విశ్వేశ్వర్ ది కృష్ణా జిల్లా ఉయ్యూరు. నాన్న వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం నిత్యం సమస్యలతో కూడుకున్నది, అన్ని సమస్యలను మానవ ప్రయత్నంగా అదిగమించినా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి ఒక్క ఉదుటున అకాల వర్షం కురిపిస్తే మొత్తం సర్వనాశనం. ఒకవేళ పంట బాగా పండినా సరైన మార్కెట్ ధర కూడా రావాల్సి ఉంటుంది అప్పుడే విజయం. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుకనే విశ్వేశ్వర్ నాన్న సంజీవ గారు పెద్దయ్యాక ఉద్యోగం మాత్రమే చెయ్యాలని పట్టుబట్టారు.
ఆవులను, ఎద్దులను చూస్తూ, పొలంలో పండే వేరుశెనగ కాయలు, మొక్కజొన్నలు ఇష్టంగా తినే విశ్వేశ్వర్ కు ఆ భూమితో అనుబంధం ఏర్పరుచుకుని వ్యవసాయం చెయ్యాలనే కోరిక చిన్నతనంలోనే కలిగింది. కాని నాన్న కోరిక మేరకు ఉన్నత చదువులు చదివాడు. అమెరికాలోని "పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్" లో ఎమ్.ఎస్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ప్రోటీన్ ఇంజినీరింగ్ లో రీసెర్చ్ మొదలుపెట్టారు కాని మధ్యలోనే ఆపుచేసి ఐటి ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్నా కాని అక్కడి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం, స్థానిక రైతులతో మాట్లాడడం లాంటివి చేస్తుండేవారు. రోజులు గడుస్తున్న కొద్ది ఎదో కోల్పోతున్నాను, ఇది నా జీవితం కాదు వంటి ఆలోచనలతో మనసు వేదనకు గురిచేసేది.
విశ్వేశ్వర్ కుటుంబానికి ఉయ్యూరు లో కొంత పొలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత భూమి ధర విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో హార్టికల్చర్ వ్యవసాయానికి మంచి గ్రోత్ ఉండడంతో తిరిగి సొంతూరుకు వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ ను మొదలుపెట్టాడు. ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని పండించడానికి గల ప్రధాన కారణం డబ్బు సంపాదించాలని మాత్రం కాదు. ఇన్స్టెంట్ ఫుడ్ కి, ఇన్స్టెంట్ లైఫ్ కి అలవాటు పడ్డ శరీరాలకు అసలైన నేలతల్లి కమ్మని భోజనం ఇవ్వడం కోసమే.
నాన్న సంజీవ గారికి వ్యవసాయంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. పెస్టిసైడ్స్ చల్లకుండా చేసే వ్యవసాయంలో డబ్బులు వస్తాయా అని ససేమిరా అన్నారు. ఉద్యోగాన్ని సైతం వదులుకుని వ్యవసాయం చెయ్యాలనుకుంటున్న విశ్వేశ్వర్ తపన చూసి ఒక్క అవకాశం ఇచ్చారు. ఇక్కడి ప్రాంతంలో నీటి సౌకర్యానికి ఏ లోపం లేదు రైతులందరూ చెరకు, వరి ఎక్కువ పండించడానికి ఆసక్తి చూపిస్తారు. విశ్వేశ్వర్ మాత్రం ఇందుకు భిన్నంగా మిక్సిడ్ క్రాప్ పద్దతిలో కూరగాయలను పండిస్తూ అంతర పంటలుగా మొక్కజొన్న, ఖర్భుజ మొదలైనవి పండిస్తున్నారు. భూమి సత్తువ పెరగడానికి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, సాంప్రదాయ ఎరువులతో పాటు ఇంట్లో నుండి వచ్చే వ్యర్ధాలను ఉపయోగించుకుంటున్నారు.
మార్కెటింగ్ చేసుకోవడంలోను విశ్వేశ్వర్ మెలకువలు పాటిస్తున్నారు. ఆర్గానిక్ పంటను నేరుగా రైతు బజార్ లో అమ్ముతున్నారు. విశ్వేశ్వర్ భవిషత్ లో రైతులందరిని కలుపుకుని "ఉయ్యూరు ఆర్గానిక్స్" పేరుతో పూర్తి ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని ప్రణాళికలు కూడా చేస్తున్నారు.