వ్యవసాయం కొంతమంది రైతుల ప్రాణాలను తీస్తుంటే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఉషారాణి గారికి మాత్రం కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నిజానికి న్యాయంగా చేసే ఏ వృత్తి ఐనా మనకు నష్టాలు కలిగించవు సరైన పద్దతులు అనుసరించకుంటే అన్నిట్లోను అపజయాలే మనల్ని వెక్కిరిస్తాయి.
నెలకు 1500 ఉద్యోగం:
పెళ్లి జరిగి, పిల్లలు కలిగిన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోవడంతో ఉషారాణి గారికి తన జీవితం ప్రశ్నార్దకమయ్యింది. కేవలం పదవతరగతి మాత్రమే క్వాలిఫికేషన్, అర ఎకరం మాత్రమే ఉన్న పొలం. ఇటు ఆర్ధికంగా అటు చదువు పరంగా బలహీనంగా ఉండడంతో తను మరింత కృంగిపోయింది. "నీటిలో పడిపోవడం వల్ల కాదు, పడ్డచోటనే ఉండిపోతే మునిగిపోతాము" అని అన్నట్టుగా ఆ పరిస్థితుల నుండి ఉషా గారు కదిలారు. పరిసర ప్రాంతంలోని ఓ పోగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిలో చేరారు. 24 గంటలలో తన కుటుంబాన్ని, పిల్లలను చూసుకుంటూ 12 గంటలు కష్టపడితే నెలకు 1500 మాత్రమే జీతం అందుకునే వారు. ఇలా కాదని కొంత పెట్టుబడితో చీరలు కొని అమ్మడం మొదలుపెట్టారు ఇక్కడ కూడా ఉషా రాణిగారికి విపరీతమైన నష్టమే కలిగింది చీరల విషయంలో కాదు, చీరలను దొంగలు ఎత్తుకుపోవడం వల్ల.
పాలేకర్ వ్యవసాయం:
కష్టాలన్నీ ఒకేసారి రావడంతో ఉషా గారు ఉక్కిరి బిక్కిరి అవ్వలేదు దానిని దాటడానికి గల మార్గాన్ని అన్వేషించారు. చుట్టు ప్రక్కల గ్రామాలలోని ప్రజలు ఎక్కువ శాతం జీవామృతం ద్వారా వ్యవసాయం చేయడంతో సేంద్రియ ఎరువలను మార్కెటింగ్ చేస్తే మంచి లాభం ఉంటుందని భావించి అందుకు తగిన ప్రణాళికలు చేశారు. అలా తన చుట్టప్రక్కల ఉన్న 15 గ్రామాలు తిరుగుతూ, తెలియనివారికి సేంద్రియ ఎరువులపై పరిపూర్ణమైన అవగాహన కల్పించి అమ్మడం మొదలుపెట్టారు. ఉషా ఆశలకు ఆసరాగా, కష్టాల నుండి బయటకు లాగేందుకు ఈ కొత్త ఉద్యోగం ఎంతగానో ఉపయోగపడింది. ఇందులోనే మరింత రాణించాలని చెప్పి వ్యవసాయంలోనే అత్యున్నత పద్దతైన పాలేకర్ వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నారు.
సొంతంగా..
ఈ శిక్షణ తరగతుల వల్ల ఎంతోనేర్చుకున్న ఉషా గారు తనే సొంతంగా జీవామృతాన్ని తయారుచేయాలని భావించారు. ఐతే "నేను తయారుచేసేవి అత్యంత శక్తివంతమైన ఎరువులు" అని రైతులకు తెలియాలంటే వాటి ద్వారా లాభసాటి వ్యవసాయం జరగాలి. ఎవరినో ఎందుకు అడగాలి నేనే వ్యవసాయం మొదలుపెడతాను అని తనకున్న అర ఎకరం మరియు పుట్టింటి ద్వారా లభించిన 40 సెంట్ల పొలంలో మిరప, దొండ, మినుములు సాగుచేశారు. కట్ చేస్తే మాంచి సక్సెస్.
ఇలా ఉషా గారు సక్సెస్ సాధించడంతో తన మీద తనకు నమ్మకం పెరగడంతో పాటు రైతులు కూడా విశ్వసించడం మొదలుపెట్టారు. అలా ప్రభుత్వ సబ్సీడితో సొంత స్థలంలోనే సేంద్రియా ఎరువుల ఉత్పత్తి సంస్థను మొదలుపెట్టారు. పంచగవ్య, అగ్నాస్త్రం, నీమాస్త్రం, ఘన జీవామృతం మొదలైన ఎరువులను తయారుచేస్తూ, తక్కువ ధరలోనే అమ్ముతూ తాను సంతోషంగా జీవిస్తూ ఆర్గానిక్ వ్యవసాయానికి ఎంతగానో కృషిచేస్తున్నారు. ఎక్కడో మారుమూలు గ్రామంలో పుట్టిపెరిగి ఇంత ప్రగతిని సాధించిన ఉషా గారిని వేలు, లక్షల కిలోమీటర్ల నుండి ప్రశంసలు చేరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అధికారులతో పాటు కెన్యా కు చెందిన వ్యవసాయ ప్రతినిధులు, ఇతర విదేశీయులు సైతం పదవతరగతి చదివిన ఉషారాణి గారిని కలిసి వ్యవసాయానికి, ఎరువులకు సంబందించి ఎన్నో విషయాలను కొత్తగా తెలుసుకుంటున్నారు.