Contributed By Sarveswar Reddy Bandi
అ నుండి అం అ: దాకా అందరికీ తెలిసిన తెలుగు పదాలే అయినా అతగాడు రాస్తే అదొక తెలియని ఆనందం తెలుగు వాళ్లకి..
ఒళ్ళో ఉన్నపుడు బామ్మ దగ్గర నుండి బల్లో ఉన్నపుడు టీచరమ్మ దాకా అందరూ చెప్పేది ఆ రామాయణ, భారతాలే అయినా తన సినిమాల్లో, స్పీచుల్లో వింటుంటే అదో తెలియని అనుభూతి..
తాను ఎంత నష్టపోయినా సరే, కనీసం క్లైమాక్స్ లో విలన్ ను చంపడానికి ఇష్టపడని హీరోలు..
మనకు బాగా తెలిసిన అమ్మాయిలాగా అందంగా, అమాయకంగా ఉండే హీరోయిన్లు
కేవలం నవ్వించడానికే రైటర్ మమ్మల్ని పుట్టించాడు అనేంత సరదాగా సందడి చేసే పాత్రలే తన కమెడియన్లు..
ఇలాంటి పాత్రలన్నీ కలిసి నాటకానికి దూరంగా, నిజానికి దగ్గరగా మూడు గంటల ఓ మినీ జీవితం అనే సినిమాలో మనకు కనిపిస్తే అదేదో పెద్ద కోర్సు పూర్తి చేసినట్లు, నూరేళ్ళ జీవితం బ్రతికేసినట్లు, కిళ్లీ కి చోటు లేనంత తినేసినట్లు ఒకరకమైన తృప్తి..
భీమవరం లో పుట్టిన ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అనే వ్యక్తి ఆంధ్రా యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ వచ్చేంతగా చదివి, ఫారిన్ వెళ్తాడు అనుకుంటే విచిత్రంగా కృష్ణానగర్ చేరుకున్నాడు. ఎంత బాగా ప్రయత్నించినా ఖర్మను దాటగలం కానీ కర్మను దాటలేం మరి..
1998 లో సినిమా ప్రయత్నాలు మొదలెట్టిన ఆయన అవకాశాలు అనే సీజన్ కంటే ముందు అవమానాలు అనే ఇంకో సీజన్ ఉంటుంది, అనుభవించక తప్పదు అని తెలుసుకున్నాడు..
బోలెడన్ని పుస్తకాలు చదివి అక్షర సంపాదనలో ఆయన అప్పటికే కోటీశ్వరుడు అయినా ఆకలి కష్టాలు పడక తప్పలేదు..
ఏదైతేనేం క్యాలెండర్ లో అందరికీ కొత్త శతాబ్దం 2000 సంవత్సరంతో మొదలైనా ఆయనకి మాత్రం 1999 తోనే మొదలయ్యి, సినీ పరిశ్రమ ఒక వరం ఇచ్చింది.. అదే స్వయం వరం..
ఆనాడు స్వయంవరంలో అప్పటి దాకా ఎవ్వరూ ఎత్తలేని శివధనస్సు ను ఎడమ చేత్తో ఎత్తి అవలీలగా విరిచి రాముడు ఆ క్షణం నుండి సీతారాముడిగా మారినట్లు 1999 లో స్వయంవరం అనే సినిమాతో మామూలు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ ఆ రోజు నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కొత్త శతాబ్దంలోకి వచ్చేశాడు..
2000 సంవత్సరంలో ఆయన రాసిన నువ్వే కావాలి అనే సినిమాకు అప్పటి వరకూ ఏ అనుభవం లేని హీరో తరుణ్ ని పెడితే కనీసం రిలీజ్ కు థియేటర్లు దొరకవు అని కొంతమంది అనుకున్నారు.. నిజమే దొరకలేదు, కానీ థియేటర్లు కాదు, థియేటర్ల వద్ద టిక్కెట్లు..అది ఏ ఒకటో రోజు, రెండో రోజు కాదు..50 నుండి వందకు పరుగులు తీస్తున్న రోజుల్లో..సినిమా మొత్తం మీద పెద్ద పెద్ద నటీ నటులు లేకపోయినా రాష్ట్రంలోని 21 సెంటర్లలో 200 రోజులు పైగా ప్రదర్శితమయ్యి 27 కోట్లు పైగా వసూళ్ళు రాబట్టిందంటే తన మాటలు జనాలకు ఎంత దగ్గరగా వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు..
ఆ సంవత్సరం నుండి మొదలు పెడితే నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే నువ్వే లాంటి సినిమాల కారణంగా ప్రతీ సంవత్సరం ఉత్తమ మాటల రచయిత అవార్డు ఈయన పేరు మీద ఒకటి తీసి పెట్టేవారు..
ఈయన సినిమాల్లో మాటలు కథకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉండేవి. పది రూపాయల టికెట్టుతో ఈయన సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూర్చున్న పది నిమిషాలకే గిట్టుబాటు చేసుకుని, మిగిలిన 2 గంటల 50 నిమిషాల బోనస్ ఎంజాయ్ చేసేవాళ్ళు..
ఏదో వినోదం కోసం సినిమా చూడటానికి వస్తే, శుభం కార్డు తర్వాత ప్రేక్షకులతో పాటు వారి ఆలోచనల రూపంలో త్రివిక్రమ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. దాదాపు కొన్ని రోజుల పాటు అలాగే ఉండేవాడు. సమస్య ఉన్న వాళ్లకి తానొక పుస్తకంలా పని చేస్తాడు.
ఎవరైనా సమస్యలో ఉంటే చావకుండా ఉండమని చెప్తే సలహా అవుతుంది.. బ్రతికే దారి చూపిస్తే సమాధానం అవుతుంది.. ఆయన మాటలు ఎప్పుడూ సలహాల లాగ ఉండవ్.. సమాధానం లాగే ఉంటాయి.. అది కూడా గర్భగుడిలో శివ లింగానికి ఎదురుగా కూర్చున్న నంది అంత సూటిగా ఉంటాయి..
సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడు ఆయన సినిమాలో పాత్రధారి కావాల్సిందే.. బాధ్యతలు లేకుండా తిరిగే పిల్లలని చంద్రమోహన్, తనికెళ్ళ భరణి లాంటి వాళ్ళతో అచ్చం మన తండ్రిలా తిట్టించేస్తాడు.. బంధాలు పట్టించుకోని మోడ్రన్ మనుషులకిి బన్నీ, పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో పనికట్టుకుని స్టార్ మా ఛానల్లో బుద్ది చెప్తాడు.. ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలి అనే సందేహానికి తరుణ్, నితిన్ దగ్గర నుండి నాగ్, వెంకీల వరకూ అందరితో సలహా ఇప్పిస్తాడు..
ఆయన మాటలు ఆలోచించకుండా వింటే పలకరిస్తాయి..! ఆడేటప్పుడు వింటే ప్రశ్నిస్తాయి..! ఓడిపోయాక వింటే పరామర్శిస్తాయి..! అలాంటి ఆ 5.8 అడుగుల కలం, కలకాలం రాస్తూ ఉండాలి , కలలు కనే ఎంతో మంది కలాల అడుగులకు మొదటి కారణం కావలి.