ఇది ఒక నిజమైన గెలుపు.. ఇది ఒక నిజమైన ఎదుగుదల తమకు ఉన్న హక్కును శాంతియుతంగా గెలుచుకుని సమజానికి ఒక మంచి సందేశం అందించారు విజయనగరం జిల్లా గోటివాడ గ్రామ ప్రజలు. ఉద్యమాలు చేయాలంటే ధైర్యం కావాలి మరి ఆ ఉద్యమానికి తమ సమస్యను సరిగ్గా వివరించడానికి నేర్పరితనం కూడా తోడైతే ఏ విధమైన హింసకు తావుండదు అని గాంధీయిజం చెబుతుంది సరిగ్గా ఇదే ఇజంతో తమ పిల్లల బంగారు భవిషత్తుకు ఏ ఆటంకం లేకుండా రహదారి వేశారు ఆ గ్రామ ప్రజలు.
గోటివాడ గ్రామంలో ఉన్న దాదాపు 40పిల్లలు అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ స్కూల్ కి వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడ ఓటర్లు తక్కువ మంది ఉన్నారనో లేదా మరే ఇతర కారణం వల్లనో ఒకరోజు ఉన్నట్టుండి ఈ స్కూల్ ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు శాశ్వితంగా మూసివేస్తున్నామని చెప్పి మూసివేశారు ఇదేమని అడిగితే బలమైన కారణం ఏది లేదు అక్కడ.. మరి 'మా పిల్లల సదువులెట్ల సారు' అంటే అక్కడి నుండి 5కి.మీ ఉన్న మరో స్కూల్ కి వెళ్ళమన్నారు కాని అక్కడికి వెళ్ళాలంటే భయంకరమైన అడవిని దాటాల్సి ఉంటుంది. పిల్లలలో చాలామంది 10సంవత్సరాల లోపే, ఇంత చిన్న వయసులో జంతువులు తిరిగే అడవి నుండి పంపించాలంటే అది వారి ప్రాణానికి ప్రమాదం, మరి ఇంట్లోనే ఉండనిస్తే పిల్లల భవిషత్తుకు ప్రమాదం.. మరి ఎలా.? అని బాధపడుతున్న తరుణంలో గ్రామస్తులకు అండగా నిలబడ్డారు విజయనగరం ఆర్ట్స్ మరియు Aide et Action International South Asia (http://aea-southasia.org/) సభ్యులు.
అందరు ఉపయోగిస్తున్న పద్దతులతో ఉద్యమం చేస్తే మన సమస్య అంతగా బయటి ప్రపంచానికి తెలియకపోవచ్చు అని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారులకు ప్రతి రోజు 70 ఉత్తరాలు రాసి పంపించడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కరోజు కాదు 'ఇక ఆపండి మహాప్రభో.. మీ స్కూల్ ని తిరిగి ఓపెన్ చేస్తున్నాం అని హామీ ఇచ్చేంత వరకు ఆపలేదు'. ఉత్తరాలు అంటే ఏదో పంపించారు అని కాకుండా అందులో స్కూల్ మూసివేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో అని వివరంగా వివరించారు. చివరికి అధికారులు సమస్యను గుర్తించి స్కూల్ ని తిరిగి ఓపెన్ చేయించారు. మా స్కూల్ కి మాకు వచ్చేసింది అని ఆ పిల్లలు మరింత ఉత్సహంగా స్కూల్ కి వెళుతున్నారు.