వరంగల్ జిల్లా ఓ చారిత్రక ప్రాంతం.. రాణి రుద్రమ తెగువకు సంబంధించిన ఆనవాళ్లు, కాకతీయ రాజుల అభిరుచులతో నిర్మితమైన దేవాలయాలు, శిల్ప సౌందర్యంతో వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది. వరంగల్ లో ఉన్న ధర్మసాగర్ ప్రాంతం దట్టమైన ఇనుపరాతి గుట్టలతో, ప్రశాంతానికి ఉదాహరణగా నిలిచే పక్షులతో, కలుషితం కాని చెరువునీటితో అందంగా శతాబ్దాల క్రితమే ముస్తాబయిఉంది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ తో ఎకో టూరిజాన్ని మొదలుపెట్టింది.
ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరు మనస్పూర్తిగా గడపాలనే ఉద్దేశ్యంతో టూరిస్టులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా అత్యంత నాణ్యమైన టెంట్లను వాడుతున్నారు. అసలైన తెలంగాణ భోజనం(వెజ్, నాన్ వెజ్). అలాగే తోటి పర్యాటకులను కలుపుతూ ఆట పాటలు, రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాల సన్నిధిలో క్యాంప్ ఫైర్, అక్కడే స్వచ్ఛగా ఎగిరే పక్షులను చూడడానికి బైనాక్యులర్ ఇస్తున్నారు. ఇదంతా కేవలం రూ.1,000 చార్జ్ తో(ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితం) మాత్రమే. ట్రెక్కింగ్, ఇదే ప్రాంతంలో నైట్ క్యాంపింగ్, తో టూరిస్టులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ప్రాంతం లోని సహజమైన అందాలను కాపాడుకోవాలి కనుక ఇక్కడ మందు తాగడం, మత్తు పదార్ధాలు పూర్తిగా నిషిద్ధం. చెరువులో స్విమ్మింగ్ చేయడం కూడా అనుమతించరు. మహిళలకు, పురుషులకు(ఒకవేళ భార్య, భర్తలు కాకుంటే) వేరువేరు టెంట్లుంటాయి. ప్రస్తుతం కొన్ని టెంట్లనే ఏర్పాటుచేసినా గాని భవిషత్తులో మరిన్ని పెంచబోతున్నారు.
నా చిన్నతనంలో మా ఇంటి చుట్టు ప్రక్కల వారందరితో కలిసి ప్రకృతి రమణీయత అద్దం పట్టే ప్రాంతానికి వనభోజనాలకు వెళ్ళేవాళ్ళము. అందరం ఒకే బస్ లో ఉదయమే చేరుకొని పచ్చని చెట్ల మధ్య సరదాగా గడిపుతూ, ఆటలాడుతూ, అక్కడే భోజనాలు వండుకుని, కలిసి భోజనం చేసి, బాగా అలసిపోయి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేవాళ్ళము. ఇంటికి వచ్చాక నేను మా అమ్మను అడిగాను.. "ఎందుకమ్మ ఈ ఆటలు, భోజనాల కోసం అంత దూరం వెళ్ళడం అన్ని మన ఇంటి దగ్గరే చేసుకోవచ్చుగా.?" దానికి అమ్మ.. "ఇంట్లో రకరకాల టెన్షన్స్, బాధలతో ఉంటాం కదా నాన్న.. ఇలా అప్పుడప్పుడు దూరంగా వెళ్లి ప్రకృతి తో గడిపితే మనలోని నెగిటివ్ అంతా కూడా అక్కడే పోయి ఆ స్వచ్ఛమైన ప్రాంతం మనకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది".
అమ్మ చిన్నప్పుడు నాకు చెప్పిన మాటలు అంతగా అర్ధం కాలేదు కాని గుర్తుండిపోయాయి.. వయసు పెరుగుతున్న కొద్ది అందులో ఎంత వాస్తవం ఉందో తెలుస్తూ వచ్చింది. నా వయసుతో పాటుగా ప్రపంచం మారుతూ వచ్చింది. వనభోజనాలూ తగ్గుతూ వస్తున్నాయి, దాంతోపాటే టెన్షన్స్, ఒత్తిడులు పెరుగుతూ వస్తున్నాయి.. సంవత్సరంలో కొన్ని రోజులైనా ప్రకృతితో మమేకం అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ముందుకురావడం "టూరిజం కన్నా మనుషులకు ఎంతో ఉపయోగపడుతుంది".
ధర్మసాగర్ నైట్ క్యాంపింగ్ లో గడపాలనుకునే వారు, మిగిలిన పూర్తి వివరాలకు, గైడెన్స్ కోసం ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చు: 7997 270 270