"సత్యం కాలానుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది" - ఓల్గా
అవును ఈరోజు నిజం అనుకునేది రేపు కాదు.. పూర్వం సతీసహగమనం సాంప్రదాయాలలో ఒక భాగంగా ఉండేది, బాల్య వివాహాలు సాంప్రదాయాలలో భాగంగా ఉండేది. కాని ఇప్పుడు అవి అమానుషాలలో ఒక భాగం. ఇప్పుడు సాంప్రదాయంగా కొనసాగుతున్నవి కొన్ని సంవత్సరాలకు అనాగరికమైనవని తెలుసుకుని కాలానుగూనంగా ప్రయాణించడమే అభివృద్ధికి సోపనం. అలాంటి అమానుషమైనవి ప్రస్తుతం మన సంఘంలో కొనసాగుతున్నాయి ముఖ్యంగా వితంతువుల విషయంలో..
అప్పటి వరకు గౌరవ మర్యాదలు ఇస్తూ, అన్ని శుభకార్యాలకు పిలుస్తున్నవారు భర్త చనిపోయిన తర్వాత బంధువులు, ఇరుగుపొరుగు వారు ఒక రకమైన వివక్షకు గురిచేస్తారు. అప్పటికే భర్త చనిపోయి మానసికంగా, ఆర్ధికంగా కృంగిపోయిన వితంతువును ఆ పద్దతులు మరింత కృంగదీస్తాయి. ఈ పద్దతులు మారాలి, భర్త చనిపోయినా గాని వితంతువుల పట్ల ఆంక్షలను తొలగించాలని "బాల థెరిస్సా మరియు" సంస్థ సభ్యులు పోరాటం చేస్తున్నారు.
మహిళల అభ్యున్నతి కోసం స్థాపించిన బాలవికాస సంస్థలో వేలాదిమంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరితో నిరంతరం సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యల గురించి విపులంగా తెలుసుకుంటుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వితంతువుల సమస్యల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న వితంతువుల సమస్యలు తెలుసుకుని అక్కడి సభ్యులందరూ ఎంతో కలతచెందారు. ఆర్ధికంగా కన్నా సామాజిక పరమైన వివక్షే వీరిని మరింత కృంగదీస్తుందని తెలుసుకున్నారు. ఆ వివక్ష వల్ల ఎంతటి ప్రమాదాలు జరిగాయనంటే 5,000(15,000 బాల వికాస సభ్యులలో) వితంతువులలో 29% వితంతువులు సంఘం నుండి ఎదురైన మార్పును తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలిసింది. పరిస్థితి మరింత క్షీణించిపోయిందని తేలడంతో అంతే వేగంగా ఉద్యమం మొదలయ్యింది. ముందుగా కొంతమంది వితంతువులతో మాట్లాడి పూలు, బొట్టు, గాజులు వేసుకోవాలని సూచించారు.
బాల వికాస సభ్యుల ముందు పూలు, కుంకుమ పెట్టుకున్నా కాని తర్వాత నలుగురు నాలుగు రకాలుగా భావిస్తారని భయపడి తీసివేశారు. "బాధ పోయేటప్పుడే బాధ ఉంటుంది. మీరు ముందు ఈ బాధను తట్టుకోండి ఆ తర్వాత మీరు ఊహించిన జీవితం లభిస్తుంది" అని వివరించడంతో పదుల సంఖ్యలో నుండి వేల సంఖ్యలోని వితంతువులు అన్ని రకాల కట్టుబాట్లపై వివక్ష చూపుతున్నారు. కేవలం వితంతుల సమస్యలే కాదు మహిళల అభ్యున్నతికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పోరాడడం వారికి అన్నిరకాలుగా అండగా నిలబడడం ఇలాంటి వాటిని తమ కర్తవ్యంగా నిర్వహిస్తున్నారు. మనిషిని మరింత వెనుకబాటుకు గురిచేసే ఆ సత్యాన్ని అసత్యాలను చేసి నూతన సత్యాన్ని తెలియజేస్తున్న బాల థెరిస్సా గారికి ఎన్నో వేల వందనాలు..