అ - అమ్మ, ఆ - ఆవు, ఇ - ఇల్లు, ఈ - ఈగ, ఉ - ఉలవచారు.. ఇలా భోజనప్రియులు ఇష్టంగా చెప్పుకుంటారు. తరాలు మారిపోతున్నాయి.. అభిరుచులు కూడా మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఉలవచారుతో కొత్త పద్దతులతో వంటలు చేస్తున్నారు అంతేకాని ఉలవచారు మీద భోజన ప్రియుల ప్రేమ మాత్రం తగ్గడం లేదు. ఇటు రుచికి రుచి అటు ఆరోగ్యానికి ఆరోగ్యంతో ఉలవచారు నిరంతరం విజయదరహాసంతో తన ప్రయాణాన్ని సాగిస్తున్నది.
ప్రాచీనకాలం నుండి కూడా ఉలవలు మన భోజనంలో భాగం అయ్యాయి.. ఈ మధ్య కాలంలో దీని రుచి మరింత వ్యాప్తి చెందడానికి దోహదపడింది మాత్రం మండవ వెంకటరత్నం గారే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే ఫైవ్ స్టార్ హోటెళ్ళ నుండి లగ్జరీ ఫంక్షన్ల వరకు ఉలవచారు విందులో భాగం అవుతుంది కాని గత కొన్ని దశబ్దాల క్రితం అంతగా లేదు. వీటిని ఎక్కువగా ఇంట్లో పెంచుకునే గుర్రాలకు, పశువులకు మేతగా ఉపయోగించేవారు. ఉలవలను వంటింటికి తీసుకువచ్చేది అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులలో వెంకటరత్నం గారు, సోదరుడు మండవ చంద్రశేఖర్ ఆజాద్ గారు, మరియు అతని కుటుంబ సభ్యులు ఉలవచారును ఇందిర ఫుడ్స్ పేరుతో 1995 నుండి తయారుచేయడం మొదలుపెట్టి ఉలవచారు రుచిని విశ్వవ్యాప్తం చేశారు.
విజయవాడ అనే పేరు వినగానే భక్తులకు ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎలా స్పురణకు వస్తారో భోజన ప్రియులకు ఉలవచారు గుర్తుకువస్తుంది. చాలామంది ఉలవచారును రెండు గంటలలో తయారుచేస్తుంటారు కాని దీని అసలైన రుచి తెలియాలంటే మాత్రం 12 గంటలపాటు తయారు చేసేంత వరకూ తెలియదు. సంస్థను ప్రారంభించిన తొలిరోజులలో వెంకటరత్నం గారు మరియు అతని కుటుంబ సభ్యులు కట్టెల పొయ్యి మీద గంటల తరబడి ఎన్నో కష్టాలు అనుభవించారు.. ఆ తరువాత కాలంలో పెద్ద పెద్ద వెస్సల్స్ ఏర్పాటుచేసి, డిమాండ్ కు తగ్గట్టు పెద్ద యెత్తున ఎగుమతులు చేయడం ప్రారంభించారు. ఇందిర ఫుడ్స్ వారు కేవలం ఉలవచారును మాత్రమే తయారుచేసి ఇళ్ళ దగ్గరి నుండి ఫైవ్ స్టార్ రెస్టారెంట్లకు, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు.
ప్రతిరోజు సుమారు 1,000 కేజీలు, పండుగలు ఇతర శుభకార్యాల సీజన్ లో 1500 కేజీల వరకు తయారుచేస్తుంటారు. ప్యాకింగ్ కూడా సురక్షితంగా ఉండడంతో ఈ ఉలవచారు నెల రోజుల వరకు తన రుచిని అద్భుతంగా అందిస్తుంటుంది. ఇక ఈ ఉలవచారుకు ఉన్న అభిమానులలో సామాన్యుల దగ్గరి నుండి అసామన్యుల వరకు ఉన్నారు. ఒక్కసారి ఈ రుచిని ఆస్వాధించిన వెంటనే ఉలవచారుకు దాసోహం ఐపోతారని నిఖ్ఖచ్చిగా వర్ణించవచ్చు. అంతెందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఈ రుచిని ఎంతో ఇష్టపడుతుంటారట.
విజయవాడలోని Dv Manor, Gateway hotel, Murali Fortune, ఇంకా విజయవాడలోని అన్ని పెద్ద హోటెళ్ళతో పాటుగా హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటెళ్ళకు మండవ కుటుంబమే సప్లై చేస్తుంటారు. ఇంతలా బిజినెస్ నిర్వహిస్తున్న మండవ వెంకటరత్నం గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంతని అనుకుంటున్నారు.? కేవలం పదవ తరగతి మాత్రమే.! నిజాయితీ, శ్రమ, పట్టుదల, సరైన ప్రణాళిక ఈ నాలుగు ఉంటే చాలు మన ఊహకందనంత ఎత్తుకు ఎదగవచ్చు అని చెప్పుకోవడానికి మండవ వెంకటరత్నం గారి జీవితం ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
మండవ వెంకటరత్నం గారు సాగించిన జీవన ప్రయాణం గురించి క్లుప్తంగా తన మాటల్లోనే..