా..!! అహ..ఊర్లో అంటుంటే విన్నా..
అమ్మ, నాన్న ఒకేరోజు పోయిన కోపంతో అడవికెళ్ళి తుపాకీ పట్టుకున్న మీ సంజయ్ సాహు.. ధర్మయుద్ధం పేరుతో అమాయకులను చంపడం తప్పని ఇంటికొచ్చి, ఆఖరికి తనని చంపాలని చూసిన దామోదర్ రెడ్డిని వాడి ఖర్మేకే వదిలేసి పెళ్లి చేసుకున్నాడంట..ఆయన భార్య భాగి అక్క మనకి బాగా క్లోజ్ లే..
ఇక మీ నంద..! అత్త అలిగిపోతే ఆస్తి మిగిలిపోతుందని ఆలోచించకుండా తన ప్రైవేట్ ఫ్లైట్ లో వచ్చి, ఫైవ్ స్టార్ హోటల్లో దిగి, కార్ డ్రైవర్ గా వెళ్లి మరీ కన్వెన్స్ చేసి తీసుకెళ్ళాడంట..వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన వాచ్ తో సెట్టయిన బ్యాచ్ లో నేనొక్కడినిలే..
నాన్న అప్పుల కోసం ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టాడని మీ ఆనంద్ ని ఇప్పటికీ ఆ పైడా సాంబశివరావు 'మూడు వందల కోట్లు సంపాదిస్తే గాడ్ అనాలి, పోగొట్టుకుంటే ఓ మై గాడ్ అనాలని' ఆటపట్టిస్తుంటాడు గానీ, మీ ఆనంద్ నిజాయితీకి గాడ్ అని మనసులో అనుకోకుండా ఉండాలేమండి..!
ఇలా చెప్తూ పోతే ఒకరా..ఇద్దరా..!
పేకాటలో ఓడిపోయిన ఆ సూపర్ మార్కెట్ ఓనర్ కొడుకు రిషి దగ్గర నుండి IPL బెట్టింగులో డబ్బులు పోగొట్టుకున్న రవి వరకూ..
వాల్మీకీని ఏడిపించే బంటు దగ్గర నుండి టార్చ్ బేరర్ రాఘవ రెడ్డి వరకూ అందరూ భీభత్సంగా నచ్చినవాళ్లే..అంతమంది పుట్టుకకి కారణమైన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండీ..
మదర్స్ డే రోజు అమ్మని ప్రేమించి, మిగిలిన రోజుల్లో కంచాల్లో అన్నం విసిరేసినట్లు..
నవంబర్ 7 మాత్రమే తలుచుకుని, మిగిలిన రోజుల్లో మర్చిపోతున్నామనుకోకు గురూజీ.. అయినా నీమాటలు తలుచుకోకుండా మేము మాట్లాడుకునే ఒకరోజు ఉండే ఛాన్స్ ఉందా..!!