మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారత దేశమంతటిలో భద్రాచల క్షేత్రానికి ఒక ప్రత్యేక స్థానముంది. శ్రీరాముడు వనవాస సమయంలో విశ్రాంతి తీసుకున్న పవిత్ర స్థలమని అక్కడికి దేశమంతటి నుండి భక్తులు వస్తారు. భద్రాచలం తర్వాత తెలుగు రాష్ట్రాలలో రాముల వారికున్న పుణ్య దేవాలయాలలో ఈ ఒంటిమిట్ట కొదండరామ స్వామి వారి దేవాలయం ఒకటి. ఈ గుడినే "ఆంధ్రా భద్రాచలం"గా ఇక్కడి భక్తులు పిలుస్తారు. రాయలసీమ కడప జిల్లా కేంద్రం నుండి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉన్నది.. ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా సీతారామ లక్ష్మణులు ఏకశిలలో దర్శనమిస్తారు.


మన తెలుగులో మహాకవిగా కీర్తినందుకున్న బ్రమ్మెర పోతన ఈ ప్రాంతంలోనే ఉండి దైవానుగ్రహంతో భగవతాన్ని రచించారు. అత్యంత భక్తితో రచించిన భాగవతాన్ని ఇక్కడే పూజలందుకుంటున్న కోదండ రామునికి అంకితమిచ్చారు. అద్భుతమైన శిల్పసౌందర్యంతో ఉన్న ఈ దేవాలయాన్ని చోళులు, విద్యారణ్య రాజులు కాలక్రమంలో మూడు సార్లు నిర్మించారని అక్కడి శిలాశాసనం ద్వారా తెలుసుకోవచ్చు. పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, తాళ్ళపాక అన్నమాచార్య, అయ్యలరాజు తిప్పరాజు లాంటి ఎందరో మహానుభావులు ఈ దేవాలయ మహిమ తెలుసుకుని కొంతకాలం ఈ పరిసరాలలో గడిపారట.


స్థానికుల కథనం ప్రకారం.. "పూర్వం ఒంటుడు మిట్టుడు అనే అన్నదమ్ములుండేవారు. వీరిద్దరు దొంగలు. గ్రామాలు తిరుగుతు దొంగతనాలు చేసే ఈ దొంగలు ఈ ప్రాంతంలో దొంగతనాలు చేస్తు దొంగిలించిన నగదు, నగలను ఇక్కడి గుహలలో దాచేవారు.. ఈ గుహలోనే ప్రతిమ రూపంలో ఉన్న సీతారాములు దొంగలకు ప్రత్యక్షమై ఈ దొంగతనాలు మానివేసి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయండని ఉపదేశించారట". మారిన ఆ ఇద్దరు దొంగలు ఏకశిలలో ఉన్న సీతారామ లక్ష్మణ ప్రతిమలను ప్రతిష్టించి ఒక చిన్నపాటి గుడిని నిర్మించారట..


అలాగే ఇంకో పురాణ గాధ కూడా ప్రచారంలో ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఉండగ ఇదే ప్రాంతంలో కొందరు మహార్షులు యాగలు చేసేవారు.. ఈ యాగాలను జరగనీయకుండా రాక్షసులు ఆటంకపరిచేవారట.. మహర్షుల ఆజ్ఞ మేరకు శ్రీరాముడు తన బాణంతో రాక్షసులను సంహరించారట.. దానికి ఆనందంతో మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒకే విగ్రహంలో చెక్కించారట.. ఆ తర్వాత జాంబవంతుడు ఈ ప్రాంతంలోనే విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టచేశారని కథనం. కాలక్రమంలో మహారాజులు ఈ గుడి మహిమ తెలుసుకుని అత్యంత అందంగా పటిష్టంగా నిర్మించారట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.