కొన్ని అవసరమైన సందర్భాలలో దుష్టులను సంహారించడానికి భగవంతుడు ఉగ్ర స్వరూపంగా అవతరిస్తాడు. అలా విష్ణుమూర్తి ఆగ్రహంతో నరసింహావతారంగా వస్తే, శివుడు వీరభద్రుడుగా అవతరిస్తాడు.. వీరభద్ర స్వామివారికి ఎన్నో దేవాలయాలున్న కూడా ఈ కురవి దేవాలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. ఈ దేవాలయం మహబూబాబాద్ నుండి 10కిలోమీటర్ల దూరంలో, వరంగల్ జిల్లా కేంద్రం నుండి 100కిలోమీటర్ల దూరంలోని కురవిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో చూడవలసిన దేవాలయాలన్నీటిలో ఈ దేవాలయం కూడా ప్రముఖంగా ఉంటుంది.
వీరభద్రావతారం: దక్షునికి సతీదేవి అనే కూతురు ఉంటుంది. దక్షునికి మొదటి నుండి శివుడు అంటే అస్సలు నచ్చడు. ఐనా కూడా సతీదేవి ప్రేమతో శివుడుని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి దక్షుడు యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. తండ్రి చేస్తున్న ఆ యజ్ఞంలో పాల్గొనడానికి ఆహ్వానం రాకపోయినా సతీదేవి అక్కడికి చేరుకుంటుంది. అదే సమయంలో దక్షుడు శివుడుని దూషించే సరికి మనస్తాపంతో సతీదేవి అక్కడికక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో తన కేశాలను నేలకేసి కొట్టడం వల్ల వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు. ఆ వీరభద్రుడు దక్షుని రాజ్యాన్ని ఆగ్రహంతో సర్వనాశనం చేస్తాడు. వీరభద్రుడుని నిలువరించడానికి ఎంతోమంది వచ్చినా కాని వారు అనుకున్నది జరగలేదు. అప్పటినుండి వీరభద్రుడుని ధైర్యానికి, శక్తికి ప్రతీకగా కొలుస్తారు.
ఈ దేవాలయాన్ని క్రీ.శ 850వ సంవత్సరంలో మొదట భీమరాజు అనే రాజు నిర్మించారు. ఆ రాజు మొదట కురవిని రాజధానిగా చేసుకుని పాలించారు, ఆ సమయంలోనే ఈ గుడిని నిర్మించారు. ఆ తర్వాత రాణి రుద్రమదేవి, ఇంకా మిగిలిన కాకతీయుల పాలనలో ఈ గుడి అటు నిర్మాణ పరంగా ఇటు పేరు పరంగా మరింత అభివృద్ధి చెందింది. తెలంగాణలో భక్తులు ఎక్కువగా దేవతామూర్తులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. భద్రాచల రాముల వారిని భద్రాద్రి రామయ్యగా, కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని కొండగట్టు అంజన్నగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని వేములవాడ రాజన్న అని ప్రేమగ పిలిచినట్టుగా కురవి వీరభద్ర స్వామి వారిని కురవి వీరన్నగా ఆత్మీయంగా పిలుచుకుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున వీరభద్రునికి అమ్మవారికి జరిగే కల్యాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు..