Suggestion: Gouse Pasha
జనరల్ గా మనం అభిమానించే హీరోల గురించి వారు సంవత్సరాల తరబడి సాగించిన ప్రయాణం గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కాని ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి ఓ అభిమాని. ఆయన అభిమానానికి కూడా ఓ చరిత్ర ఉంది, ఓ రికార్డ్ ఉంది. ఒక హీరోకు ఇలాంటి అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతాం ఆయన ప్రయాణం తెలుసుకుంటే. ఆయన అభిమానం దశాబ్ధాల క్రితం(1978) మొదలయ్యింది. తెలుగు సినీ ప్రపంచంలో చిరంజీవి గారు మొదటి సినిమా మనవూరి పాండవులతో ఎలా ఉదయించారో అదే సినిమా నుండే నూర్ మహమద్ భాయ్ అనే అభిమాని కూడా ఉదయించారు.
ఎవరీ నూర్ భాయ్..? నూర్ భాయ్ గారిది సికింద్రాబాద్. వారిది అతి సాధారణ మధ్యతరగతి కుటుంబం. ప్రస్తుతం సికింద్రాబాద్ మార్కెటో లో తమలపాకులు అమ్ముతూ ఓ చిన్న షాప్ నడిపిస్తున్నారు.
నిజమైన అభిమాని: చిన్నపాటి తమలపాకుల షాప్ నుండి వచ్చే ఆదాయంతో వారి కుటుంబాన్ని చూసుకుంటూనే సమజానికి ఉపయోగపడేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. చిరంజీవి గారి మొదటి సినిమా మనవూరి పాండవులు సినిమా దగ్గరి నుండి ఇది మొదలయ్యింది. తన అభిమానాన్ని థియేటర్ల దగ్గర బ్యానర్లు కడుతూ చూపిస్తూనే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదానం, పేదవారికి బట్టల పంపిణీ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు తన సొంత డబ్బుతోనే చేస్తున్నారు.
చిరంజీవి గారి నుండి తేజ్ వరకు: నూర్ భాయ్ గారు చిరంజీవి గారికి మాత్రమే కాదు మెగా ఫ్యామీలి అందరికి అభిమానే. ఇప్పటికి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా చేస్తారో సాయి ధరమ్ తేజ్ గారి పుట్టినరోజు వేడుకలూ అంతే ఘనంగా చేస్తారు, నూర్ భాయ్ గారి మీద గౌరవంతో ఆ వేడుకలకు మెగా హీరోలు కూడా తప్పకుండా వస్తారు.
సామూహిక వివాహాలు: 2007లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఏకంగా ఆరుగురి దంపతులకు వారి సాంప్రదాయాలకు అనుగూణంగా పెళ్ళిచేశారు. ఆ పెళ్ళిళ్ళకు గౌరవ అతిధిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.
మెగా గౌరవం: మరి ఇంతగా అభిమానం చూపిస్తున్నారుగా నూర్ గారిని హీరోలు ఎలా చూస్తారు అనే అనుమానం రావచ్చు. చిరంజీవి గారి దగ్గరి నుండి అల్లు శిరీష్ గారి వరకు ఆయనను ఎంతో గౌరవిస్తారు. వారి అనుబంధం ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. ఆ మధ్య ఆరోగ్యం బాగోలేనప్పుడు చిరంజీవి గారు వారి ఇంటికి వచ్చి పరామర్శించారు. కొన్నిరోజుల క్రితం అల్లు అరవింద్ గారు నూర్ భాయ్ గారితో మాట్లాడుతూ "మీరు మాకెంతో చేశారు ఇక ఏమైనా చేసేదుంటే మేమే మీకు చేయాలి" అని అన్నారట (ఇలాంటివి ఎన్నో సంఘటనలున్నాయి).
ఇంకా ఎంతో చేయాలి: అమ్మ, నాన్నల నుండి వారి భార్య పిల్లలు వరకు తనకు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. ఇన్ని సంవత్సరాలుగా తన శక్తికి మించి ఇంత సేవచేస్తున్నా గాని నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని భగవంతుడు నాకు సహకరిస్తే చాలా చేయాలని వినమ్రంగా అంటుంటారు.
బయటి ప్రపంచంలో ఏం చేస్తారో తెలియదు కాని ఎదో చిన్న చిన్న మాటలకు ఫాన్స్ గొడవలు పెట్టుకుంటారు, సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారి వల్లనే నిజమైన ఫాన్స్ కు ఇంకా ఆ హీరోలకు చెడ్డపేరు వస్తుంది. ఒక హీరో మీద ఎంత గొప్ప అభిమానం ఉంటుందో మనలో అంత గొప్ప శక్తి దాగి ఉంటుంది ఆ శక్తిని ఇలా సమజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకుంటూ సేవ చేస్తే అభిమానించే హీరోకు మాత్రమే కాదు సమజానికి కూడా ఎంతో ఉపయోగం. అలా నూర్ భాయ్ గారు తన అభిమానాన్ని సమజానికి ఉపయోగపడేలా చేస్తూ తను అభిమానించే హీరోలనే గర్వపడేలా చేస్తున్నారు.