"నా చివరి శ్వాస తీసుకునేంత వరకు చదువు అనే ఆయుధాన్ని అందరికి అందిస్తాను." వీగె కోటేశ్వరమ్మ గారు చెప్పిన ఈ మాటలు సాధారణమైనవి కావండి.. ఆ మాటలలో ఎంత గొప్పతనం ఉందో ఆ మాట ఇచ్చి ఆచరించగల వ్యక్తి కూడా అంతే గొప్పవారు. వి.కోటేశ్వరమ్మ గారు పేరులోనే అమ్మ ఉన్న ఈ ఉపాధ్యాయురాలిని తమ విద్యార్ధులందరూ అమ్మగానే పరిగణిస్తారు.. ప్రేమగా అమ్మ అనే పిలుచుకుంటారు. మనదేశంలో మహిళల పరిస్థితి గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కూడా ఆశించినంత ఎదుగుదల లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక గత 60 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణా జిల్లాలో 1925లో జన్మించిన కోటేశ్వరమ్మ గారు దేశంలోని సాటి మహిళలు పడుతున్న బాధలు చూసి చలించిపోయి వారి జీవన పోరాటానికి ఆయుధంగా చదువును అందిస్తున్నారు.


"విద్య" ద్వారానే మహిళల జీవితాలలో సమూల మార్పు సంభవిస్తుంది.. ఆ విద్య ద్వారానే ఇంకొకరి మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ళమీద ఎదగగలరు బ్రతకగలరు ప్రపంచాన్ని మార్చగలరు అని బలంగా నమ్మి 1955లో మాంటిస్సోరి స్కూల్ ను స్థాపించారు.. ఆ కాలంలో స్త్రీలు 13సంవత్సరాలు దాటితే చదువుకు అంగీకరించేవారు కాదు. బాల్య వివాహాలు, ఆడపిల్లలకు చదువు అనవసరం అనే సమాజం.. ఇలాంటి ఎన్నో ఆటంకాలను సమర్ధవంతంగా ఎదుర్కుని 60సంవత్సరాల సుధీర్ఘ పోరాటంలో ఎందరో మహిళల జీవితానికి బంగారు భవిషత్తుని అందించిన వనిత కోటేశ్వరమ్మ గారు.


మొదట కొన్ని తరగతుల వరకే ఉన్న మాంటిస్సోరి విద్యా సంస్థలు ఇప్పుడు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంకా పీజి వరకు కూడా విస్తరించింది. 1971వ సంవత్సరంలోనే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ స్థాయిలో అవార్ఢునందుకున్నా కాని తన దగ్గర చదువుకున్న విద్యార్ధులు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఎదిగినందుకే వారికి ఎక్కువ ఆనందం ఉంటుంది. ప్రస్తుతం 92 సంవత్సరాలలో పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్నా కూడా కోటేశ్వరమ్మ గారు విశ్రాంతి తీసుకోలేరు.. తన పోరాటం ఆపలేరు...


