This Guy Penned Down The Struggles Of Getting A Job With An Unexpected Twist At The End!

Updated on
This Guy Penned Down The Struggles Of Getting A Job With An Unexpected Twist At The End!

Contributed by Siddhartha Naidu

"ఉద్యోగం ఒచ్చింది "

మాట వినగానే ఆనందం తో పరిగెత్తుకు పోయా నా మిత్రుడిని కలవడానికి , వాడి జీవితం లో అది ఒక పెద్ద విషయమే.

"ఎలాగోలా బతకాలి అనుకుంటే ఎలాగైనా బతికెయ్యొచ్చు , కానీ నేను ఇలాగే బతకాలి అనుకున్నా కాబట్టే ఇలా ఉన్నా." అని ఆకలి రాజ్యం సినిమా లో కమల్ హస్సన్ చెప్పిన మాటలకి నిలువెత్తు సాక్ష్యం వాడు, నా మిత్రుడు.

కళ కోసం, కలం కోసం నా జీవితం అంటూ చదివిన చదువూ కూడా పక్కన పెట్టి రచయత అవుతానని , అక్షరాల్లో ఆనందం వెతుక్కుంటూ ఈ సమాజాం లో ఒక స్థానం కోసం ఇల్లు వదిలి ఈ ఊరికి ఒచ్చాడు.

"హెహ్ ఈరోజుల్లో తెలుగు ఎవడు చదువుతాడు రా ", అని అందరూ హేళన చేస్తుంటే ఏమాత్రం బెదరక పోరాడాడు, తెలుగులోనే తన తొలి అడుగు వేస్తానంటూ.

మరి అలాంటి వాడికి ఉద్యోగం వచ్చింది అంటే మాటలా ? నాలా సమాజాం తో సర్దుకుపోయే రకం కాదు. వాడు వేరే. అందుకే వాడితో ఉంటే నాకు ఏదోకటి చెయ్యాలని ఉంటుంది.

మొత్తానికి నా మిత్రుడు ఉద్యోగస్తుడయ్యాడు. అభినందిద్దామనే వెళ్తున్నా ఆనందం తో, వాడికి కోపమొచ్చిన బాధోచ్చినా , ఆనందమోచ్చినా, ఆవేదనొచ్చినా ఆ సముద్రం ఒడ్డున రాళ్ల మీద ఒంటరిగా కూర్చొని రాసుకుంటాడు. అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు కూడా వాడు రాసుకున్న కథలతో కాలక్షేపం చెయ్యడానికి. ఇప్పుడూ అక్కడే ఉన్నాడు.

కానీ నేను వెళ్లే పాటికి అక్కడ ఓ పదిమంది దాకా ఉన్నారు ఇవ్వాళ, నా మిత్రుడికి అభిమానుల వరుస మొదలయ్యింది అనుకుంటూ ఇంకా కధంతా సుఖాంతమే అని దగ్గరకు వెళ్ళా.

ఆ గుంపు ని తోసుకొని వెళ్ళా వాడిని హత్తుకోడానికి,

ఎదురుగా,

నోటిలో రక్తం కక్కుకుంటూ చేతిలో సిర కక్కుతున్న కలంతో పడి ఉన్నాడు .

కాదు పడి ఉంది , వాడి దేహం .

వాడి కధ వినడానికి వచ్చాను , ముగిసిన వాడి కధను చూడటానికి అనుకోలేదు. నేల మీద అలా మోకాళ్ళ మీద పడి వాడిని ముట్టుకోవడానికి ప్రయత్నించా ధైర్యం చాలట్లేదు , గొంతు దాటి మాట రాట్లేదు.

ఇంతలో " ఇతను మీకు తెలుసా ? " అని ఎవరో అంటే తలూపాను. చేతికి వాడి పుస్తకం ఇచ్చారు. ఆఖరి కాగితం లో ఓ లేఖ.

"ఉద్యోగం వచ్చింది , యమలోకం లో... అంటూ ... ఉద్యోగం ఒచ్చింది , నరకం లో ప్రస్తుతానికి నూనె లో వేయించబడే పని, నాకు కొత్త కాదు కాబట్టి బాగానే కాలుతా అని అనుకుంటున్నా. మెల్లగా యమదూతనైపోతా. మరి పైన ఉద్యోగం అంటే కింద ఉండటం కుదరదు అందుకే వెళ్తున్నా, నరకం లోనే ఉద్యోగం ఎందుకు ఒచ్చింది అంటే ఆ దేవుడు నేను సమాజాం తో సర్దుకుపోవాలి అని రాతరాసాడు దానికి నేను తలవంచలేదుగా, అందుకే.

నా రాత నేనే మార్చుకుంటా అంటూ నేను రాసిన రచనలని తీసుకొని ఈ ఊరికొచ్చాను.

ఆంగ్ల భాష అక్షరాలు రాక , అమ్మ భాష ఆప్యాయం వీడలేక నిత్యం నాలో నేను ప్రతిఘటించా

మానాన్ని అమ్ముకోలేక అభిమానాన్ని చంపుకోలేక నలుగుతూ బతికా

వీధికుక్క కూడా రోజూ తిండి తింటుంటే రోజుకొక్కపూటైనా పొట్ట నిండుద్ధో లేదో తెలీని బతుకు నాది.

ఆశయం చావక ఆకలి తీరక అస్త వ్యస్థ ఆవేదన లో కూడా అక్షరాలతోనే నా బతుకు ని బతికి సచ్చా

ఇంకా కొత్తగా ఏముంది నేను సావడానికి

అడుక్కోవడం కూడా చెత్తకాని చేతకాని చదువుకున్న వాడను నేను .

అందుకే నరకానికి బయలుదేరా భూమ్మీద అనుభవించిన దానితో ఈ సమాజాం నేర్పించిన సత్యాలతో అక్కడ తెచ్చుకున్నా ఒక ఉద్యోగం

నా ఈ కాలం ఇక్కడితో సమాప్తం. కలం కూడా తీసుకుపోతున్నా నాతోపాటు

వీలుదొరికితే అక్కడైనా రాసుకుందామని . ఉద్యోగమొచ్చింది మిత్రమా !." . .... ...

ఓ సిద్ధార్థుడి కలం కలంతో కాలం బాటసారి