చదవటం మొదలు పెడితే ముగించే వరకు మనసు ఊరుకోదు, అందుకేనేమో ఆ రోజుల్లో వంటింట్లో పోపులు మాడిపోయేవి, పాలు పొంగిపోయేవి. ఇంట్లో మగవాళ్ళు లంచ్ బాక్స్ కోసం ఎదురుచూపులు చాలా కామన్. ఇలాంటి విషయాలు ఆనాటి ఆడవాళ్లకు నేటికీ మధురానుభూతులు. వీటన్నిటికీ కారణం ఒక నవల. ఆమె పుస్తకం వచ్చిందంటే చాలు మహిళలు ఎగబడి కొనేవారు అంటే అతిసయోక్తి కాదు. ఇంత గొప్ప అభిమానం సంపాదించుకున్న ఆ రచయిత ఎవరనుకున్నారా ? ఆవిడే నవలాలోకపు రాణి "యద్దనపూడి సులోచనారాణి". ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన కృష్ణ తీరం లోని కాజా అనే ఊరు యద్దనపూడి గారి జన్మస్థలం. ఆ కాలంలో ఆమె కాలం నుండి జాలువారే ప్రతి కథ ఒక సంచలనమే.
స్వర్ణోత్సవ "సెక్రటరీ":
రాఘవయ్య గారు, బాపు గారు, రమణ గారు అప్పట్లో జ్యోతి అనే మాస పత్రికను ప్రారంభించారు. అప్పటిదాకా చిన్న చిన్న కథలు రాస్తూ ఉన్న యద్ధనపూడి గారిని ప్రత్రిక కోసం ఒక నవల ను రాయమన్నారు. ముందు కొంచెం జంకినా తరువాత సరే అన్నారు. వెంటనే ఎదో ఒక పేరు చెప్పండి అని అడిగారు. ఇప్పటికి నాకు "సెక్రటరీ" అనే పేరు ఎలా తట్టిందో అర్ధం కాదు అని ఎప్పుడు ఆమె అంటూవుంటారు. అలా ఒక గొప్ప కధకు బీజం పడింది ఆ వేళ. ఒక మధ్య తరగతి అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అంటే ఆ రోజుల్లో వింతగా చూసే వారు. అలాంటి ఒక మధ్య తరగతి అమ్మాయే "జయంతి". మంచిగా చదువుకుని, ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలి అనే తపన తో ఉండేది. ఈ కధలో ఉన్న జయంతి పాత్రలో ప్రతి మహిళా తనను తాను ఊహించుకుంటుంది. మధ్య తరగతి వారి ఆశలు, ఆశయాలు, బంధాలు, బంధుత్వాలు తన కథలతో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు యద్దనపూడి గారు. 1964 - 65 మధ్యలో "సెక్రటరీ" జ్యోతి మాస పత్రిక లో ఒక సీరియల్ గా ప్రచురితమైంది. 1966 అది పుస్తక రూపం దాల్చింది. 2016 కి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ నవల ఇప్పటిదాకా ౧౦౦కు పైగా ముద్రణలు పొందింది , సుమారు లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయి ఉంటాయి అని ఒక అంచనా. లక్షలాది మహిళలని ప్రభావితం చేసిన ఈ సెక్రటరీ వెండి తెర పై కూడా ఒక వెలుగు వెలిగింది. వాణిశ్రీ, ANR లు జంటగా నటించిన ఈ చిత్రం ఆనాడు తెరెకెక్కిన ఈ నాటి మహిళ కథ అని చెప్పుకోవచ్చు.
స్త్రీ తత్వం :
మధ్య తరగతి మనస్తత్వాలు, ,మన చుట్టూ కనిపించే జీవితాలే ఆమె కథ వస్తువులు. ఆత్మభిమానం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే అమ్మాయిలే ఆవిడ నవలా నాయికలు. నవల చదువుతున్నంత సేపు మనసుకు హాయిగా, ఆహ్లాదంగా అందమైన ఊహ ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. కోడూరి కౌసల్య దేవి, మదిరెడ్డి సులోచన, రంగనాయకమ్మ, మాలతీ చందూర్ వంటి ప్రతిభావంతులైన రచయిత్రుల మధ్య తనదైన శైలి తో నవలాలోకాన్ని దశాబ్దాల పాటు యేలారు యద్దనపూడి గారు. ఆమె రాసిన ప్రతి పుస్తకము అమృతమే. అన్నిటికి మించి ఆమె రచన శైలి, పాత్రల వర్ణన పాఠకులను విపరీతంగా ఆకట్టుకునేది. అందుకే పాఠకులు ఆమె పుస్తకం ఒక అందమైన అనుభవం. ఆమె రాసిన ప్రతి కథలో ప్రధానం గా స్త్రీ సమస్యలే కనిపిస్తాయి. దాని చుట్టూ ఒక ప్రేమ కథ అల్లుకుని ఉంటుంది. సమాజం లో స్త్రీకి ఒక లెక్క, పురుషునికి ఒక లెక్క అంటే ఆమె అసలు ఒప్పుకోరు. ఎవరి అహం దెబ్బతినకుండా పాత్రల ద్వారా దీనిని వర్ణించటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. మధ్య తరగతి అమ్మాయిలే లక్ష్యం గా ఆమె నవలలు రాసేవారని అప్పట్లో విమర్శలు కూడా ఉండేవి. సమాజం లో అమ్మాయిల వాస్తవ ఆలోచనలే కథలో పాత్రల ద్వారా చెబుతుంటా అని ఆమె అంటుండేవారు.
బుల్లి తెర నుండి వెండి తెర దాకా :
యద్దనపూడి గారు రాసిన ఎన్నో నవలలు వెండితెర పై చిత్రాలుగా ఒక వెలుగు వెలిగాయి. ఆమె రాసిన మీనా, సెక్రటరీ, జీవన తరంగాలు ఇలా దాదాపు పది - పదిహేను నవలలు చిత్ర రూపం దాల్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యద్దనపూడి రాసిన "మీనా" నవల ఆధారంగానే "అ ఆ" సినిమాను తెరకెక్కించారు. వెండితెరేకే కాదు బుల్లి తెర పై కూడా ఆమె ప్రేక్షకులను తన డైన కథలతో రంజింప చేస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే మొదటి తెలుగు మెగా డైలీ సీరియల్ ఋతురాగాలు కథ కూడా యద్దనపూడి గారి కాలం నుండి వెలువడిందే. డైరెక్టర్ మంజుల నాయుడు గారి తో కలిసి ఆమె చాలా సీరియల్స్ కు కథ రాసారు. ప్రస్తుతం రచనలకు దూరం గా ఉన్న ఆమె, సమాజ సేవకు దగ్గరయ్యారు. మదర్ తెరెసా ను ఆరాధిస్తూ ఆమె మార్గం లోనే నడుస్తున్నారు. ఎంతమంది రచయితలు వచ్చిన , సాహిత్యానికి ఆదరణ కొరవడిన ఆమెకు సాహితీలోకం లో చిరస్మరణియమైన స్థానం ఉంటుంది. సగటు తెలుగు ప్రేక్షకుడి మనసుకు దగ్గరగా ప్రతి పాత్ర ను ఆమె వర్ణించే తీరు ఆమెను నవలలోకపు రాణిని చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఆమె రచనలకు ఉన్న అభిమానం చుస్తే ఆ పేరు సార్ధకం అని అనిపిస్తుంది.