ధనవంతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, అన్ని విధాలా అభివృద్ది చేయడం నిజానికి చాలా గొప్ప ముందడుగు. కాకపోతే ఇందులోనూ లోపం ఉంది. ఒక్కోసారి ఊరి ప్రజలు శ్రీమంతుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇలా ఎదురుచూడడంలోనే ఎదుటివారిని నిందించడమే కాక, విలువైన సమయం కూడా వృధా అయ్యి ఎన్నో జీవితాలలో మార్పులు సంభవించవు. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూడకుండా మన ఊరిని మనమే బాగుచేసుకుందామని వంశి వాసిరెడ్డి ఏకంగా తన కెరీర్ నే త్యాగం చేసి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక కుటుంబాన్ని అభివృద్ది చేయడానికి కొద్దిపాటి ప్రేమ, ఓపిక, శక్తి ఉంటే సరిపోతుంది అదే ఒక ఊరిని అభివృద్ధి చేయాలంటే ఎంత ప్రేమ, శక్తి, ఓపిక అవసరముంటుంది.? తన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మూడు ఆస్థులను సంపాదంచిన శ్రీమంతుడి కథ ఈరోజు.
పది సంవత్సరాల నుండి..
కృష్ణా జిల్లా పున్నవల్లి గ్రామానికి చెందిన వంశీది మధ్యతరగతి కుటుంబం. డిప్లొమా పూర్తిచేశాక కొద్దికాలం పాటు ఉద్యోగం కూడా చేశాడు. ఐతే చిన్నతన్నంలో తాను చూసిన స్కూల్ విషయంలో కాని, వైద్యం విషయంలో కాని మిగిలిన అన్ని పరిస్థితులు ఇప్పటికి గ్రామంలో ఉన్నాయి. ఈ పరిస్థితులు తన మనసుని తీవ్రంగా కలిచివేసింది.. "మా బతుకులు మార్చే మగాడే లేడా" అని ఎదురుచూడకుండా నిందించకుండా తానే పున్నవల్లి రూపు రేఖలను మార్చడానికి మొదటి అడుగు వేశాడు.
విద్యాలయం:
జీవితాలను మార్చే అద్భుత శక్తి విద్యకు ఉంది. సుమారు వందమంది ఉన్న పున్నవల్లిలోని ప్రభుత్వ పాఠశాలో సౌకర్యలు అద్వాన్న స్థాయిలో ఉండేవి. కొద్ది కాలం పాటు పాఠశాలకు టీచర్లు కూడా ఉండేవారు కాదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితులలో వంశి మరియు అతని బృందం స్కూలును పవిత్ర విద్యాలయంగా మార్చడానికి ముందుకొచ్చారు. బెంచీలు, లైబ్రెరీ, పిల్లలకు పుస్తకాలు, పరిశుభ్రమైన టాయిలెట్ సధుపాయం ఇలా విద్యార్ధులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలతో పాటుగా ఎనిమిదో తరగతి నుండి పదవతరగతి వరకు ఆ స్కూల్ లోనే పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పుట్లు చేశారు.
వైద్యం:
పున్నవల్లి అనే కాదు దేశంలోని ప్రతి గ్రామం కూడా వైద్యానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంది. పున్నవల్లి గ్రామస్థులు వైద్యం కోసం పరిసర ప్రాంతమైన నందిగామకు వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రసవం, పాముకాటు, గుండెపోటు లాంటి ప్రమాదకర పరిస్థితులలో ఇంతటి ప్రయాణం అత్యంత ప్రమాదకరం. వైద్యాన్ని గ్రామస్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక హెల్త్ చెక్ అప్ క్యాంప్ ఏర్పాటుచేయడం, గ్రామస్థులలో మూడనమ్మకాలను పారద్రోలేలా చర్యలు అలాగే త్వరలో ఓ అంబులెన్స్ ను కూడా ప్రత్యేకంగా ఊరికోసం కొనుగోలు చేయబోతున్నారు.
స్వచ్చ పున్నవల్లి:
శరీరం శుభ్రంగా క్రమశిక్షణతో ఉంటే ఆ వ్యక్తి ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతాడో గ్రామం కూడా అలా శుభ్రంగా ఉంటే అంతే మేలు జరుగుతంది. వంశి ఇంకా మిత్రులు కలిసి ఊరిలో సుమారు 2,000 మొక్కలు వరకు నాటించారు. మొక్కలు నాటడం వేరు వాటిని కాపాడుకోవడం వేరు. పశువులు, మేకలు నాటిన మొక్కలను తినేయడంతో మళ్ళీ కొత్తగా ఫెన్సింగ్ వేసి నాటే వారు కూడా.. ఇంకా ప్రతి ఇంటికి ఒక వాష్ రూమ్ ఉండాలని చెప్పి దాతలు, ప్రభుత్వం, గ్రామస్థుల సహకారంతో ప్రతి ఇంటికి ఓ మరుగుదొడ్డిని నిర్మించి సంపూర్ణ స్వచ్చ పున్నవల్లిగా తీర్చిదిద్దారు.
ఇలా చెప్పుకుంటూ పోతే పున్నవల్లికి వంశి చేసింది ఎంతో.. "తప్పులు అందరూ చేస్తారు కాని త్యాగలు మాత్రం కొందరే చేస్తారు" అని రావిశాస్త్రి గారు అన్నట్టుగా తన ఊరి కోసం ఎన్నో త్యాగాలు చేసిన వంశి మరెందరికో ఆదర్శప్రాయుడు.