స్టూవర్ట్ పురం ఈ పేరు వినగానే ఠక్కున మనకో విషయం గుర్తుకువస్తుంది. అదే " గజ దొంగల అడ్డా" అని. అవును ఆ మధ్య కాలంలో తెలుగు నేలను ఈ ఊరు గడగడలాడించింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగిన మూలాలు ఇక్కడే లభించేవి అనే ప్రచారము కూడా ఉండేది. ప్రపంచ పటంలో స్టూవర్ట్ పురం అంటే దొంగల అడ్డా కాదు, 25 ఏళ్ళ క్రితం ఒక లెక్క ఇప్పుడో లెక్క అనే సినిమా డైలాగ్ కి తగ్గుట్టుగా ఆ ఊరు గుర్తింపే మారిపోబోతుంది రాగాల వెంకట రాహుల్ వల్ల.
కటిక పేదరికం:
నాన్న రాగాల మధు గారు కూడా ఓ జాతీయ స్థాయి వెయిట్ లిప్టర్. ఎన్నో కలలు, ఎన్నో ఆశయాలతో మధు గారు ఎంతగానో శ్రమించి జాతీయ స్థాయికి ఎదిగారు. కాని పేదరికం దెబ్బ కొట్టడంతో మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే ఏంటి నేను పడ్డ దెబ్బ నా పిల్లలు పడకూడదు అని "ఉన్న పొలం, ఇల్లు, తనకున్న కొంత ఆస్థిని సైతం అమ్మేసి ముగ్గురు పిల్లలను వెయిట్ లిప్టర్లను చేశారు".
21 సంవత్సరాలు 14 బంగారు పతకాలు:
నాన్న మధు గారి లక్షణాలే పిల్లలకు ఆస్థిగా పుట్టుకతోనే వచ్చేశాయి. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా రాణించడంతో హైదరాబాద్ హాకీమ్ పేట స్పోర్ట్స్ స్కూల్ లో అడ్మిషన్ లభించి చదువుతో పాటుగా ఇంటర్మీడియట్ వరకు కూడా వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఫలితంగా పతకాలు గెలుచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. యూత్ ఒలింపిక్స్ లో 3 బంగారు పతకాలు, ఏషియన్ గేమ్స్ లో 9 బంగారు, 5 రజితాలు, 2 కాంస్యాలు, అలాగే కిందటి ఏడాది కామన్వెల్త్ లో ఓ బంగారు పతాకం ప్రస్తుత కామన్వెల్త్ లో మరో బంగారు పతకంతో 21 సంవత్సరాలలో తన ఊరిని, దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు.
ఆస్ట్రేలియా లో జరుగుతున్న ఈ కామన్వెల్త్ గేమ్స్ లో 85 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్ లో 151 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 187 కిలోలు మొత్తం 338 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు.
అమ్మానాన్నల పచ్చబొట్టు:
పతకాలు పట్టికలో మాత్రమే కాదు వ్యక్తిత్వంలోను మనోడు వెంకట్ రాహుల్ ఎందరికో స్పూర్తి. అమ్మ అనారోగ్య కారణాలతో కొన్ని నెలల క్రితమే మరణించింది. అమ్మ అంటే రాహుల్ కు మాటల్లో వర్ణించలేనంత ప్రేమ. అమ్మ నాన్నల రూపాన్ని తన ధృడమైన ఛాతి మీద ఎవ్వరూ చేరపలేని విధంగా పచ్చబొట్టును వేయించుకున్నాడు. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి అనే కోరికతో అమ్మ కాలి మెట్టను లాకెట్ గా మెడలో వేసుకున్నాడు. బరువు ఎత్తే ప్రతిసారి చెస్ట్ మీదున్న అమ్మ నాన్నల రూపాన్ని చూసి, అమ్మ కాలి మెట్టకు నమస్కరించి బరిలోకి దిగుతాడు.