విశాఖపట్నం పేరు తలుచుకోగానే అక్కడి సాగర తీరం, పచ్చని రమణీయమైన అరకు ప్రకృతి అందాలు, మంచు చీర కప్పుకున్న లంబసింగి హొయలు గుర్తుకువస్తాయి.. తమ దగ్గరికి వచ్చి సేద తీరమని ప్రేమగా ఆహ్వానించినట్టుగా ఉంటుంది ఈ ప్రాంతం.. విశాఖపట్టణం అంటే అందమైన ప్రకృతి మాత్రమే కాదు మహిమాన్విత పుణ్య క్షేత్రాలకు నెలవు. పాండవులు వనవాస సమయంలో ఇక్కడే కొంతకాలం ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారంటారు. అలాగే ఇక్కడ ఎన్నో పురాతన గొప్ప దేవాలయాలున్నాయి.. అలాంటి వాటిల్లో ప్రధానమైన గుడి శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం.

విశాఖపట్నం జిల్లాలో సింహాచలం లక్ష్మీ నరసింహా స్వామి గుడి తర్వాత రెండవ అతిపెద్ద గుడి శ్రీ కనక మహాలక్ష్మీ దేవాలయం. విశాఖపట్నం బురుజుపేటలో ఈ దేవాలయం ఉన్నది. దేశంలోనే ఎక్కడాలేని ప్రత్యేకత ఈ దేవాలయానికి ఉంది. "ఈ దేవాలయంలోని అమ్మవారు గర్భ గుడిలో కాకుండా ఆరుబయట నుండే భక్తులకు దీవెనలిస్తుంది". సాధారణంగా మన ఇంట్లో జరిగే ఏదైన శుభకార్యాలు జరిగితే మొదటి ఆహ్వానాన్ని మంచి మనసు ఉన్న వ్యక్తులను ఎలా పిలుస్తామో అలాగే ఈ పరిసర ప్రాంతంలోని అమ్మవారి భక్తులు మొదటి ఆహ్వానాన్ని, మొదటి శుభలేఖను ఈ అమ్మవారికి సమర్పించి పిలుస్తారు. ఇదొక్క ఉదాహరణ చాలు కనక మహాలక్ష్మీ అమ్మవారిపై వారికి ఎంతటి నమ్మకమో, ఎంతటి భక్తి ఉందో తెలియజేయడానికి.


మిగిలిన దేవాలయాలలో గర్భగుడి ఉండడం వల్ల పూజారులు మాత్రమే వివిధ పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కాని ఈ గుడిలో ప్రతి ఒక్క భక్తుడు స్వయంగా పూజలు, అభిషేకాలు చేసుకునే అద్భుతమైన అవకాశం ఉన్నది. ఈ పవిత్రమైన దేవాలయం ఎలా ఏర్పడిందో వివరించే చారిత్రక ఆధారం లేకపోయినప్పటికి ఇక్కడ స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది.. సుమారు వంద సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహం ఒక బావిలో దొరికిందట, ఆ ప్రతిమను మొదట ఒకచోట ప్రతిష్టించారట. ఆ తర్వాత రోడ్డును వెడల్పు చేసే పనిలో ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగిస్తే విశాఖపట్నంలోని ప్రజలు అనారోగ్యం పాలయ్యారని ఆ తర్వాత ఎక్కడ నుండి తొలగించారో తిరిగి అదే చోట ప్రతిష్టిస్తే ప్రజల ఆరోగ్యం కుదుటపడిందని భక్తుల కథనం. కేవలం ఒక పండుగ, కొన్ని రోజులు అన్నట్టుగా కాకుండా సంవత్సరమంతా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అలాగే మార్గశిర, శ్రావణ మాసాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.



