This Story Of A Woman Who Was Forced Into Prostitution Is Extremely Heartbreaking

Updated on
This Story Of A Woman Who Was Forced Into Prostitution Is Extremely Heartbreaking

ఓ వేశ్య కథ

ఫరిదాబాద్ రైల్వే స్టేషన్,హజ్రత్ నిజాముద్దీన్ – సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్ష్ప్రెస్ . సమయం ఉదయం 6.10 నిముషాలు . రైలు వేగంగా ముందుకు కదులుతుంది. కిటికీ పక్కన కూర్చున్న నాకు ఈ ప్రపంచం ఎందుకో ఎప్పుడూ లేనంత అందంగా ఉంది ఈవేళ , రైలు కిటికీ నుండి చూస్తుంటే వెనక్కి వెళుతున్న చెట్లు కొండలు అన్నీ నాకు వీడ్కోలు చెప్తున్నట్లుగా ఉన్నాయి . దూరంగా ఉదయిస్తున్న సూర్యుడు నా జీవితంలోకి కొత్త వెలుగుని తీసుకోస్తున్నటుగా ఉంది .ఈ రోజు కోసమే ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాను,ఈ ఉదయం కోసం,ఈ సూర్యోదయం కోసమే నా ఇన్నేళ్ళ నిరీక్షణ. ఇన్నాళ్ళ సంఘర్షణ . ఇన్ని రోజులకి నాకు ఆ చెరసాల నుండి విడుదల లబించింది . ఇవాల్టి నుండి నేనెవరికీ బానిసను కాదు . నేనో స్వేచ్చ జీవిని ఇవాల్టి నుండి,ప్రతీ రాత్రి రేపటి రోజు ఎలా ఉంటుందో అనే భయంతో ఉండే నాకు ఈరోజు నుండి అ భయలేవి ఉండవు. ప్రతే సారీ తలుపు తట్టిన శబ్దం వస్తే వెన్నులో పుట్టే వణుకు ఉండదిక, చీకటి లో అరుపులు ఉండవు,బాదించే గాయాలు ఉండవు,బెదిరించే పిలుపులు ఉండవు . రోజూ గుండెలదిరేల లోలోపల ఏడ్చే ఏడుపులు ఉండవు .ముక్కూ మొహం తెలీని వాడితో పడుకోవాల్సిన అవసరం లేదు . వందకి రెందొందలకి పైట చార్చాల్సిన పని లేదు . ఆ నరకం నుండి నాకు విముక్తి దొరికింది . రోజుకి కొన్ని వందల సార్లు దేవుడిని తిట్టుకునే నేను ఈరోజు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా,మళ్ళీ నా జీవితంలోకి వెలుగుని ప్రసరించినందుకు . కన్నీళ్ళు తప్ప మరోటి తెలీని నాకు,ఈరోజుమాత్రం ఆ కన్నీళ్ళకి తోడుగా పెదాల పై చిరునవ్వు కూడా ఉంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. ఆరేళ్ళ ప్రత్యక్ష నరకం తరువాత అక్కడ నుండి బయట పడడం మళ్ళి ఇంటికి వెళ్ళడం నాకు పునర్జన్మ తో సమానం.

దాదాపు ఆరేళ్ళ క్రితం ఇంటర్ పరీక్షలు అయిపోయాక అమ్మా నాన్న,అన్నయ్య అందరం కుంభమేళకి హరిద్వార్ వచ్చాం . ఎంతో ఆనందంతో సంతోషంగా ఉన్న రోజులు అవి,హాయిగా సెలవుల్లో అన్నయ్యతో చేసిన అల్లరి ఇంకా గుర్తుంది , నానమ్మ అస్తికలు గంగలో నిమజ్జనం చేయడానికి వెళ్ళేప్పుడు ఆ జనంలో తోపులాటలో అందరూ ఒక దారిలో నేనొక దారిలో వెళ్ళాను,అదే చివరి సారి నాన్నని చూసింది,ఆ జనంలో ఎక్కడ వెతకాలో తెలియలేదు,మళ్ళీ వెనక్కి వస్తారు అని అక్కడే ఉండిపోయా,ఈలోగా మేము నాలుగు రోజులుగా ఉంటున్న హోటల్ వాచ్ మాన్ కనపడ్డాడు. ప్రాణం లేచొచ్చింది. నాకోసం వెతికి చివరికి హోటల్ కే వస్తారు కదా,ఇక్కడ ఉండడం ఎందుకు ఇంత తోపులాటలో అని చెప్పి హోటల్ కి వెళ్దాం అన్నాడు .ఆ మాట నమ్మడమే నేను చేసిన అతి పెద్ద తప్పు,దాహం అని అడిగితే ఎదో కూల్ డ్రింక్ ఇచ్చాడు ,కళ్ళుతిరిగినట్టు అయ్యింది . తరువాత ఎం జరిగిందో తెలిలేదు,స్పృహలోకి వచ్చాక చూస్తే ఎదో చీకటి గది లో ఉన్నాను, ఎక్కడున్నానో తెలిదు,బయటకొచ్చాక చూస్తే అదంతా ఎదో వేరే ప్రపంచంలా ఉంది,నేనేక్కడున్నానో అర్ధం అవ్వలేదు. పక్కన ఇంకొందరు ఆడవాళ్ళు ఉన్నారు ,వాళ్ళు ఇక్కడి వాళ్ళలా లేరు,నేపాలీ వాళ్ళలా ఉన్నారు . నేనేం మాట్లాడినా వాళ్ళకి అర్ధం అవట్లేదు,ఎవరో పెద్దావిడ వచ్చింది ఆమెని ఎంతగానో బతిలాడితే నన్ను ఆ వాచ్ మాన్ పదివేలకి అమ్మేసాడని చెప్పింది . డిల్లిలో జిబి రోడ్ లో ఉన్నానని,ఇది సెక్స్ వర్కర్స్ ఉండే చోటని చెప్పింది . గుండె ఆగినట్లు అనిపించింది ఆ మాట వినగానే,ఆమెకి నా గురించి అంతా చెప్పి నన్ను బయటకి పంపించండి మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు మావాళ్ళు ఇస్తారు అని ఎంతగా బతిలాడినా వినలేదు, కాళ్ళు పట్టుకున్నా ఆమెకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు,జుట్టు పట్టుకొని చెంప మీద కొట్టి గదిలో పెట్టి తాళం వేసింది . ఎంత అరిచినా ఏడ్చినా ప్రయోజనం లేదు,మూడురోజులు తిండీ తిప్పలు లేవు ,ఏడ్చీ ఏడ్చీ గొంతు ఎండుకుపోయింది,ఎవరో ఒకామె వచ్చి ప్లేటు లో చపాతీ తెసుకోచ్చింది,పక్కన కూర్చొని తినిపించింది,ఆమెని పట్టుకొని ఏడ్చేసాను మళ్ళి , తను జాలిగా నావైపు చూసిందే తప్ప తను కూడా ఏమి మాట్లాడలేదు,చపాతీ తిన్నాక ఓ గదిలోకి తీసుకెళ్ళారు , కొత్త బట్టలు ఇచ్చి ఎదో అలంకరణ చేసారు అక్కడి వాళ్ళు, మళ్ళి నన్ను ఒక్కదాన్నే గదిలోకి పంపారు.

