Contributed By Ravi Keerthi..
మనకు ఆకలేస్తే అమ్మ ఉంది, ఏ ఆపద రాకుండా చూసుకోవడానికి నాన్న ఉన్నాడు.. రక్షణ కల్పించడానికి పోలీసు, న్యాయ వ్యవస్థ ఉంది. అదే మిగిలిన ప్రాణులకైతే ఎవరున్నారు.? ప్రత్యేకంగా వీది కుక్కలు. అవి అన్నం పెడితే తింటాయి, కొడితే పడతాయి, చంపితే చస్తాయి. "నాకు కుక్కలు అంటే ప్రాణం అవ్వి మా కుటుంబంలో భాగం అని కథలు కథలుగా వర్ణిస్తారు కాని తమ ఇంట్లోని విదేశీ కుక్కను తప్ప స్వదేశీ వీది కుక్కను ఏ మాత్రం పట్టించుకోరు". అలాంటి దిక్కు మొక్కులేని కుక్కల కొరకే విజయవాడలో ఒక ప్రత్యేక ఆశ్రమం వెలసింది.
మనల్ని నమ్ముకునే బ్రతుకుతున్నాయి: చిన్నతనం నుండే మురాల వెంకటేశ్వర రావు గారు ప్రతి ప్రాణిలో ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని, ఆత్మీయతను చూసేవారు తనకు తోచిన స్థాయిలో వాటి బాగోగులు చూసుకునేవారు. ఎప్పుడైతే ఆర్. టి. సి లో ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారో ఇక అప్పటినుండి పూర్తి స్థాయిలో సేవ చేయడం మొదలు పెట్టారు. ప్రత్యేకంగా విజయవాడలోని భవానీ పురంలో 400 గజాల స్థలంలో ఆశ్రమాన్ని స్థాపించారు. మనం మన ఆహారాన్ని పండించుకోవచ్చు కాని జంతువులకు ఆ శక్తి లేదు. అవి మన మీదనే ఆధారపడి బ్రతుకున్నాయని చెప్పి వాటి బాగోగులు చూసుకుంటున్నారు..
వెంకటేశ్వర రావు గారు డాగ్ సైకాలజీ తో పాటు వాటికి సంభందించిన రకరకాల జబ్బులపై కోర్సులు పూర్తిచేశారు. విజయవాడ నగరంలో ఏ వీది కుక్కకు ఏ ఆపద వచ్చిన జీవకారుణ్య ఆశ్రమానికి కాల్ వస్తుంది. యాక్సిడెంట్స్ దగ్గర నుండి భయంకరమైన ప్రాణాంతకరమైన వ్యాధులకు వీరు ట్రీట్మెంట్ అందిస్తారు. 2008 స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల కుక్కలను ఆదుకున్నారు. ప్రతి వేసవి కాలంలో విజయవాడలోని చాలా ప్రాంతాలలో జంతువులకై నీటి కుండీలను ఏర్పాటు చేసి వాటి దాహాన్ని తీరుస్తున్నారు.
ప్రాణం కోసం పోరాటం: ఎన్నో సమస్యలు ఉన్నాగాని కొంత మంది కమిషనర్లు కుక్కలను చంపడమే ధ్యేయంగా ముందుకు వెళ్లారు. వాటిని పట్టుకుని కరెంట్ షాక్స్ ద్వారా, తల పగులగొట్టి లాంటి కర్కశమైన పద్ధతులతో చంపేసేవారు. ఒకపక్క ప్రేమతో కాపాడిన కుక్కలు ఇలా చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలను వెంటనే విరమింపజేయాలని చెప్పి హైకోర్టు లో సైతం పోరాడారు. ఐనా గాని చంపడం ఆపకపోవడంతో రాష్ట్రపతి గారి నుండి ప్రత్యేక ఉత్తర్వులతో ఆపుచేశారు. మనకోసం ఎన్నో ఆర్గనైజేషన్, సేవా సంస్థలు ఉన్నాయి కాని నోరులేని మూగజీవులకై చాల తక్కువ. వాటి కోసం నలుగురు ఉద్యోగలను నియమించి, తన తదుపరి జీవితాన్ని వాటికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఈ జీవ కారుణ్యుడు.