Contributed by Sai Ram Nedunuri
ఆదివారం రాత్రి .. ఎప్పటిలాగే నాలో బాధ మొదలైంది .. సోమవారం రోజు చేసే పనిని తలుచుకుని బాధపడే వారిలో ఒకరిని కాదు నేను .. నా మీద చాలా మంది చూపించే ద్వేషానికి బాధపడే సోమవారాన్ని నేను ..
మరుసటి రోజు ఉదయాన్నే లేవాలని విసుక్కుంటూ పడుకుంటున్న వారు కొందరు .. అప్పుడే ఆదివారం అయిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్న వారు ఇంకొందరు .. తాము చేస్తున్న ఉద్యోగం ఇంక వాళ్ళ వల్ల కాదు అని ప్రతి వారం లాగే అనుకుంటున్న వాళ్ళు కొందరు .. సామాజిక మాధ్యమాల్లో #MondayMotivation అని ధైర్యం కూడతీసుకుంటున్న వాళ్ళు ఇంకొందరు ..
నీ శుక్రవారపు సాయంత్రం అవ్వాలని అనుకుంటాను నేను .. కొత్త ఆశలతో నాకై నువ్వు ఎదురుచూస్తావని, ఎదురుచూస్తూ ఉంటాను నేను .. నువ్వు తలపెట్టే మహత్కర్యాలకి ముహూర్తం అవ్వాలని ఉవ్విళ్లూరుతుంటాను నేను .. నువ్వు నన్ను ప్రత్యర్థిలా భావించకుండా, అక్కున చేర్చుకోవాలని ఆశ పడుతూ ఉంటాను నేను ..
నీ యాంత్రిక పనులని ఒకసారి పక్కన పెట్టి ఆలోచించి చూడు .. నేనంటే ఎందుకు చిరాకు పడుతున్నావో ప్రశ్నించుకుని చూడు .. నీకు ఇష్టమైన పని వైపు ఎలా అడుగులు వేయాలో తర్కించుకుని చూడు .. నీకు నచ్చిన ప్రయాణం లోని సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలు బేరీజు వేసుకుని చూడు ..
నాకు తెలుసు నా మీద ఇష్టం పెంచుకోవడం చెప్పినంత సులువు కాదని .. కానీ నువ్వు వేసే ఒక్క అడుగు, నీ ప్రయాణానికి స్ఫూర్తినిస్తుందేమో .. నాదైన రోజు, నీది కూడా అవుతుందని అనుకుంటున్నాను .. నేను వచ్చిన ప్రతిసారీ, ఉత్సాహంతో నిద్ర లేస్తావని ఆశిస్తున్నాను ..
ఇట్లు, సోమవారం