ఆ తరువాత జరిగింది తలుచుకోడానికి కూడా భయమేస్తుంది . గుర్తు చేసుకోడానికి కూడా అసహ్యమేస్తుంది.ఆ రోజున మొదలయ్యింది ఆ నరకం ఆరేళ్లు ...ఒకటి కాదు రెండు కాదు ఆరేళ్లు మాటల్లో చెప్పడానికి కూడా లేనంత భాద ,ఎవరికీ చెప్పుకోలేని వేదన,ఎవరికి చెప్పినా అర్ధం అవ్వదు ఆ భాద . ఎదురు తిరిగితే ఒంటి మీద వాతలు ,దెబ్బలు . ఒళ్ళంతా పచ్చి పుండులా మారినా,చివరికి ఆ రోజుల్లో కూడా కనికరం లేకుండా గదిలోకి పంపేవాళ్ళు . తలుచుకుంటేనే మళ్ళి గుండె బరువెక్కుతుంది, మొత్తానికి ఆ కూపం నుండి బయటపడ్డాను ఎలాగో తప్పించుకొని,ఇదంతా ఓ పీడ కలలా మర్చిపోవాలి . అక్కడ ఇంటి దగ్గర నా కోసం నాన్న ఎంత బెంగ పెట్టుకొని ఉన్నారో ,అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంది ఉంటుంది ఇన్నేళ్ళు , అన్నయ్య ఎలా ఉన్నాడో, నా చదువు కొనసాగించాలి ,కొత్తగా మళ్ళి నా జీవితం మొదలెట్టాలి .ఛా.. నాతోపాటు ఆర్తిని కూడా బయటికి తీసుకొస్తే బావుండు,పాపం చిన్న పిల్ల ఈ దేశం కూడా కాదు,పాపం తనని చూస్తే నాలానే అనిపించింది,ఎంత తప్పు చేశా, తనని కూడా తెసుకురావాల్సింది, అక్కడ ఎలా ఉంటుందో ఏమో .

మనసులో ఇంటికి వెళ్తున్నాననే ఆనందం ఒక పక్క,ఆర్తి గురించి ఆందోళన ఒక పక్క, ఇంతలో ఎవరో బలంగా భుజం తట్టినట్టు అనిపించింది ,తిరిగి చూస్తే ... ఎవరో ఒకతను కోపంగా.....రండీ ఉట్...చార్ గంటె మే ఆదె గంటా సో గయే .. ఉట్ సాలి ..... అని కోపంగా అరిచాడు, ఒక ఐదు నిముషాల తరువాత తన పని పూర్తి చేసుకొని రెండువందలు నా పక్కన పడేసి వెళ్లబోతుంటే...సాబ్ ... తీన్ సవ్ సాబ్,తీన్ సవ్ దేదో సాబ్, నై తో వో హమే మారేగి...తీన్ సవ్ దేదో సాబ్

చల్ సాలీ ....తీన్ సవ్ చాహియే...చార్ దిన్ కే బాద్ ఫిర్ ఆవుంగా,అబ్ దేదూంగా తీన్ సవ్,ఆజ్ కో దో సవ్ బస్

ఇదే నా బతుకు,నాదే కాదు నాలాంటి ఎంతో మంది అమ్మాయిల బతుకులు ఇంతే ఇక్కడ,ఇక్కడ బతక లేము, ఇక్కడ బతుకు లేదు . ….ఈ కథ మారదు,ఆ కల తీరదు.

కొన్ని బతుకులంతే వెలుగుకి దూరంగా వెలివేయబడి ఉంటాయి,ఈ జీవితాలింతే చీకటిలోనే తెల్లారిపోతాయి.

An Ignored Fact - Globally, almost 80% of the human trafficking is related to sexual exploitation, while the rest is bonded labour. And, India is allegedly the hub of these crimes in Asia .