ఇతనితో మాట్లాడితే నాకేంటి ఉపయోగం.? ఇతని దగ్గర డబ్బులున్నాయా.? లేదంటే పరిచయాలు కానీ సంఘంలో మంచి పేరు గుర్తింపు లాంటివేమైనా ఉన్నాయా.? అని వ్యక్తిని చూడగానే వెంటవెంటనే స్కాన్ చేసి, డెబిట్ క్రెడిట్ బేరీజు వేసుకుని అప్పుడు నటించడం మొదలుపెడుతున్నారు. మరి పైన చెప్పిన వాటిల్లో ఇవ్వేమి లేనివారి పరిస్థితి ఏంటి.? వీరు ఈ దేశంలో సెకండ్ క్యాటగిరి పౌరులుగానే బ్రతకాల్సిందేనా.? దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అని అంటారు.. అదిగో అలాంటి సహాయం అందించే ఒక మాములు మనిషే పూర్ణశాంతి గారు.

శాంతి గారు పేదల ఆకలి తీరుస్తారు, చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సహాయం చేస్తుంటారు, వృద్ధుల బాగోగులు చూసుకుంటారు, పోయిన వారి గురుంచి ఏడవాలా దహనం చెయ్యడానికి డబ్బులు లేవని బాధపడాలా అనే వారి దగ్గరికి వెళ్లి పూర్తిగా వారి సంప్రదాయబద్ధంగా అంతిమసంస్కారాలు చేయిస్తారు. పేదలు శాంతి గారిలో దేవుడిని చూస్తే శాంతి గారు మాత్రం పేదలలో భగవంతుడిని చూస్తానని అంటారు.

దహణసంస్కారాలు: అది ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ కావచ్చు, మరే ఇతర స్లమ్ కావచ్చు.. ఎవరో చనిపోయారు కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు, శాంతి గారైతే సహాయం చేస్తారని సమాచారం చేరుకుంటుంది. ఉదయం 10 అవ్వనివ్వండి, రాత్రి 2 అవ్వనివ్వండి శాంతి గారు అక్కడికి చేరుకుంటారు. సొంత ఖర్చులతో వెహికిల్ మాట్లాడి అవసరమైతే సొంత ఊరుకు కుటుంబంతో సహా అక్కడికి తీసుకువెళ్తారు. పెళ్లిళ్లు ఇతర కార్యాలతో పోల్చుకుంటే దహన సంస్కార కార్యక్రమం అత్యంత కఠినతరమైనది బాధకారమైనది, ఇంకోసారి స్మశానానికి అడుగుపెట్టకూడదు అని అనుకుంటారు. కానీ శాంతి గారు అలా అనుకోరు, నా సహాయం వీరికి అవసరం ఉంది అని దాదాపు రెండు సంవత్సరాలుగా ఎన్నో దహణసంస్కారాలు పూర్తిచేశారు.

ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం: మన హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో ఉచిత ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి, ఒక్కోసారి వాటిని కొనసాగించడానికి నిర్వాహకులకు కష్టతరం అవుతుంది. వారికోసం తన వ్యక్తిగత సహాయంతో పాటు, దాతల నుండి బట్టలు, ఫ్రిజ్ లు, గ్రైండర్లు, మిక్సీలు, కూలర్లు లాంటివెన్నో కలెక్ట్ చేసి అందిస్తుంటారు. శాంతి గారు నాన్న గారిని చూస్తూ చిన్నతనం నుండే వాలంటీర్ గా ఎన్నో సేవకార్యక్రమాలలో పాల్గొనేవారు.

పెళ్లిళ్లు, కుట్టు మిషిన్లు: నేను ఈ సహాయం మాత్రమే చేస్తాను అని దానికే అంకితమవ్వకుండా అన్నిరకాల అవసరాలకు వారు ముందుంటారు. మన తెలంగాణలోని వివిధ ప్రాంతాలలోని 15 జంటలకు ఉచితంగా మంగళసూత్రం, భోజన ఖర్చులను భరించి వారి వివాహం చేయించారు, దాదాపు 60 మందికి పైగా ఉన్న నిరుపేద మహిళలకు వారి సొంతకాళ్లపై వారు నిలబడేందుకు కుట్టు మెషీన్లను అందించి అండగా నిలబడ్డారు, బ్యూటీ పార్లర్లో ట్రైనింగ్, వేలు ఖర్చుబెట్టి టీ స్టాల్స్ పెట్టించడం, వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ, వృద్దులకు ఉచిత తీర్థయాత్రలు.. ఇలా చెప్పుకుంటే వారి ఇల్లు ఎప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అదిగో ఆ భగవంతుడు పంపిన అవదూతగా శాంతిగారిని గౌరవించుకోవచ్చు.



