నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నంత సేపు నా మీద నాకు కాస్త జాలి కాస్త కోపం కలిగింది.. ఇంతమంది మనుషులను కలిశానే కిషోర్ లాంటి ఒక్క ప్రాణ స్నేహితుడిని కూడా సంపాదించుకోలేకపోయాననే స్ఫురణ అంకుశంలా పొడిచింది. 1947 కాలంలో ఇద్దరు సైనికులకు మరియు పాకిస్తాన్ నుండి తెగబడిన గిరిజన తిరుగుబాటు దారుల మధ్య జరిగిన యుద్ధంలో ఒక సైనికుడి మరణంతో ఈ షార్ట్ ఫిల్మ్ మొదలవుతుంది. జీవితం అనే యుద్ధంలో ఎవరికి వారు లేదంటే ఒక సమూహంగా యుద్ధం చేసినప్పుడు తోటి సైనికుడికి మరొక నిజమైన సైనికుడు ఎలా అండగా నిలబడాలి.. అన్న కోణం కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకటి రెండు మాత్రమే కాదు ప్రేమ విషయంలో, శాంతి విషయంలో పలు రకాలైన కోణాలతో మనలో ఆలోచనలు సృష్టించగలుగుతుంది.. కనుకనే దేశ అంతర్జాతీయ స్థాయిలో 115 అవార్డులు గెలుచుకుంది.
1947 Two Soldiers కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం చేసింది మన తెలుగువాడు శ్రావణ్. శ్రావణ్ జీవితంలోనూ నిజాయితీ గల సైనికుడు. సినిమా అనే యుద్ధం కోసం చదువును మధ్యలోనే ఆపేసి పూరి జగన్నాథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర కూడా సినిమా రచన విషయంలో విలువైన సలహాలు తీసుకున్నారు. నిజానికి ఈ సినిమాను ఒక ప్రొడ్యూసర్ కోసం డెమో షూట్ కోసమని రూపొందించారు. ఐతే DI చేస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోని కొంతమంది సిబ్బంది "అద్భుతంగా తీశారు, దీనిని ఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపించండి" అని సూచించారు. అలా స్క్రీనింగ్ ఐన ప్రతిచోట ప్రశంసలతో పాటు 100 కు పైగా అవార్డులను అందుకుంది, తెలుగు టీం తో పాటుగా తెలుగు నేలపైనే (లంబసంగి, మొయినాబాద్) షూటింగ్ నిర్వహించి మరోసారి మనకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారు.
పూర్తి షాట్ ఫిల్మ్ ఇక్కడ చూడవచ్చు: