Contributed By Divya Vattikuti
ఉత్తరమా!ఎలా వున్నావు? ఉభయకుశలోపరి తో ప్రారంభించే నీ కుశలాన్నిగురించి ఎవరాలోచించటం లేదు. ఒకప్పుడు విభిన్నరూపల్లో పాఠకులను విస్మయానికి గురిచేసేదానివి.
ప్రేమలేఖవై పావురాళ్ళతో జట్టుకట్టి ఎంత ఎంత ఎడమైతే అంత తీపిమధురిమ అనిపించేదానివి. సంబంధబాంధవ్యాలను సంచులలో మోసుకెళ్లి జనానికి ప్రేమ సంకెళ్లేసి పిచ్చివాళ్ళను చేసేదానివి. నువురాని క్షణం నువులేని క్షణం కాలం కూడా ఆగి ఆగి కదిలేది తెలుసా!
సైకిల్ బెల్ మోగితే సమస్తాన్ని మరిచి వీధిగుమ్మం దాకా పరిగెత్తించేదానివి. నీరాకకోసం ఎన్నినిరీక్షణలో!
నీ రాక.....
కన్నెపిల్ల గుండెలో ఏరువాక, కన్నతల్లి మనసున ఆశా దీపిక.
నీ పిలుపు.....
సైనికుని కర్తవ్య మేలుకొలుపు, నిరుద్యోగి భవిష్యత్తుకు మలుపు.
నీ సేవలు.....
చేరిపెను మనుషుల మధ్య దూరములు, తీర్చును ధనముతో వేల ఇళ్ల అవసరములు.
నీ రాకకై చూసే ఎదురుచూపులు, ముందు అందుకోటానికి పడే ఆత్రం, సంతకము పెట్టినపుడు వచ్చే ఒకింత గర్వం, రాస్తునపుడు కలిగే ఆనందం, వర్ణించతగునా.....!!!
నేను వర్ణించగలనా....!!!
ఎక్కడకు పోయావు నువ్వు?
నీతో పాటు మా జ్ఞాపకాలను, చిన్న చిన్న సంతోషాలను ఎత్తుకుపోయావు....... మా కనులముందే అంచెలంచెలుగా మాయమైపోయావు.
ఇప్పుడు వచ్చిన యంత్రపు పెట్టెను తెరిస్తే ఆనందం కన్నా ముందు చిరాకు ఆవహిస్తోంది.. ..
ప్రేమల కన్నా ప్రకటనలే ఎక్కువున్నాయి...
సమాచారం ఐతే అందుతోంది కానీ...... నిన్ను అందుకున్నంత సంతోషం ఐతే లేదు...
ఎందుకు ఉంటుంది... నన్ను అది నీలా ప్రేమగా పిలవదే వచ్చినపుడు..
ఎవరు రాసేరా అనే ఆతృత ఉండదే దాన్ని చూసినపుడు... నా మది మీద తాకుతూ నిదురపోదే ఎప్పుడూ.. గది అరల్లో,మది పొరల్లో దాచలేను దానిని భద్రంగా...
నీవిప్పుడు ఏదిక్కుకు వెళ్ళి పోయావో గాని, నీ పత్తా మాకు కానరావడం లేదు
ఒకనాడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి నీవే మాకు పెద్ద దిక్కు.
ఉత్తరాలు బట్వాడా చేసే పోస్ట్ మాన్ రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్ళం.
అందమైన అక్షరాల దస్తూరీ తో అంతులేని సమాచారాన్ని మోసుకొచ్చే కారట్లు , లిఫాఫాలు
కరువుదీరా అందుకొనేవాళ్ళం. ఒకటికి పదిమార్లు చదువు కోని తృప్తిదీరా భద్రపరచుకొనేవాళ్ళం.
ఇప్పుడు ఎక్కడా నీముచ్చట వినబడడం లేదు, కనబడడం లేదు.
అస్సలు నీ సంగతులే తెల్వడం లేదు ఇప్పుడు మా చేతుల్లో చరవాణులు నాట్యమాడుతున్నాయి.
మెసేజ్ లు, వాట్సాప్ ల రూపంలో క్షణాల్లో సమాచారం బదిలీ చేస్తూనే ఉన్నాయి
మనం ఉత్తరాల నుండీ మైల్స్, వాట్సాప్ అంటూ పరుగులు పెట్టేం..
కానీ కాలం మన మనసులని, ఆలోచనలని సెకన్లలో దగ్గర చేస్తోంది తప్పా... ఉత్తరాలలా ప్రేమగా ఆనందిపచేయటం లేదు...
అప్డేట్ అయినా..ఆనాటి ఎదురుచూపుల తృప్తి మాత్రం లేదు.
నువ్వు ఎవరని నా తరువాతి తరం అడిగితే, మదిలోని భావాలకు అక్షర రూపమే నువ్వని చెప్తాను....
మాటలతో చెప్పలేని అనేక భావాలను
రాతలలో తెలిపేదే నువ్వని చెప్తా ...
దూరంగా ఉన్న వారికి
కుశల సమాచారమే నీవని చెప్తా ...
అలసిన మనసుకి ఊరటే నువ్వు ... భావవధ్వేగాలను తన పై లిఖించుకుని తనలో భద్రంగా పొందుపరుచుకొనే అక్షరాల సౌధమే నువ్వు ...
నువ్వు అంటే
ఓ జ్ఞాపకం...
ఓ భావం..
ఓ అనుబంధం..
ఓ అనుభవం...
ఓ సమాచార వారధి...
సుఖదుఃఖాలు పంచుకునే అనుభవాల పత్రం
నేడు కనుమరుగవుతున్న ఉత్తరం...
నిన్నుమళ్ళీ చూడాలనివుంది. నీరాకకోసం నిరీక్షించే ఆమధురక్షణాలు మళ్ళీరావేమో!
నిన్నుమించిన జనమానసవార్తాహరులు దూర్తహరులై ఈ ప్రపంచాన్ని ఆక్రమించేసాయిగా . ఒక్కసారి - ఇంకొక్కసారి వచ్చిపోవా ఉత్తరమా!
అవ్వాలి అనుకుంటాం కానీ చేజేతులారా ఎన్నో ఆనందాలను దూరం చేసుకుంటున్నాం.
నిన్ను పదిలంగా నామదిలో దాచుకుంటా!