అమ్మా.. నాన్న.. ఇక నా జీవితం ఈ దేశానికే అంకితం.. నేను పెళ్ళి చేసుకోను చేసుకుంటే "నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం" అంటు స్వార్ధంగా వారి కోసమే ఆలోచిస్తాను.. అందుకే నేను పెళ్ళిచేసుకోను. మీకు గౌరవం ఇచ్చినట్టుగానే మన దేశంలోని ప్రతి పౌరుడిని గౌరవించి.. వారిని మీరు నన్ను పెంచినట్టుగా మంచి పౌరుడిగా తీర్చిదిద్దుతా... ఈ విషయంలో నాకు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లే స్పూర్తి అంటు ఆశీర్వదించండి అని తల్లిదండ్రులకు నమస్కరించి దీవెనలు అందుకున్నాడు. ఇది కేవలం ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత భగీచా సింగ్ అనే ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం... మొదట తల్లిదండ్రులు భయపడినా తరువాత భగీచా నిర్ణయానికి గర్వించారు...
ఇక అప్పటి నుండి భగీచా ఎన్నో సేవా కార్యక్రమాలు తన శక్తికి మించి చేయడం మొదలు పెట్టాడు.. భగీచా పుట్టింది హర్యాన రాష్ట్రంలో.. చిన్నప్పటి నుండి దేశం అంటే దేవుడికిచ్చేంతటి భక్తి ని చూపిస్తాడు.. తన సుధీర్ఘ జీవితంలో చేసిన సేవలకు రాని మంచి గుర్తింపు తన 80వ సంవత్సరంలో వచ్చింది...అది తన 60 సంవత్సరాల వయసు లో.. ఒక బలమైన సంకల్పం నిర్ణయించుకున్నాడు.. అది విన్న తన మిత్రులు, కుటుంబ సభ్యులు వద్దని ఎంత బ్రతిమలాడిన వినలేదు... నాకు నా ప్రాణం కన్నా నా దేశం, నా దేశ పౌరుల భవితే ముఖ్యం అంటూ ముందుకు నడిచాడు... సిగిరేట్, మద్యం, గుట్క, అందరికి చదువు, భ్రూణ హత్యలు, ఎయిడ్స్, ప్రభుత్వ అవినీతి, కులమతాల తారతయ్యం వంటి భారతదేశం ఎదుర్కుంటున్న సమస్యల పై పరిపూర్ణ అవగాహన కల్పించడం కోసమే అతని జీవన గమనం.. అలా కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు ఇప్పటికి 21 సంవత్సరాల పాటు నిరంతరంగా 5,80,000 కిలోమీటర్లు పైగా నడిచాడు.. దేశాన్ని దాదాపు 20 సార్లు కాలినడకన చుట్టేశాడు... ఒక 25 కేజీల రైస్ బ్యాగ్ ను మోయడానికే మనం ఆపసోపాలు పడుతుంటాం అలాంటిది భగీచా 90 కేజీల మూటతో (లగేజ్, టెంట్, ఆహారం) దేశమంత నడవడం అంటే మాములు విషయం కాదు... ఇదంతా చేసేది కేవలం మన కోసమే మన దేశం కోసమే...
ఇందుకోసం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు నడక, తర్వాత భోజనం కాసేపు విశ్రాంతి మళ్ళి నడకను సాయంత్రం 7 వరకు కొనసాగిస్తారు.. మొదట్లో రాత్రి 9 వరకు నడిచే భగీచా శరీరం సహకరించక పోవడం వల్ల ఈ 80లో సాయంత్రం 7 వరకే నడుస్తున్నారు. భగీచా ఒక శాకహారి,ఇరవై సంవత్సరాల నుండి ఇంటికి వెళ్ళకుండ ప్రయనాన్ని సాగిస్తున్నారు. నడకను కొనసాగిస్తు దారి పొడవున తనకు ఎదురయ్యే సిగిరేట్, మద్యం వంటి దురలవాట్లు తీసుకునే వారితో మాట్లాడి వారిని తన మంచి స్పూర్తిదాయకమైన మాటలతో మంచి మనిషిగా మార్చడానికి ప్రయత్నిస్తారు.. ఇలా ఎన్నో వేల మందిని దురలవాట్ల నుండి విముక్తులను చేశారు...
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది.. మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తేనే కొన్నిసార్లు ఆనారోగ్యం వస్తుంది, అలాంటిది వృద్యాప్యంలో భిన్న వాతావరణ పరిస్థితులలో దేశమంతా 20 సార్లకు మించి నడవడం మాములు విషయం కాదు.. అది ఒక బలమైన వ్యక్తిత్వం సంకల్పానికే అంతటి శక్తి ఉంటుంది..భగీచా సింగ్కు మన తెలుగు వారన్న, వారి వ్యక్తిత్వం అన్నా చాలా ఇష్టం వచ్చిన ప్రతిసారి మేడ్చేల్ లోని ఉమా మహేశ్వర దేవలయం లో ఖచ్చితంగా ఒకరోజు గడుపుతారు అక్కడి పవిత్రత, వాతావరణం తనకు కొత్త శక్తినిస్తుందని అంటారు.. ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని Eco Friendly ప్రతిమగా నిర్మించాలని అక్కడి కమిటికి సూచించారు... పర్యటించిన ప్రతి రాష్ట్రంలోని ముఖ్యముంత్రులను, నాయకులను, పోలీసు అధికారులతో కలిసి తన సూచనలను అందిస్తుంటారు.. తన తపన అంతా ఒక్కటే ప్రభుత్వాలు గుట్క, ఆల్కహాల్, సిగిరేట్ వంటి వాటిని నిషేదించాలి.. కేవలం వాటినుండి వచ్చె టాక్స్ ల కోసం చూడవద్దు.. ఒక రకంగా దేశాభివృద్ధికి అది కూడ అడ్డంకి.. వాటి వల్ల యువత, దేశ పౌరుల ఆలోచన ధోరణి మారుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతటా వాటిని నిషేదించేయాలని భగీచా సింగ్ విన్నపం...
అసలు భగీచా సింగ్ ఎవరండీ? మనకేం అవుతారు ? మన తాతయ్యనా ? మన చుట్టాలా? మన వ్యక్తిత్వాన్ని దురలవాట్లను మానిపించడానికి 80 లో 90 కేజీల బరువుతో దేశమంతటిని ప్రేమగా మార్చడానికి 20 ఏళ్ళనుండి శ్రమిస్తున్నారు.. ఆయనను చూసి ఒక సగటు భారతీయుడుగా గర్వపడి అభిమానిగా ఉండటం కన్నా మనకున్న చెడు అలవాట్లను మానుకొని ఆయన పడ్డ శ్రమను గౌరవమిద్దాం.. ఆ శ్రమకు ఒక అర్ధాన్ని ఇద్దాం.. జై హింద్.



